ప్రజాశక్తి-గొలుగొండ:ఈనెల 13న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసిపిని ఓడించాలని మాజీ మంత్రి, టిడిపి పొలిట్ పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆయన శనివారం గొలుగొండ మండలం మేజర్ పంచాయతీ ఏఎల్‌పురం గ్రామానికి విచ్చేశారు. స్థానిక నాయకులు చింతల నారాయణమూర్తి ఇంటి వద్ద సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు. మొదటి ప్రాధాన్యత ఓటును టీడీపీ అభ్యర్ధి వేపాడ చిరంజీవిరావుకు, రెండో ప్రాధాన్యత ఓటును పిడిఎఫ్ అభ్యర్ధి రమాప్రభకు వేయాలని పార్టీ అధిష్టానం తీర్మానించిందని తెలిపారు. మరో ఆరు నెలల్లో శాసనసభ ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితో వైసిపి ప్రభుత్వ పతకానికి నాంది పలకాలన్నారు. ఓటు వేసే విధానాన్ని ఆయన ఓటర్లకు క్షుణ్ణంగా వివరించారు. వైసిపి, బిజెపి అభ్యర్ధులకు ఓటు హక్కు అడిగే నైతిక హక్కు లేదని ఆయన విమర్శించారు. ఉత్తరాంధ్ర దోపిడికి గురవుతుంటే కనీసం ప్రభుత్వంతో మాట్లాడలేని ఎమ్మెల్యేలు, మంత్రులు ఏముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని ఆయన దుయ్యబట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేపధ్యంలో వైసిపి దొంగ ఓట్ల విషయంపై ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు అడిగర్ల అప్పలనాయుడు, మాజీ జెడ్పీటీసీ తారక వేణుగోపాల్, చోద్యం సర్పంచ్ అదపురెడ్డి గోపాలకృష్ణ, పార్టీ నాయకులు సాంబమూర్తి, టిఎన్‌ఎస్‌ఎఫ్ పార్లమెంటరీ ఉపాధ్యక్షులు శ్రీకాంత్, లింగంపేట మాజీ సర్పంచ్ పరవాడ అప్పలనాయుడు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పట్టభద్రులు పాల్గొన్నారు.










