Nov 08,2023 00:40

వినుకొండ: రాష్ట్రంలో ఎస్సీ,ఎస్టీ,బీసీ,ముస్లిం మైనారిటీలకు తీరని ద్రోహం చేసిన జగన్‌ రెడ్డి ప్రభుత్వం ఏమి చేశారని సామాజిక సాధికారత బస్సు యాత్రలు చేస్తున్నారని పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీ.వీ ఆంజనేయులు ప్రశ్నించారు. మంగళవారం రాత్రి తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ వర్గాలను అన్ని విధాల ఆదుకుంటానని ఎన్నికల ముందు వాగ్దానం చేసిన జగన్‌ రెడ్డి గద్దెనెక్కిన వెంటనే కార్పొరేషన్‌ నిధులు నిలిపివేసి అన్ని వర్గాలను దగా చేయటం జరిగిం దన్నారు. కార్పొరేషన్లు పెట్టి నిధులు ఇవ్వకుండా ఖాళీ కుర్చీలు మిగిల్చిన సీఎం జగన్మోహన్‌ రెడ్డిని ఈ మంత్రులు ఎందుకు ప్రశ్నించారు అని నిలదీశారు. బడుగు బలహీన వర్గాలకు ద్రోహం చేసిన వైసీపీ ప్రభుత్వం సామాజిక సాధికారత బస్సుయాత్ర చేపట్టటం విడ్డూరమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీలపై దాడులు చేసి అక్రమ కేసులు బనాయించి దళితులను అఘోరపరుస్తున్న జగన్‌ రెడ్డి ప్రభుత్వాన్ని ఈ మంత్రులు ఎందుకు నిలదీరని ప్రశ్నించారు. మంత్రి పదవులు ఇచ్చారు కానీ ఆయా శాఖలపై వారికి లేదని కేవలం పేరుకు మంత్రులే తప్ప వారికి వెన్నుముకలేని మంత్రులని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి రిజర్వేషన్‌ 35 శాతం నుండి 20 శాతానికి తగ్గించడం వలన 16800 మంది బీసీలు పదవులు కోల్పోయారని దీనిపై సీఎంను మంత్రి విడదల రజిని ఎందుకు ప్రశ్నించారు అని ఆయన ఎద్దేవా చేశారు. నాలుగున్నర ఏళ్లలో బీసీల హక్కుల గురించి బీసీ కార్పొరేషన్‌ నిధుల గురించి ఎన్నడైన మంత్రి రజిని ప్రశ్నించారా అని అన్నారు.