ప్రజాశక్తి -సీలేరు
పాడేరు సబ్ కలెక్టరు అభిషేక్ జీకే.వీధి మండలంలో మంగళవారం విస్తృతంగా పర్యటించారు. ముందుగా జీకే వీధి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ బూతును పరిశీలించారు. అనంతరం సీలేరు చేరుకుని జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూతును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిమిత్తం నోడల్ అధికారిగా తనను నియమించినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో జీకే వీధి మండలంలో జీకే వీధి, సీలేరు పోలింగ్ బూతులలో అన్ని ఏర్పాట్లు సక్రమంగా ఉన్నాయో లేదో తనిఖీలు చేసినట్లు చెప్పారు. సీలేరు పోలింగ్ బూతులో చిన్నచిన్న రిపేర్లు తప్ప ఇతర సమస్యలు ఏమీ లేవని సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టి.చాణిక్యరావు, ఎన్‌ఆర్‌ఇజిఎస్ ఏపీఓ ఎల్.రాములు, జీకే వీధి తహశీల్దార్ జి.రాజ్ కుమార్, ఆర్‌ఐ మహదేవ్, వీఆర్వో శ్రీనివాస్, సీలేరు సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ కుసుమ, మహిళా పోలీస్ రేవతి ఉన్నారు.
మినీ బస్ డిపో ఏర్పాటుకు స్థల పరిశీలన
జీకే వీధి మండలం సీలేరులోని శివాలయం వీధి చివర గ్యాస్ గోడౌన్ సమీపంలో మినీ బస్ డిపో ఏర్పాటు చేయడానికి గతంలో సర్వే చేసిన స్థలాన్ని మంగళవారం పాడేరు సబ్ కలెక్టర్ అభిషేక్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ కొత్తగా జిల్లా ఏర్పడిన నేపథ్యంలో ఈ ప్రాంతానికి అదనంగా బస్సులు ఏర్పాటు చేయడం కోసం మినీ బస్సు డిపో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కొత్త బస్సులు ఈ ప్రాంతానికి రెండు ఏర్పాటు చేశామని తెలిపారు. ఇక్కడున్న ఐదు ఎకరాల స్థలంలో మూడు ఎకరాలు బస్ డిపోకు, కాంప్లెక్స్‌కి కేటాయించి మిగతా రెండు ఎకరాలు ప్రభుత్వ అవసరాలకు వినియోగిస్తామని వెల్లడించారు. బస్ డిపో మ్యాప్‌ని సిద్ధం చేయాలని రెవెన్యూ అధికారులు ఆదేశించినట్లు ఆయన తెలిపారు.










