Mar 06,2023 23:21
మాట్లాడుతున్న కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌


ప్రజాశక్తి-పాడేరు టౌన్‌: ఈ నెల 13న జరగనున్న పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల నిర్వహణకు అధికారులు, సిబ్బంది పోలింగ్‌ నిర్వహణకు సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ ఆదేశించారు. సోమవారం ఐటిడిఎ సమావేశ మందిరంలో ఎన్నికల జోనల్‌, రూట్‌, నోడల్‌, ప్రిసైడింగ్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, 11 మండలాల్లో 14 పోలింగ్‌ కేంద్రాల (అరకులో 2, పాడేరులో 2, సీలేరులో 2) తో పాటు హుకుంపేట మండలంలో అనుబంధ పోలింగ్‌ కేంద్రంతో కలిపి 15 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. ఇందుకు సంబంధించి 5 జోన్‌లు, 5 రూట్‌లుగా విభజించటం జరిగిందన్నారు. తలారిసింగి పాఠశాలలో డిస్ట్రిబ్యూషన్‌, రిసెప్సన్‌ కేంద్రాలతో పాటు తాత్కాలిక స్ట్రాంగ్‌ రూమ్‌ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. పిఒ, ఎపిఒ, ఒపిఒలు 12వ తేదీ ఉదయం 8 గంటలకే అక్కడికి చేరుకొని ఎన్నికల సామాగ్రి తీసుకుని కేటాయించిన బస్సులలో జోనల్‌, రూట్‌ అధికారి పర్యవేక్షణలో కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు చేరుకోవాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో స్వంత వాహనాల్లో ఎన్నికల సామగ్రి తీసుకువెళ్లడం లేదా స్వయంగా ప్రయాణించడం చేయరాదని హెచ్చరించారు. ఎన్నికల నిభందనలు పక్కాగా పాటించాలని స్పష్టం చేసారు. తహసిల్దార్లు, ఎంపిడిఒలు, స్టేషన్‌ హౌస్‌ అధికారులు పోలింగ్‌ కేంద్రాల బయట గుంపుగా వ్యక్తులు లేకుండా చూడాలని ఆదేశించారు. సమస్య ఎదురైతే వారి ప్రత్యేక అధికారుల ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. ఒక్కో పోలింగ్‌ కేంద్రానికి నలుగురు సిబ్బంది ఉంటారని తెలిపారు. నోడల్‌, జోనల్‌, రూట్‌ అధికారులు పరస్పర సహాయ సహకారాలతో ఎన్నికల పోలింగ్‌ నిర్వహించాలన్నారు. పోలింగ్‌ కేంద్రాలకు ఎన్నికల సామగ్రి చేరే విధంగా నోడల్‌, జోనల్‌, రూట్‌ అధికారులు భాద్యత వహించాలని తెలిపారు. పోలింగ్‌ ముందు రోజే ఆయా పోలింగ్‌ కేంద్రాలలో మంచి నీరు, మరుగుదొడ్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. సిసి కెమెరాల ఏర్పాటులో జాగ్రత్తలు తీసుకోవాలని సబంధిత ఇంచార్జ్‌ హౌసింగ్‌ పిడిని ఆదేశించారు. జోనల్‌ అధికారులు ఎప్పటికప్పుడు పోల్‌ వివరాలను కలక్టరేట్‌ లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. రూట్‌ అధికారులు వారికి కేటాయించిన రూట్‌ లలో సిబ్బందిని చేరవేయాలన్నారు. ప్రిసైడింగ్‌ అధికారి డైరీ అత్యంత కీలకమని డైరీని అన్ని వివరాలతో పూరించి సీల్డ్‌ కవర్లో పెట్టి ప్రత్యేక కౌంటర్‌లో అందజేయాలన్నారు. బ్యాలట్‌ పేపర్‌, పేపర్‌ సీల్‌ అకౌంట్లని జాగ్రత్తగా నమోదు చేసి అందజేయాలని పేర్కొన్నారు. పోలింగ్‌ కేంద్రంలోకి పిఒకు తప్ప ఎవ్వరికీ మొబైల్‌ అనుమతి లేదని, మీడియా వ్యక్తులకు పోలింగ్‌ కేంద్రంలోనికి అనుమతి లేదని కలక్టర్‌ స్పష్టం చేసారు.
మూడంచెల రక్షణ : ఎస్‌పి
ఎస్‌పి సతీష్‌ కుమార్‌ మాట్లాడుతూ, మూడంచెల రక్షణ విధానంలో పోలీసులు విధులు నిర్వర్తిస్తారని, ఎన్నికల సిబ్బంది ఎటువంటి భయానికి లోను కాకుండా సురక్షితంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద యునిఫాంలో విధులు నిర్వర్తిస్తారని, మిగిలిన ప్రాంతాలలో సివిల్‌ డ్రస్‌లో కుడా విధులు నిర్వర్తిస్తారని, పోలీసులు లేరనే అపోహ పడవద్దని తెలిపారు. వారం రోజుల ముందునుంచే అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని, ప్రతి రూట్‌ లో ఆయా స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ పర్యవేక్షిస్తారని తెలిపారు. ఇది కాకుండా స్త్రైకింగ్‌ ఫోర్సు కూడా పని చేస్తుందన్నారు. సమస్యలుంటే స్పెషల్‌ బ్రాంచ్‌ సిఐ అన్ని శాఖల సిబ్బందితో సమన్వయము చేసుకుని పరిష్కరిస్తారని, అవసరమైతే స్థానిక పోలీసుకు తెలియజేస్తారని వివరించారు. అనుమానితులను బైండ్‌ ఓవర్‌ చేస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జెసి జె.శివ శ్రీనివాసు, సబ్‌ కలక్టర్‌ వి.అభిషేక్‌, డిఆర్‌ఒ పి.అంబేద్కర్‌, ఎన్నికల ప్రత్యేక అధికారులు, జోనల్‌, రూట్‌, నోడల్‌ అధికారులు, ప్రిసైడింగ్‌ అధికారులు, పిఒలు, ఎపిఒలు, తహసిల్దారులు, ఎంపిడిఒలు, తదితరులు పాల్గొన్నారు.