Nov 10,2022 23:47

ధర్నా చేస్తున్న సిపిఐ నేతలు

ప్రజాశక్తి- కె. కోటపాడు : విభజన హామీలను అమలు చేయక, స్టీల్‌ప్లాంట్‌ వంటి ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ, రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీని స్వాగతించేందుకు ప్రభుత్వ పెద్దలు తెగ ఏర్పాటు చేయడం విడ్డూరంగా ఉందని, రాష్ట్రానికి ఏం వెలగబెట్టారని ఈ స్వాగత సన్నాహాలంటూ మండల సిపిఐ నాయకులు ధ్వజమెత్తారు. గురవారం ప్రధాని మోడీ విశాఖ పర్యటనను నిరసిస్తూ స్థానిక మూడు రోడ్ల జంక్షన్‌లో నిరసన చేపట్టారు. మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి గొర్లే దేముడుబాబు మాట్లాడుతూ విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేస్తున్నారని, రైల్వే జోన్‌పై స్పష్టత లేదని, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి , పోలవరానికి నిధులు ఇవ్వలేదని, ప్రత్యేకహోదాతోపాటు విభజన హామీల అమలులో నమ్మించి మోసం చేశారని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని మోడీని అధికార, విపక్షాలు నిలదీసి, ఎండగట్టాల్సిందిపోయి, ఎర్రతివాచీ పరిచి స్వాగతించడం రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేయడమేనన్నారు. కార్యక్రమంలో రెడ్డి అప్పలనాయుడు, దళిత హక్కుల పోరాట సమితి మండల కార్యదర్శి ఇల్లాకు రాము, సీముసిరి సూర్యనారాయణ, దమ్ము ముత్యాల నాయుడు, చప్ప కోటి, సీముసిరి రామనాయుడు, కొమ్మి ఈశ్వరరావు, గాడి ప్రసాద్‌ పాల్గొన్నారు.