పిల్లల రక్షణకు కేటాయించే బడ్జెట్లో 40 శాతం కోత విధించారు. అంటే క్రితం సంవత్సరం రూ. 1500 కోట్లు కేటాయించగా ఈ సంవత్సర బడ్జెట్లో కేవలం రూ. 900 కోట్లు మాత్రమే పిల్లల రక్షణకు కేటాయించారు. ఈ రకంగా కోతలు విధించే నేతలు...వున్న కాస్త బడ్జెట్‌ని కూడా ఎంత వరకు సక్రమంగా ఖర్చు చేస్తారన్నది ఒక ప్రశ్న. అందులో ఎంత భాగం ఆడపిల్లల అభ్యున్నతికి వినియోగిస్తారన్నది మరో పెద్ద ప్రశ్న. అంతే కాదు. ఈ సారి బడ్జెట్లో మహిళలు, పిల్లల పౌష్టికాహారంపై కేటాయింపులను 27 శాతం కుదించారు. ఈ విధంగా కేటాయింపులను తగ్గించుకుంటూ పోతే మరింతగా సంకట స్థితిలోకి నెట్టబడతారు.
ఎప్పటి మాదిరిగానే మరో ఏడాది జాతీయ బాలికా దినోత్సవం (జనవరి 24) ముగిసింది. శుభాకాంక్షలు చెబుతూ, సెల్ఫీలు పెట్టుకుంటూ, 'బేటీ భారత్ కీ', 'గర్ల్ చైల్డ్ డే ఆన్ స్వస్థ్ భారత్' అంటూ హ్యాష్ ట్యాగ్లను ట్రెండ్ చేస్తూ, సంబరాలు జరుపమన్నారు. జరుపుకున్నారు కూడా. ఈ సెల్ఫీలు వేల సంవత్సరాలుగా నెలకొన్న అసమానతలను అంతం చేస్తాయా? ఆ హ్యాష్ టాగ్స్ బాలికల భవితను మహోన్నతంగా మార్చేస్తాయా ?
75 ఏళ్ల స్వతంత్ర భారతంలో నేటికీ బాల్యవివాహ దురాచారం మన ఆడపిల్లలను పట్టి పీడిస్తూనే ఉంది. ఆడపిల్లల అభివృద్ధికి ఈ బాల్య వివాహాలు పెద్ద ఆటంకంగా మారుతున్నాయి. బాల్యవివాహ నిరోధక చట్టం విఫలమైందని బాల్య వివాహ నిషేధ చట్టం చేసుకున్నాం. కానీ, ఇప్పటికీ ప్రపంచంలో బాల్య వివాహాలు జరిగే ప్రతి ముగ్గురులో ఒకరు భారతీయ బాలికే కావడం చూస్తే మన చట్టాలు ఎంత పటిష్టంగా అమలవుతున్నాయో అర్ధమవుతుంది. మరో పక్కన లింగ వివక్షను అరికట్టడంలో మన ప్రభుత్వాలు విఫలమవుతూనే ఉన్నాయి. 'సేవ్ ది గర్ల్ చైల్డ్' స్వచ్ఛంద సంస్థ చేసిన సర్వే ప్రకారం లింగ వివక్ష వల్ల ప్రతి ఆరుగురు బాలికలలో ఒకళ్ళు మరణిస్తున్నట్లు తెలిసింది. ఈ పరిస్థితి దాపురించడానికి కారణాలేంటి ?
రక్తహీనత - పౌష్టికాహారలోపం
ఎన్.ఎఫ్.హెచ్.ఎస్ 2019-21 సర్వే నివేదిక ప్రకారం 52.2 శాతం అంటే దేశంలో సగానికి పైగా గర్భిణులు రక్తహీనతతో బాధపడుతున్నారు. తల్లికే లేని ఆహారం బిడ్డకు ఎక్కడ నుండి వస్తుంది? ఇలాంటప్పుడు పుట్టింది ఆడ శిశువయితే ఆ బిడ్డ ఆకలి తీర్చాలన్నా లింగ వివక్ష అడ్డుపడుతుంది. 2015-16లో విడుదలైన ఎన్.ఎఫ్.హెచ్.ఎస్ నివేదికల ప్రకారం మన దేశంలోని 5 సంవత్సరాల లోపు పిల్లల్లో 35.7 శాతం బరువు తక్కువగా ఉండగా, 21 శాతం చాలా బలహీనంగా ఉన్నారు. మరో 38.4 శాతం ఎదుగుదల లోపాలతో ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి పరిస్థితులలో ప్రభుత్వం బడ్జెట్లో మహిళలు, పిల్లల పౌష్టికాహారంపై కేటాయింపులను పెంచాల్సింది పోయి 27 శాతానికి కుదించింది. దీనివలన ఈ పరిస్థితులు మరింత దయనీయంగా మారతాయి తప్ప ఏమీ మెరుగుపడవు.
