Mar 01,2023 23:49

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ రవి పఠాన్‌శెట్టి, ఎస్‌పి గౌతమిశాలి, డిఆర్‌ఒ వెంకటరమణ

ప్రజాశక్తి-అనకాపల్లి
ఈనెల 13న జరగనున్న ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లను పూర్తి చేసినట్టు కలెక్టర్‌ రవి పఠాన్‌ శెట్టి తెలిపారు. కలెక్టరేట్‌ నుంచి బుధవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ ముఖేష్‌ కుమార్‌ మీనాతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్పీ గౌతమిశాలితో కలిసి కలెక్టర్‌ పాల్గొన్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించకుండా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా బందోబస్తు చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ సూచించారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై దృష్టి సారించాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 49 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయని, వాటిలో 44 రెగ్యులర్‌ కాగా, 5 ఆక్సిలరీ కేంద్రాలని తెలిపారు. 21 సమస్యత్మక కేంద్రాలుగా గుర్తించామన్నారు. జిల్లాలో మొత్తం ఓటర్లు 42,714 మంది కాగా పురుషులు 28,370, స్త్రీలు 14,338 మంది, ట్రాన్స్‌ జెండర్‌ ఆరుగురు ఉన్నారని వెల్లడించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సహాయ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, డిఆర్‌ఓ పి వెంకటరమణ, సిపిఓ రామారావు, జిఎస్‌విఎస్‌ అధికారి మంజుల వాణి పాల్గొన్నారు.