ఎమ్మెల్సీ ఓట్ల నమోదులో భారీ అవకతవకలు : సిపిఎం
పజాశక్తి - గూడూరు
ఎంఎల్‌సి ఓట్ల నమోదులో భారీ అవకతవకలు చోటు చేసుకున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మూలం రమేష్ విమర్శించారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో అనేక బోగస్ ఓట్లు చేర్చారన్నారు. వీటిని సరిజేయకపోతే పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. గూడూరు సిపిఎం కార్యాలయంలో పార్టీ సభ్యులు, సానుభూతిపరులతో జనరల్ బాడీ సమావేశం శుక్రవారం జరిగింది. ఎంఎల్‌సి ఓట్ల నమోదులో జరిగిన అవకతవకలను వెలికితీసి కలెక్టర్ దృష్టికి, ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్లామన్నారు. అధికార పార్టీ ఎక్కువ భాగం సర్టిఫికేట్లు లేకపోయినా ఓటరుగా నమోదు చేశారన్నారు. ఆత్మకూరులో చదువులేని ఏ అర్హత లేని వ్యక్తిని ఓటరుగా నమోదు చేశారని తెలిపారు. పెద్దల ఎన్నికల్లో అధికార పార్టీ ఓటరు నమోదులోనే ఇంతటి అరాచకంగా వ్యవహరించడాన్ని ఖండించారు. తుపానుతో నష్టపోయిన రైతులకు సబ్సిడీ విత్తనాలు ఇవ్వాలని, పంట వేసుకునేందుకు ఆర్థిక సాయం ఇవ్వాలన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడుతూ మాండూస్ తుపాను కారణంగా జిల్లావ్యాప్తంగా రైతులకు పంట నష్టం భారీగా జరిగిందన్నారు. సిపిఎం జరిపిన సర్వేలో దాదాపు 500 కోట్ల రూపాయల వరకూ నష్టం జరిగిందన్నారు. చేనేత కార్మికుల మగ్గాలు తడిచిపోయి పనులు జరిగే పరిస్థితి లేదన్నారు. నష్టపోయిన ప్రతి రైతుకూ ఎకరాకు 15వేల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రతి కుటుంబానికీ 25 కేజీల బియ్యం, పప్పులు, నూనె ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు పామంజి మణి, నాయకులు జోగి శివకుమార్, ఆర్.శ్రీనివాసులు, సుబ్బయ్య పాల్గొన్నారు.










