Feb 24,2023 00:37
శిక్షణలో మాట్లాడుతున్న ఇన్‌ఛార్జి కలెక్టర్‌ డాక్టర్‌ కె శ్రీనివాసులు

ప్రజాశక్తి-చీరాల: శాసనమండలి ఎన్నికలను అధికారులందరూ సమిష్టి కృషితో సమర్థవంతంగా పూర్తి చేసేందుకు సహకరించాలని, ఎన్నికలలో ప్రిసైడింగ్‌ అధికారుల విధులు అత్యంత కీలకమైనవి అని జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాసులు అన్నారు. గురువారం చీరాల పురపాలక సంఘం కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల విధులపై ప్రిసైడింగ్‌ ఆఫీసర్లు, సహాయ ప్రిసైడింగ్‌ ఆఫీసర్లకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు జరిగాయి. ఎన్నికలలో బ్యాలెట్‌ బాక్సుల నిర్వహణపై అధికారులకు పూర్తిస్థాయిలో అవగాహన ఉండాలని ఇన్‌ఛాÛర్జి కలెక్టర్‌ తెలిపారు. ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించడానికి అధికారులు సంసిద్ధంగా ఉండాలన్నారు. పిఓల విధులు, పోలింగ్‌ సామగ్రి, ఎన్నికల ముందు నిర్వహించాల్సిన ప్రక్రియ, బ్యాలెట్‌ బాక్సులు సీజ్‌ చేసే విధానంపై అధికారులు అవగాహన పెంచుకోవాలన్నారు. బ్యాలెట్‌ పత్రాల వినియోగం, డిక్లరేషన్‌ ప్రక్రియ చాలా ముఖ్యమన్నారు. ఎన్నికలలో పిఓలు బాధ్యతగా వ్యవహరించాల్సిన తీరుపై ఆయన అవగాహన కల్పించారు. ఎన్నికలు సమర్థంగా నిర్వహించ డానికి శిక్షణలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. బాపట్ల జిల్లా పరిధిలోని 13 మండలాలలో గ్రాడ్యుయేట్‌, ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలు జరుగుతాయన్నారు. ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలననుసరించి పిఓలు, ఏపిఒలు విధులు నిర్వహించాల్సి ఉందన్నారు. ఎన్నికల సామగ్రి తరలించడంలోనూ బాధ్యతగా వ్యవహరించాలని పేర్కొన్నారు. బ్యాలెట్‌ బాక్సుల వినియోగం, ఎన్నికలలో బ్యాలెట్‌ పత్రాల వినియోగం, డిక్లరేషన్‌ ప్రక్రియ పక్కాగా చేపట్టాలన్నారు. టెండర్‌ బ్యాలెట్‌ వంటి అంశాలపై అధికారులు అవగాహన కలిగివుండాలన్నారు. ఎన్నికల ముందు ఎన్నికల సామగ్రి తరలింపు, ఎన్నికల తదుపరి బ్యాలెట్‌ బాక్సులు అత్యంత భద్రతల మధ్య తరలించాల్సివుందన్నారు. ఎన్నికల విధి విధానాలపై అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో చీరాల, బాపట్ల ఆర్‌డిఒలు పి సరోజిని, జి రవీందర్‌, పిఒలు, ఏపిఒలు తదితరులు పాల్గొన్నారు.