Mar 11,2023 23:43

మాట్లాడుతున్న కలెక్టర్‌, పోలీసు కమిషనర్‌

ప్రజాశక్తి- ఎంవిపి కాలనీ : పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామని రిటర్నింగ్‌ అధికారి, జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున తెలిపారు. శనివారం సాయంత్రం కలక్టరేట్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 13వ తేదీన జరగబోయే ఎన్నికలకు సర్వం సిద్ధం అయిందన్నారు. 13వ తేదిన ఉదయం 8.00 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉమ్మడి విశాఖ , విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 331 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశామని చెప్పారు. సుమారు 2,89,214 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారని, 96 శాతం మంది ఓటర్లకు స్లిపులు పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రతి పోలింగ్‌ స్టేషన్‌ దగ్గర వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాటుచేసినట్లు చెప్పారు. 48 గంటల ముందు నుంచి డ్రైడే గా పాటించడం జరుగుతుందని, ఆ సమయంలో మద్యం దుకాణాలు మూసివేస్తున్నట్లు తెలిపారు. పోలింగ్‌ మెటీరియల్‌ను ఆయా జిల్లాల నుంచి పంపిణీకి ఏర్పాట్లు పూర్తిచేసినట్లు చెప్పారు. పోలింగ్‌ సిబ్బంది మెటీరియల్‌ సెక్యురిటీతో బయలు దేరి పోలింగ్‌ స్టేషన్‌ చేరుకుని, పోలింగ్‌ అనంతరం తిరిగి స్వర్ణభారతి స్టేడియంలో నిబంధనలు మేరకు స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపరచడానికి చర్యలు చేపట్టామన్నారు. 16వ తేది ఉదయం 8.00 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుందన్నారు. ఎన్నికలు నిర్వహించే కార్యాలయాలకు ఈ నెల 12, 13 తేదీల్లో ప్రత్యేక సెలవు దినంగా ప్రకటించినట్లు చెప్పారు. పట్టభద్రుల ఓటరు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ఓటరు పనిచేసే కార్యాలయాలు, ప్రైవేటు యాజమాన్యాలు ఓటు హక్కు వినియోగించుకునేందుకు పర్మిషన్‌ మంజూరు చేయాలన్నారు. ఓటరు ఓటు వినియోగించే సమయంలో 1,2,3,4,5 మాదిరిగాగానీ, రోమన్‌ నెంబర్లు గానీ ఓటు వేయాలని తెలిపారు.