Mar 14,2023 00:36
పర్చూరులో పోలింగ్‌ కేంద్రాలను పరిశీలిస్తున్న ఆర్‌డిఒ రవీంద్ర

ప్రజాశక్తి-పర్చూరు: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్సీ ఓటింగ్‌ ప్రశాంతంగా సాగింది. పర్చూరులో ఓటింగ్‌ సరళి మందకొడిగా సాగటంపై ఒటర్లు అసహనం వ్యక్తం చేశారు. ఓటు వేసేందుకు గంటల తరబడి వరుసలో నిలబడాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలించిన ఆర్‌డిఒ రవీంద్ర పోలింగ్‌ సిబ్బంది పనితీరుపట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. త్వరగా జరిగేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ఉపాధ్యాయ ఓటర్లు 79 మంది ఉండగా పోలింగ్‌ ముగిసే సమయానికి 74 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉపాధ్యాయ పోలింగ్‌ కేంద్రంలో కర్లపాలెం డిప్యూటీ తహశీల్దారు షేక్‌ సలీమ పిఓగా బాధ్యతలు నిర్వర్తించారు. పట్టభద్రుల పోలింగ్‌ కేంద్రంలో నిజాంపట్నం ఎంపిడిఓ ఎన్‌ నాగలక్ష్మి పిఓగా వ్యవహరించారు. 1,190 మంది ఉండగా 902 మంది ఓటు హక్కు వినియోగించారు. వీరన్నపాలెం పోలింగ్‌ కేంద్రంలో 350 మంది పట్టభద్రులు ఉండగా 279 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. నిజాంపట్నం తహశీల్దారు ఎం శిరీష పిఓగా విధులు నిర్వర్తించారు. పర్చూరు, వీరన్న పాలెం గ్రామాల్లో పోలింగ్‌ కేంద్రం సమీపంలో టిడిపి ఏర్పాటు చేసిన శిబిరాలకు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు చేరుకొని ఓటింగ్‌ సరశిని అడిగి తెలుసుకున్నారు. పిడిఎఫ్‌, వైసిపి, టిడిపి ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి ఓటర్లకు స్లిప్పులు ఇచ్చే ఏర్పాట్లు చేసుకున్నారు. రేపల్లె డిఎస్పీ మురళీకృష్ణ, బాపట్ల సిఐ కృష్ణయ్య, పర్చూరు ఎస్‌ఐ సిహెచ్‌ ప్రసాదు పోలింగ్‌ కేంద్రాలను సందర్శించారు.
బల్లికురవ రూరల్‌: బల్లికురవ మండలంలో సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. ఉదయం నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కునేందుకు ఎండను సైతం లెక్కచేయకుండా బారులు తీరారు. ఓటు హక్కు కలిగిన గ్రాడ్యుయేట్స్‌, టీచర్స్‌ ప్రశాంతంగా వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా విశ్రాంత ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, దివ్యాంగులు, మహిళలు, యువకులు సాయంత్రం 7 గంటల వరకు క్యూలైన్‌లో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండల పరిధిలో మొత్తం గ్రాడ్యుయేట్స్‌ 1,138 మంది ఓటు హక్కు కలిగి ఉండగా 870 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీచర్స్‌ 32 మంది ఓటు హక్కు కలిగి ఉండగా 32 మందీ తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్‌ఐ వేమన తన సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు.
ఇంకొల్లు రూరల్‌: ఇంకొల్లు మండలంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఉపాధ్యాయు లు 102 మంది ఉండగా 99 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో 97.05 శాతం పోలింగ్‌ నమోదైంది. పట్టభద్రులు 1231 మంది ఉండగా 947 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పట్టభధ్రుల్లో 76.92 పోలింగ్‌ నమోదైంది. పిడిఎఫ్‌, వైసిపి, టిడిపిలు శిబిరాలు ఏర్పాటు చేసుకొని ఓటర్లకు స్లిప్పులు అందించాయి. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు టిడిపి శిబిరం వద్దకు చేరుకొని ఓటింగ్‌ సరళిని అడిగి తెలుసుకున్నారు.
సంతమాగులూరు: సంతమాగులూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం వరకు మందకొడిగా సాగినా, సాయంత్రం నాలుగు గంటల సమయంలో, పట్టభద్రులు క్యూలో బారులు తీరారు. అధికారులు క్యూలో ఉన్న వారు 6.30 గంటల వరకు తమ ఓటును వేశారు. మండలంలో 1,139 మంది పట్టభద్రులు ఓట్లు ఉండగా, 892 ఓట్లు పోలయి 78.3 శాతంగా నమోదయింది. అలాగే ఉపాధ్యాయ ఓట్లు 63 ఉండగా, 63 ఓట్లు పోలయి 100 శాతం నమోదయింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్‌ఐ నాగశివారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు పూర్తి బందోబస్తు నిర్వహించారు.
యద్దనపూడి: మండల కేంద్రమైన యద్దనపూడి గ్రామంలో జడ్‌పి ఉన్నత పాఠశాలలో సోమవారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌లో 80 శాతం ఓట్లు పోలైనట్లు అధికారులు తెలిపారు. మొత్తం 758 పట్టభద్రుల ఓట్లకు గాను 601 ఓట్లు పోలయ్యాయి. ఇది 79.18 శాతం. టీచర్‌ 27 ఓట్లకు గాను 24 ఓట్లు పోలయ్యాయి. ఇది 88 శాతం. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మీగడ వెంకటేశ్వరరెడ్డి, బాబు రెడ్డిల గెలుపు కోసం ప్రజా సంఘాల నాయకులు పోపూరి సుబ్బారావు, శ్రీనివాసరావు, రవి, రాఘవరెడ్డి తదితరులు కృషి చేశారు. పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు యద్దనపూడిలో జరుగుతున్న పోలింగ్‌ సరళిని టిడిపి నాయకులను అడిగి తెలుసుకున్నారు.