ప్రజాశక్తి- పిఎం.పాలెం : టిడిపి ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ గెలుపుతో పార్టీ విజయాలు ప్రారంభమయ్యాయని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. పిఎం.పాలెంలోని వి కన్వెన్షన్ హాల్‌లో టిడిపి ఉత్తరాంధ్ర జిల్లాల టిడిపి జోన్-1 సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు హాజరవడంతో ఉత్తరాంధ్ర టిడిపి అభిమానులు భారీ స్థాయిలో సభా ప్రాంగణానికి చేరుకున్నారు. దీంతో వి కన్వెన్షన్ మొత్తం పసుపుమయమైంది. ముందుగా మూడు జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధుల హాజరు నమోదుకు జిల్లాల వారీగా స్టాల్స్ ఏర్పాటుచేశారు. అనంతరం సభా ప్రాంగణంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పార్టీ జెండాను ఎగురవేశారు. జ్యోతి ప్రజ్వలన చేశారు. బాబూ జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి, ఎన్‌టిఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా సిద్ధంగా ఉండేందుకు జోన్లు వారిగా సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే రెండు జోన్లు పూర్తి చేసుకున్నామని చెప్పారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతం వైసిపి ప్రభుత్వ హయాంలో పూర్తిగా అడుగంటి పోయిందని విమర్శించారు. వైసిపి ప్రభుత్వంతో రాష్ట్రానికి దరిద్రం పట్టిందని, ప్రజలు సంక్షోభంలోకి నెట్టబడుతున్నారని ఆరోపించారు. సంపదను సృష్టించి, పేదలకు పంచడం నాయకుడు లక్షణమని, అప్పులు చేసి బటన్‌లు నొక్కడం కాదని ఎద్దేవాచేశారు. నాలుగేళ్ల పాలనలో జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రానికి అభివృద్ధి ఏమీ లేదన్నారు. రానున్న ఎన్నికలలో ఉత్తరాంధ్రలో 34 స్థానాలు టిడిపి గెలుచుకుంటుందని తెలిపారు. ఉత్తరాంధ్రలో టిడిపి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ గెలుపు చూసి వైసిపికి భయం పట్టుకుందన్నారు.
అనంతరం సోషల్ మీడియాలో భాగంగా ఐటిడిపి యాప్ ద్వారా సభ్యత్వాల నమోదు, టెలిగ్రామ్ బాట్ ద్వారా ప్రతినిధులు హాజరు నమోదుపై శిక్షణ, కుటుంబ సాధికార సారధి నియామక ప్రక్రియపై అవగాహన, వైసిపి మోసకారి సంక్షేమంపై అవగాహన, కార్యకర్తల సంక్షేమ, న్యూ ట్రిపుల్ యాప్‌పై అవగాహన, సామాజిక మాధ్యమాలు, వాట్సప్ యాప్‌పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. భోజనం అనంతరం చంద్రబాబు ప్రసంగంతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపయింది. చంద్రబాబు ప్రసంగం అనంతరం ఆయన అభిమానులకు కారు బయట నుంచి అభివాదం చేస్తూ తరలివెళ్లారు. అభిమానులతో జాతీయ రహదారి మొత్తం సందడితో కిక్కిరిసిపోయిన పరిస్థితి కనిపించింది.










