ప్రజాశక్తి-నక్కపల్లి:ఈనెల 13న జరగనున్న ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డిఎస్‌పి ప్రవీణ్ కుమార్ తెలిపారు. నక్కపల్లి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాన్ని ఆదివారం సాయంత్రం స్థానిక ఎస్‌ఐ శిరీష తో కలిసి పరిశీలించారు. పోలింగ్ జరిగేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు, భద్రత చర్యలపై చర్చించారు. బందోబస్తు ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు.
యస్.రాయవరం:మండలంలోని ధర్మవరం పోలింగ్ బూత్‌ను నర్సీపట్నం డిఎస్పీ కె.ప్రవీణ్ కుమార్ తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశామని తెలిపారు.ఆయన వెంట తహశీల్దార్ వై.శ్యామ్ కుమార్, సిఐ నారాయణరావు, ఎస్‌ఐ ప్రసాదరావు పాల్గొన్నారు.
కోటవురట్ల:పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని ఆదివారం సిఐ నారాయణరావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ. నక్కపల్లి సర్కిల్ పరిధిలో నాలుగు పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కోటవురట్ల1, రాయవరం1, నక్కపల్లి2, కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్ పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చంద్రశేఖర్, స్థానిక ఎస్సై నారాయణరావు పాల్గొన్నారు.
పోలింగ్ కేంద్రం పరిశీలన
నక్కపల్లి:నక్కపల్లిలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను ఆదివారం ఎంపీడీవో సీతారామరాజు, ఎస్‌ఐ శిరీష పరిశీలించారు. బందోబస్తు ఏర్పాటుపై ఎస్‌ఐ శిరీషను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద విద్యుత్, తాగునీరు, ఇతర సౌకర్యాలను పరిశీలించారు. పోలింగ్ స్టేషన్‌లో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో రెండు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.రెండు పోలింగ్ కేంద్రాల్లో మొత్తం 1118 మంది ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
కోటవురట్ల:ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి సిబ్బంది పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. 1092 ఓట్లుకు గాను నలుగురు సిబ్బందిని నియమించారు. అదే విధంగా నాలుగు బాక్సులు సిద్ధం చేశారు. పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరా ఏర్పాటు చేయడంతో పాటు సిబ్బందికి, ఓటర్లకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు స్థానిక తహసిల్దారు జానకమ్మ తెలిపారు. పట్టబద్రులు ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.
గొలుగొండ:మండలంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తహశీల్దార్ ఆనందరావు తెలిపారు. మండలంలో 1044 పట్టభద్రుల ఓట్లు ఉన్నాయి. వీరంతా ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మండల కేంద్రంలో ఎంపిపి పాఠశాలలో పోలింగ్ బూత్ కేటాయించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ, ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. కేంద్రానికి వంద మీటర్ల దూరం వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు.ఎస్సై నారాయణరావు ఆధ్వర్యంలో పోలింగ్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
నర్సీపట్నం టౌన్: పట్టభద్రుల ఎన్నికల నేపథ్యంలో నర్సీపట్నం జిల్లా పరిషత్ మెయిన్ స్కూల్ వద్ద నాలుగు పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు డిఎస్‌పి ప్రవీణ్ కుమార్, ఎస్‌ఐ గోవిందరావులు తెలిపారు.ఎటువంటి అవాంతరాలు ఎదురవకుండా ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.
పోలీసుల కవాతు
గొలుగొండ:ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపధ్యంలో మండల కేంద్రంలో ఎస్సై నారాయణరావు ఆధ్వర్యంలో పోలీస్ కవాతు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో పోలింగ్ కేంద్రాల వద్ద శాంతి భద్రతలకు భంగం కలగకుండా పోలీస్ కవాతు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ ఎన్నికల సందర్భంగా 30 మందితో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు.










