Apr 05,2023 00:23
మాట్లాడుతున్న వేగేశన నరేంద్రవర్మ

ప్రజాశక్తి బాపట్ల: బాపట్ల జిల్లా ఆవిర్భవించిదని యేడాదికి ఒకసారే సంబరాలు కాగా బాపట్లలో ప్రతిరోజూ దోమలు ప్రజలపై సంబరాలు చేసుకుంటున్నాయని బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బాధ్యులు వేగేశన నరేంద్రవర్మ ఎద్దేవా చేశారు. మంగళవారం బాపట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నరేంద్రవర్మ విలేకరులతో మాట్లాడారు. బాపట్లలో అనేక సమస్యలుంటే వాటిని పక్కనపెట్టి ఈ సంబరాలు ఎందుకు చేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఏం సాధించారని సంబరాలు చేసుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. బాపట్లలో దోమలు నివారించారా? మురుగు కాలువలు బాగుపడ్డాయా? పారిశుధ్యం మెరుగుపడిందా? అని ప్రశ్నించారు. మున్సిపాలిటీ సిబ్బంది ముక్కుపిండి పన్నుల రూపంలో వసూలు చేస్తున్న కోట్లాది రూపాయలతో ప్రజలకు మెరుగైన వసతులు కల్పించకుండా ఎమ్మెల్యే సొంత ప్రచారాలకు వినియోగించడం దారుణమన్నారు. సంబరాలకు ఏ నిధులు ఖర్చుచేస్తున్నారో ప్రజలకు తెలియజేయాలన్నారు. ఏడాది పూర్తయినా ఇంకా ప్రైవేటు భవనాల్లోనే ప్రభుత్వ కార్యాలయాలు కొనసాగిస్తున్నారు. బాపట్ల జిల్లా అయిన ఏడాది కాలంలో బాపట్లలో మౌలిక వసతులకు ఎంతమేర నిధులు ఖర్చుపెట్టారో ప్రకటించాలన్నారు. జిల్లాకు తగ్గట్టు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యసేవలు మెరుగుపడతాయని ఆశించిన ప్రజలకు నిరాశే ఎదురవుతోందని పేర్కొన్నారు. రూ.550 కోట్లతో మెడికల్‌ కళాశాల తీసుకొచ్చానని సన్మానాలు చేయించుకున్నారు. శంఖుస్థాపన చేసి రెండేళ్లు పూర్తయ్యింది. పునాదులకే కుస్తీ పడుతున్నారు. ఏడాదిలో సాధించిన పురోగతి ప్రగతిపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. పట్టణంలో నిర్మిస్తున్న రహదారిలో నిర్మాణంలో భారీగా అక్రమాలు జరిగాయని నరేంద్రవర్మ ఆరోపించారు. అష్టవంకరలు తిరిగిన రోడ్డు, మురుగు కాలువలకు బాధ్యులు ఎవరని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా సంబరాల పేరుతో ప్రజలను మభ్యపెట్టడం మానేసి బాపట్ల అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు సమావేశంలో గొలపల శ్రీనివాసరావు, ముక్కామల శివ, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.