ఏమైనా జరిగే వరకూ అంతేనా..!
మరోసారి చిరుత కలకలం
భయం గుప్పెట్లో
ఎస్వీయూ విద్యార్థులు
ప్రజాశక్తి - క్యాంపస్ :
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సోమవారం తెల్లవారుజామున మరోసారి చిరుత సీసీ కెమెరాలలో కనిపించింది. దీంతో వర్సిటీలోని ప్రకాష్ నగర్ లో, ఇంజనీరింగ్ కళాశాల పరిసరాలలో నివాసం ఉండే విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే పలుమార్లు ఎస్వీయూ ఉన్నతాధికారులకు సూచించామని, వారి దష్టికి తీసుకెళ్లామనీ వర్సిటీలో నివసించే సిబ్బంది చెబుతున్నారు. అంతేకాదు విద్యార్థులు, విద్యార్థి సంఘ నేతలు కూడా పలుమార్లు ఉన్నతాధికారులకు చిరుతచే భయం ఉందని వినతి పత్రాలు ఇచ్చామన్నారు. వర్సిటీ ఉన్నతాధికారులకు దీనిపై ఎటువంటి స్పందన లేకపోవడం బాధాకరమని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికైనా విద్యార్థులకు, బోధన, బోధనేతర సిబ్బందికి భద్రత కల్పించే దిశగా ఉన్నతాధికారులు ఆలోచించాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. వర్సిటీలో బోన్లను ఏర్పాటు చేసి, ఇక్కడ తిరుగుతున్న రెండు, మూడు చిరుతలను బంధించాలని విద్యార్థి సంఘాల నేతలు రిజిస్ట్రార్ కు విన్నవించినట్లు వారు తెలిపారు. అయితే ఇప్పటివరకు రిజిస్ట్రార్ అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారో లేదో కూడా తెలియదని వారన్నారు. ఇప్పటికైనా రిజిస్ట్రార్, అటవీశాఖ అధికారుల సమన్వయంతో క్యాంపస్ లో తిరుగుతున్న రెండు, మూడు చిరుతలను బోను ఏర్పాటు చేయడం ద్వారా బంధించాలని విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు వర్సిటీలో తిరిగే చిరుతలను బంధించుకుంటే పరిపాలన భవనం ఎదుట విద్యార్థులు ఆధ్వర్యంలో ధర్నాకు దిగుతామని విద్యార్థి సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు.
సిసి కెమెరాలకు చిక్కిన పులి










