ఉచితంగా బియ్యం, గోధుమలు ఇస్తున్నందుకు, కరోనా వ్యాక్సిన్ ఉచితంగా వేస్తున్నందుకు నరేంద్రమోడీ గారికి కృతజ్ఞతలు చెప్పాలట. మోడీ గారు తాను చిన్నతనంలో అమ్మినట్లు చెబుతున్న టీ సంపాదన డబ్బు నుంచి తీసి జనానికి అందిస్తే నిజంగానే కృతజ్ఞతలు చెప్పాలి. అలాంటిదేమీ కాదే. జనం చెల్లించిన పన్నులు, కార్పొరేట్ టాక్సులు, జాతి మొత్తానికి చెందిన ప్రకృతి వనరుల నుంచి వచ్చిన ఆదాయం నుంచి ఏ మూలకూ చాలని ఐదు కిలోల బియ్యం, కిలో కందిపప్పు ఇచ్చినందుకు మోడీ కి కృతజ్ఞతలు చెప్పాలట.
ప్రధానిగా బాధ్యతలను స్వీకరించిన నాటి నుంచి నరేంద్రమోడీ పుట్టిన రోజును సేవా దినంగా పాటించిన బిజెపి 71వ జన్మదినాన్ని ఇరవై రోజుల భజన దినోత్సవంగా పాటించేందుకు పిలుపునిచ్చింది. ఈ నెల 17 నుంచి ఇరవై రోజుల పాటు అక్టోబరు ఏడవ తేదీ వరకు ప్రధాని నరేంద్రమోడీ రెండు దశాబ్దాల రాజకీయ సేవ, అంకిత బాట గురించి స్తోత్ర పారాయణం చేయాలని బిజెపి పిలుపు ఇచ్చింది. ఈ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు ఏకంగా నలుగురు బిజెపి జాతీయ నేతలను ఏర్పాటు చేశారు. వారిలో దగ్గుబాటి పురందరేశ్వరి కూడా ఉన్నారు.
నరేంద్రమోడీ ప్రభుత్వ పరంగా, రాజకీయంగా ఈ ఏడాది ఇప్పటి వరకు తిన్నన్ని ఎదురు దెబ్బలు గత రెండు దశాబ్దాలలో ఎన్నడూ రుచిచూసి ఉండరు. అయినా అవేమీ తెలియనట్లు, దేశమంతా వెలిగిపోతున్నట్లు పొగడ్తలకు పూనుకున్నారంటే జనానికి జ్ఞాపకశక్తి తక్కువనే చిన్న చూపు తప్ప మరొకటేమైనా ఉందా? మచ్చుకు కొన్ని చూద్దాం. వర్తమాన ఆర్థిక సంవత్సరం 2021-22 తొలి మూడు మాసాల్లో జిడిపి వృద్ధి 20.1 శాతంతో రికార్డు సృష్టించిందని, దీనికి ప్రభుత్వం తీసుకున్న చర్యలే కారణమన్నట్లుగా ప్రచారం సాగింది. దీన్ని ఘన విజయం చెప్పుకుంటే ఇబ్బందుల్లో పడేది నరేంద్రమోడీ, పాలక బిజెపి ఎన్‌డిఏ కూటమే అని అభిమానులు గుర్తించాలి. 2019-20 సంవత్సరం తొలి మూడు మాసాల్లో జిడిపి విలువ రూ.35.96 లక్షల కోట్లు. ఈ మొత్తం మీద 24.4శాతం దిగజారి మరుసటి ఏడాది 2020-21లో విలువ రు.26.95 లక్షల కోట్లకు తగ్గింది. ఈ మొత్తం మీద వర్తమాన సంవత్సరంలో అది 20.1 శాతం పెరిగి రూ.32.38 లక్షల కోట్లకు చేరింది. దీన్నే ఘనతగా చిత్రిస్తున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి దేశవ్యాపితమైన లాక్‌డౌన్ లేదు. కార్మికుల వలసలూ అంతగా లేవు. ఉపాధి కూడా లేదనుకోండి.
