ప్రజాశక్తి-కలెక్టరేట్, విశాఖ : పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలకు గతంలో 77 పోలింగ్ స్టేషన్లు ఉండగా ప్రస్తుతం అదనంగా 17 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేయనున్నట్లు విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.వరుల్లికార్జున తెలిపారు. కలెక్టరేట్‌లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, పట్టభద్రుల శాసనమండలి ఓటరు నమోదుకు సంబంధించి వ్యక్తిగత క్లెయిములు, ముసాయిదా జాబితాపై అభ్యంతరాలను ఈ నెల 23 నుంచి డిసెంబరు 9వ తేదీ వరకు స్వీకరించనున్నట్లు తెలిపారు. వాలంటీర్లు ఓటర్లు నమోదు ప్రక్రియలో పాల్గొనరాదని, వారు పాల్గొన్నట్లు ఫిర్యాదులు అందితే విచారణ జరిపి వెంటనే చర్యలు తీసుకోవాలని డిఆర్‌ఒకు ఆదేశించారు. అనంతరం పార్టీల ప్రతినిధుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసమూర్తి, సిపిఎం కార్పొరేటర్ డాక్టర్ బి.గంగారావు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు సుమబాల తదితరులు పాల్గొన్నారు.










