Dec 21,2022 22:18

ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు ప్రద్యుమ్నకు వినతిపత్రం అందజేస్తున్న సిపిఎం నేత కందారపు మురళి

ప్రజాశక్తి - తిరుపతి టౌన్‌: చిత్తూరు, ప్రకాశం నెల్లూరు జిల్లాలలో ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాలలో అంతులేని అక్రమాలు జరిగాయని అధికార పార్టీ నాయకులు స్వయంగా పర్యవేక్షిస్తూ ఈ అక్రమాలకు తెరలేపారని సిపిఎం నేత కందారపు మురళి తీవ్రంగా విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు, సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి ప్రద్యుమ్న మంగళవారం మధ్యాహ్నం మూడున్నర గంటల నుంచి ఐదు గంటల వరకు నిర్వహించిన ఎన్నికల సమీక్షా సమావేశంలో అన్ని వైసిపి మినహా మిగిలిన రాజకీయ పార్టీలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం నేత కందారపు మురళి, నగర కార్యదర్శి టి. సుబ్రహ్మణ్యంలు ప్రసంగిస్తూ అర్హతలు లేని వారికి ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాలలో అనేక మందిని ఓటర్లుగా నమోదు చేశారని, రెండు వేల అభ్యంతరాలను కేంద్ర ఎన్నికల కమిషన్‌ కు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ కు నిర్దిష్టంగా తాము ఫిర్యాదులు సమర్పించామని వివరించారు. కొన్ని ఉదాహరణలను ప్రద్యుమ్న కు చదివి వినిపిస్తూ వినతి పత్రాన్ని అందించారు. సిపిఎం చేసిన సూచనను సీఈవో దష్టికి తీసుకు వెళ్తామని, అక్రమాలను సహించే పరిస్థితి లేదని, అక్రమాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా కఠినంగా వ్యవహరిస్తామని ప్రద్యుమ్న వివరించారు. ఈ సమావేశంలో కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ బాలాజీ, డిఆర్‌ఓ శ్రీనివాసరావు, తిరుపతి మున్సిపల్‌ కమిషనర్‌ అనుపమ అంజలితో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అధికారులు, సిపిఐ నేతలు కత్తి రవి, చలపతి, తెలుగుదేశం పార్టీ నేతలు నరసింహయాదవ్‌, మనోహరాచారి, రిపబ్లికన్‌ పార్టీ నేత పి.అంజయ్య, బీఎస్పీ నాయకులు శశికుమార్‌, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు నర్సింహులు, బిజెపి నేత కె. వెంకటముని కార్యక్రమంలో పాల్గొన్నారు .