పెట్రోలు, డీజిలు ధరలు, వాటి పెరుగుదలకు మూలమైన పన్నుల గురించి జనానికి పట్టకపోయినా ప్రభుత్వానికి పెద్ద ఆదాయ వనరుగా మారింది. వినియోగం ఎంత పెరిగితే కేంద్రానికి, ధరలు ఎంత పెరిగితే రాష్ట్రాలకు అంతగా ఆదాయం పెరుగుతున్నది. స్ధానికంగా ఉత్పత్తి పెరిగితే వినియోగదారుల మీద భారం, అన్నింటికీ మించి విలువైన విదేశీ మారక ద్రవ్యం ఎంతో ఆదా అవుతుంది. 2013-14లో 37.8 మిలియన్ టన్నుల ముడి చమురు ఉత్పత్తి చేస్తే అది 2020-21 నాటికి 30.5 మి.టన్నులకు దిగజారింది. ఈ ఏడాది ప్రతినెలా తగ్గుదలే తప్ప ఉత్పత్తి పెరుగుదల లేదు. ఈ వైఫల్యం ఎందుకో ఇంతవరకు చెప్పిన కేంద్ర పాలకులు లేరు. మరోవైపు దిగుమతులపై ఆధారం 2012లో 81 శాతం ఉండగా 2020 నాటికి 87.6 శాతానికి పెరిగింది. కేంద్ర ప్రభుత్వం కొన్ని కంపెనీలతో తలెత్తిన వివాదాల కారణంగా వెనుకటి తేదీల నుంచి వసూలు చేయాల్సిన పన్నులను రద్దు చేయాలని నిర్ణయించి వేళ్ల మీద లెక్కించదగిన కార్పొరేట్ కంపెనీలకు లబ్ధిని, సంతోషాన్ని కలిగించింది. కానీ కోట్లాది మంది చమురు వినియోగదారులకు గత ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ మొత్తాలకు కొన్ని రెట్లు అదనంగా ఇప్పుడు వినియోగదారుల నుంచి మోడీ సర్కార్ వసూలు చేస్తోంది. అడిగేవారు లేకపోవటం అంటే ఇదే. కాంగ్రెస్ హయాంలో జారీ చేసిన చమురు బాండ్ల భారం తమ మీద పడిందని, వాటిని తాము తీర్చాల్సి వస్తోందని గత ఏడు సంవత్సరాలుగా ప్రచారం చేస్తున్నారు. ఇంతకీ ఆ మొత్తం ఎంత? లక్షా 34 వేల కోట్లు. ఈ మొత్తం కూడా మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉండగా వినియోగదారులకు ఇచ్చిన రాయితీలకు గాను చమురు సంస్ధలకు ప్రభుత్వం చెల్లించాల్సిన సబ్సిడీ ఇది. ఆ మేరకు చమురు సంస్ధలకు బాండ్ల రూపంలో ఇచ్చారు. అంటే వడ్డీ, అసలు చెల్లించే ప్రామిసరీ నోట్ల వంటివి ఇవి. మన్మోహన్ సింగ్ గారి ''చెడు'' రోజులు చివరిలో లేదా నరేంద్రమోడీ గారి ''మంచి రోజుల'' ప్రారంభంలో లీటరు పెట్రోలు, డీజిలు మీద కేంద్ర ప్రభుత్వ పన్ను రూ.9.48, రూ.3.56 చొప్పున ఉంటే క్రమంగా పెంచి రూ.32.98, రూ.31.83 చొప్పున వసూలు చేస్తున్నారు. ఈ కారణంగా ఏడాదికి 2020-21లో కేంద్రానికి రూ.3.35 లక్షల కోట్లు సమకూరింది. వినియోగం పెరిగిన కొద్దీ ఆదాయం పెరుగుతుంది.
