ప్రజాశక్తి- అనకాపల్లి
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ తుది ఓటర్ల జాబితాలో లోపాలను సరిదిద్దాలని కోరుతూ జిల్లా రెవెన్యూ అధికారి వెంకటరమణకు సిపిఎం అనకాపల్లి జిల్లా కమిటీ బుధవారం వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి కె.లోకనాథం మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా అర్హత లేని నిరక్షరాస్యులకు, ఐదవ తరగతి, పదో తరగతి, ఇంటర్, డిప్లమో, జిఎన్‌ఎంలను కూడా ఓటర్ల జాబితాలో చేర్చారని తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను పొందుపరచడం జరిగిందని, విచారణ చేపట్టి అవకతవకలను సరి చేయాలని కోరారు. మండలాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని ఎక్కడ వారికి అక్కడే ఓటు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గనిశెట్టి సత్యనారాయణ, వివి శ్రీనివాసరావు, అల్లు రాజు. ఆళ్ల మహేశ్వరరావు పాల్గొన్నారు.
అవకతవకలను సరిచేయాలని వినతి
మునగపాక రూరల్ : ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఓటర్ల జాబితాలో అనేక అవకతకులు చోటుచేసుకున్నాయని, వాటిని సరి చేయాలని కోరుతూ మండల తహశీల్దారు కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌కు బుధవారం సిపిఎం నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వివి.శ్రీనివాసరావు మాట్లాడుతూ మునగపాక మండలంలో డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ఇచ్చినప్పుడే డిగ్రీ లేని 43 మందిని గుర్తించి వారి సీరియల్ నెంబర్లతో సహా మండల తహసీల్దార్‌కు ఇచ్చామని, అయినా తుది ఓటర్ల జాబితాలో పదో తరగతి, డిప్లమో అర్హతతో కూడిన వారు, అసలు చదువు రాని వారి పేర్లు ఉండడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట అని పేర్కొన్నారు. పోలింగ్ స్టేషన్ నెంబర్ 196లో పదవ తరగతి, డిప్లమో, అసలు చదువు లేని వారు 20 మంది వరకు ఉన్నారన్నారు. ఇదే పోలింగ్ బూత్‌లో విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం, గాజువాక, కంచరపాలెం, మద్దిలపాలెం మధురవాడ, మల్కాపురం, పెదగంట్యాడ, అల్లూరి సీతారామరాజు జిల్లా మజ్జిపుట్టు, అనకాపల్లి జిల్లాలోని పరవాడ, పాయకరావుపేట వంటి మండలాల ఓట్లు వందకు పైగా మునగపాక మండల ఓటర్ల జాబితాలో ఉన్నాయని పేర్కొన్నారు. ఇతర మండలాల ఓటర్ల పేర్లు ఈ మండలంలో ఉంటే ఆయా మండలాల్లో వారు ఓట్లు లేకపోవడంతో అర్హులైన వారు తమ విలువైన ఓటు హక్కు వినియోగించుకునే అవకావం కోల్పోతారని, దీనికి బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కన్వీనర్ ఎస్ బ్రహ్మాజీ నాయకులు ఆళ్ళ మహేశ్వరరావు పాల్గొన్నారు.










