ప్రజాశక్తి - బాపట్ల జిల్లా : ఎమ్మెల్సీ ఎన్నికల కోసం బాపట్ల జిల్లాలో 40 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె. విజయకృష్ణన్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్‌పిలతో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా బుధవారం వీడియో సమావేశం నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి వీడియో సమావేశానికి హాజరైన కలెక్టర్ జిల్లాలో పరిస్థితులపై రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి వివరించారు. గ్రాడ్యుయేట్ ఓటర్ల కోసం 27 పోలింగ్ బూత్‌లు, ఉపాధ్యాయ ఓటర్ల కోసం 13 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశామన్నారు. 28,179 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు తెలిపారు. ఓటర్లకు స్లిప్పుల పంపిణీ ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిపారు. ఎన్నికల సామగ్రి కొనుగోలు కోసం జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. కమిటీ ఆమోదం మేరకు కొనుగోలు ప్రక్రియ చేపట్టామన్నారు. ఎన్నికల సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడానికి సమగ్ర ప్రణాళిక రూపొందించామన్నారు. ఎన్నికల బూతుల్లో ఎన్నికల సరళిని పర్యవేక్షించడానికి వెబ్ క్యాస్టింగ్ పనితీరుపై ఇంజినీరింగ్ విద్యార్థులకు ఈ నెల 3న ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎన్నికల కోసం సిసి కెమెరాలు కూడా జిల్లాకు అందాయని, వాటిని త్వరగా పోలింగ్ కేంద్రాలలో ఏర్పాటు చేస్తామన్నారు. గత అనుభవాల దష్ట్యా తొమ్మిది సమస్యాత్మక, తీవ్ర సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామన్నారు. అక్కడ ప్రత్యేక చర్యలు తీసుకునేలా అధికారులకు పలు సూచనలు చేశామని రాష్ట్ర ఎన్నికల అధికారికి జిల్లా కలెక్టర్ వివరించారు. ఎస్‌పి వకుల్ జిందాల్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలుగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఎన్నికల అధికారికి వివరించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా 600 మంది పోలీసులను బందోబస్తు కోసం నియమించామన్నారు. 13 ట్రైకింగ్ ఫోర్స్, ప్లటూన్లను కూడా నియమించామన్నారు. గన్ లైసెన్స్ పొందిన 22 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎన్నికలు జరిగే ఆయా మండలాల సరిహద్దులలో స్టాటిస్టికల్ సర్వేలెన్స్ బందాల నిఘా నిరంతరం కొనసాగుతుందన్నారు.ఈ సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ డాక్టర్ కె. శ్రీనివాసులు, డిఆర్‌ఒ జిల్లా కె. లక్ష్మీశివజ్యోతి పాల్గొన్నారు.