ఆత్మనిర్భర కార్యక్రమం పేరుతో రూ.26 లక్షల కోట్ల సాయాన్ని చేస్తున్నట్లుగా గొప్పగా ప్రచారం చేశారు. అసలా కార్యక్రమం ఏమిటో, సామాన్యులకు ఎలా ఉపయోగపడుతుందో అసలు ప్రయోజనమో కాదో కూడా ఇప్పటికీ, ఎప్పటికీ తెలియని వారెందరో. కేంద్ర ప్రభుత్వం జాతీయ సామాజిక సహాయ పథకం (ఎన్‌ఎస్‌ఎపి-వృద్ధాప్య, ఇతర పెన్షన్ పథకాలు) కింద ఇస్తున్న మొత్తాన్ని రెట్టింపు చేసే ప్రతిపాదన ఏమైనా ఉందా అని బిజెపి సభ్యుడు వసంత కుమార్ పాండా లోక్‌సభలో అడిగారు. దానికి జాతీయ గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి 'అలాంటి ప్రదిపాదన తమ వద్ద లేదు సార్' అంటూ ఆగస్టు మూడవ తేదీన రాతపూర్వక సమాధానంలో తెలిపారు. రాజ్యాంగం లోని ఆర్టికల్ 41 కింద సామాజిక సహాయ పథకాన్ని అమలు జరపాలని ఉంది. ఆ మేరకు 1995లో దీన్ని ప్రారంభించి రూ.75గా నిర్ణయించారు. తరువాత 2006లో రూ.200కు పెంచారు. 2013లో జాతీయ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఈ మొత్తాన్ని రూ.300కు పెంచాలని సిఫార్సు చేసింది. ఎనిమిది సంవత్సరాల తరువాత తమ వద్ద అలాంటి ప్రతిపాదనేదీ పరిశీలనలో లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నిజాలు పలుకుతున్నారా, అబద్ధాలు చెబుతున్నారా? అసలు రెండు వందల రూపాయలతో నెల రోజులు ఏ విధంగా గడపగలుగుతారో ఎవరైనా చెప్పగలరా ?
వృద్ధులను ఆదుకోవాల్సిన యువత పరిస్ధితి ఏమిటి? జులై తో పోలిస్తే ఆగస్టు నెలలో పదిహేను లక్షల ఉద్యోగాలు తక్కువగా ఉన్నాయని సిఎంఐయి తెలిపింది. నిరుద్యోగ శాతం 6.96 నుంచి 8.32కు చేరింది. వ్యవసాయ రంగంలో ఉపాధి అవకాశాలు తగ్గిపోవటం ఉద్యోగ అవకాశాలు తగ్గటానికి కారణమని సదరు సంస్ధ అధిపతి మహేష్ వ్యాస్ చెప్పారు. ముందే చెప్పుకున్నట్లు ఆర్థిక కార్యకలాపాలు పెరిగి తొలి మూడు మాసాల్లో జిడిపి 20.1 శాతం వృద్ధి చెందిందని సంబరాలు చేసుకుంటున్న తరుణంలోని పరిస్ధితి ఇది. ఎనిమిది రాష్ట్రాల్లో హర్యానాలో 35.7, రాజస్తాన్‌లో 26.7, జార్ఖండ్ 16, బీహార్, జమ్మూ కాశ్మీరులో 13.6, ఢిల్లీలో 11.6 శాతాల చొప్పున నిరుద్యోగులున్నారు. తగినంత ఉపాధి లేని కారణంగా కరోనా కాస్త తగ్గుముఖం పట్టగానే కడుపు చేత పట్టుకొని వలస కార్మికులు తిరిగి పట్టణాలకు చేరుకుంటున్నారు. 2021 జులై నెలతో పోలిస్తే ఆగస్టు నెలలో ఉపాధి పథóకం కింద పని చేసిన వారు 58 శాతం తగ్గారు. దీనికి వ్యవసాయ పనులు కూడా ఒక కారణంగావచ్చుగానీ పట్టణాలకు వలసలే ప్రధానం అన్నది స్పష్టం. ఉపాధిని కల్పించే పర్యాటక, ఆతిథ్య రంగాలలో వృద్ధి లోటులోనే ఉంది. మన ఎగుమతులు పెరిగాయని సంతోషించవచ్చుగానీ, ఈ ఏడాది తొలి మూడు మాసాల్లో ప్రయివేటు వినిమయం అంతకు ముందు మూడు మాసాలతో పోల్చితే 8.9 శాతం తగ్గిపోయింది. ఉపాధి లేకపోవటం, అవసరమైన వాటినే జనం కొనుగోలు చేస్తున్నట్లు ఇది సూచిస్తోంది. ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ధన ఆర్జన పథకం (మోనిటైజేషన్) కింద ప్రభుత్వ ఆస్తులను ప్రయివేటు వారికి కట్టబెడితే పర్మనెంటు ఉద్యోగాలకు కోత పడటంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా తగ్గిపోతాయి.
ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం లేదన్నది స్పష్టం. అంకెల గారడీతో ఎంతగా దాచిపెట్టాలని చూసినా కుదరదు. ద్రవ్యోల్బణం పెరగటం అంటే ధరలు పెరగటం. ఉదాహరణకు నెహ్రూ ఏలుబడిలో 1961లో వంద రూపాయల వస్తువులు కొన్నాం. ఆ ఏడాది ద్రవ్యోల్బణం రేటు 1.7 శాతం. మరుసటి ఏడాది ద్రవ్యోల్బణం 3.63 శాతం పెరిగింది. ఆ కారణంగా అదే వస్తువులకు మనం 103.63 చెల్లించాం. అంటే మన రూపాయి విలువ తగ్గినట్లా పెరిగినట్లా? మనం ఒక్కసారిగా మంచి రోజులు తెస్తానని వాగ్దానం చేసిన బిజెపి నరేంద్రమోడీ ఏలుబడిలో 2021 నాటికి వద్దాం. ఆ మొత్తం రు.7,646.39కి చేరింది. ఈ అంకెలకు ప్రపంచబ్యాంకు సమాచారం ఆధారం. ఆరు దశాబ్దాల సగటు ద్రవ్యోల్బణం రేటు 7.64 శాతం. దీన్నే మరొక విధంగా చెప్పాలంటే నెహ్రూ కాలంలో ఒక రూపాయి ఇప్పుడు మోడీగారి హయాంలో 76.46కు సమానం. ఈ మేరకు కార్మికుల వేతనాలు, జన ఆదాయాలు పెరిగాయా ?
ఉచితంగా బియ్యం, గోధుమలు ఇస్తున్నందుకు, కరోనా వ్యాక్సిన్ ఉచితంగా వేస్తున్నందుకు నరేంద్రమోడీ గారికి కృతజ్ఞతలు చెప్పాలట. మోడీ గారు తాను చిన్నతనంలో అమ్మినట్లు చెబుతున్న టీ సంపాదన డబ్బు నుంచి తీసి జనానికి అందిస్తే నిజంగానే కృతజ్ఞతలు చెప్పాలి. అలాంటిదేమీ కాదే. జనం చెల్లించిన పన్నులు, కార్పొరేట్ టాక్సులు, జాతి మొత్తానికి చెందిన ప్రకృతి వనరుల నుంచి వచ్చిన ఆదాయం నుంచి ఏ మూలకూ చాలని ఐదు కిలోల బియ్యం, కిలో కందిపప్పు ఇచ్చినందుకు మోడీ కి కృతజ్ఞతలు చెప్పాలట. ఆపద కాలంలో ఉన్న వారిని ఆదుకోవటం, మహమ్మారుల నుంచి జనాలను రక్షించటం పాలకుల బాధ్యత. దానికి కృతజ్ఞతలను ఆశించటం ఏమిటి? ఏదో ఒక సందర్భాన్ని ఉపయోగించుకొని మోడీ స్తోత్రపారాయణం చేయటం ద్వారా పడిన మచ్చలను కనిపించకుండా చేయాలనే కార్యక్రమం తప్ప ఏం సాధించారని ఇరవై రోజుల పాటు మోడీ ని పొగడాలి ?
ఎం. కోటేశ్వరరావు