భారమవుతున్న విద్య
విద్య విషయంలో ఆడపిల్లలు ఎంతటి వివక్షకు గురి అవుతారో తెలిసిందే. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులో, బడిలో మరుగుదొడ్ల వంటి కనీస సౌకర్యాలు లేకపోవడమో, బడి దూరంగా ఉంటే అల్లరి మూకల వేధింపులో బాలికల చదువును కొనసాగించలేకపోవడానికి కారణమవుతున్నాయి. ఇవన్నీ ఇలా ఉంటే కరోనా మహమ్మారి వలన పాఠశాలలు మూతపడటంతో డిజిటల్ విద్యను అందించే స్థోమత లేక ఆడపిల్లలను చదువు మాన్పించే తల్లిదండ్రుల సంఖ్య మరింత పెరిగిపోయింది. 2014-15 విద్యా సంవత్సరంలో మన దేశంలో 3.88 శాతం అమ్మాయిలు ప్రాథమిక స్థాయి లోనే చదువుకు దూరం కాగా, మిగిలిన వారిలో 4.60 శాతం ప్రాథమికోన్నత విద్యతో చదువులకు ఫుల్‌స్టాప్ పెట్టారు. అందులో 16.88 శాతం ఆడపిల్లలు సెకండరీ విద్యకు నోచుకోలేదు. ఈ గణాంకాలను గడిచిపోయిన కాలంతో పోలుస్తూ మెరుగుపడ్డాయని ప్రభుత్వాలు జబ్బలు చరుచుకుంటున్నాయే తప్ప, బాలికల విద్యావకాశాలు మెరుగు పడకపోవడానికి వాస్తవ కారణాలను గుర్తించేందుకు మాత్రం సిద్ధపడడం లేదు. అంతే కాకుండా కొత్తగా ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానం, బడ్జెట్లో విద్యా శాఖ కేటాయింపులలో పెట్టిన కోతలు ఉన్న పరిస్థితులను మరింత దిగజార్చే విధంగా ఉంది.
బాలికల అక్రమ రవాణా
బాలికలను పట్టి పీడిస్తున్న మరో పెద్ద సమస్య ట్రాఫికింగ్. 2019 గణాంకాల ప్రకారం, మన దేశంలో అక్రమ రవాణా అయిన పిల్లల్లో 40.22 శాతం ఆడపిల్లలే. అయితే ప్రస్తుత కరోనా కాలంలో ఈ లెక్కలు మరింత ఆందోళనకరంగా మారాయని మరో సర్వేలో తేలింది. ఈ కాలంలో ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా పతనమయ్యాయి. ఈ క్రమంలో అత్యధికంగా బాధింపబడింది పిల్లలే అని ఈ సర్వేలో తేలింది. ఇలాంటి సమయంలోనే అక్రమ రవాణాదారులు కుటుంబ సభ్యులకు ఉద్యోగాలనో, డబ్బునో ఎరగా చూయించి పిల్లలని కాజేస్తారు. ఈ లాక్‌డౌన్ కాలంలోనే ఒక 11 రోజుల వ్యవధిలో గవర్నమెంట్ హెల్ప్ లైన్ కు 92,000 కేసులు పిల్లల మీద జరిగిన వివిధ దాడులపై రిజిస్టర్ అయ్యాయి. అంటే, మన భావి పౌరులు ఎలాంటి పరిస్థితుల్లో ఎదుగుతున్నారో మనం అర్ధం చేసుకోవాలి.
పెరిగిపోతున్న లైంగిక దోపిడీ, మానసిక వేధింపులు
అక్రమ రవాణా కాబడిన పిల్లలలో ఎక్కువ శాతం లైంగిక దోపిడీకి గురయ్యేవారే. వీరిని మన దేశంలో కానీ లేదా మన చుట్టుపక్కల దేశాలకు కానీ తరలించి ఇటువంటి చర్యలకు పాల్పడుతుంటారు. నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో (ఎన్.సి.ఆర్.బి) గణాంకాల ప్రకారం మన దేశంలో ప్రతి రోజూ 109 మంది పిల్లలు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. పోక్సో చట్టం కింద నమోదైన ఈ కేసుల సంఖ్య 2017లో కన్నా 2018 లో 22 శాతం పెరిగాయంటే ఎంతటి అభద్రత మధ్య మన పిల్లలు జీవిస్తున్నారో గ్రహించవచ్చు. 2018లో మొత్తం 21,605 మంది పిల్లలపై అత్యాచారం జరిగినట్టు కేసులు నమోదు కాగా, అందులో 21,401 మంది ఆడపిల్లలు, 204 మంది మగపిల్లలని ఈ డేటాలో తెలిపారు. 2018లో మొత్తం 67,134 మంది పిల్లలు తప్పిపోయారని కేసులు నమోదైతే అందులో 47,191 మంది ఆడపిల్లలే ఉండటం మరింత ఆందోళన కలిగించే విషయం. అంతేకాక శరణాలయాల్లో ఉండే ఆడపిల్లలు, మహిళల మీద లైంగిక వేధింపుల కేసులు 2018లో 30 శాతం పెరిగాయి. ఇవన్నీ చూస్తుంటే మన దేశంలో ఆడపిల్లలు మహిళలు ఎంతటి అభద్రతల మధ్య పెరుగుతున్నారో అర్ధం చేసుకోవచ్చు.
అత్యాచారాలు-హత్యా రాజకీయాలు
ఆడపిల్లలకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులే భక్షకులుగా మారుతుంటే, ఇక ఆడపిల్లలు తమ గోడును ఎక్కడ వెళ్ళగక్కాలి? అత్యాచారాలను అత్యాచారాలుగా చూడాలి తప్ప రాజకీయం చెయ్యకూడదన్న దేశ ప్రధాని, తన పార్టీలో ఉన్న నాయకత్వం అత్యాచార నిందితులను కాపాడటానికి ఎన్ని ప్రయత్నాలు చేసిందో మరువలేం! కథువా లో అత్యాచారానికి గురయిన అసిఫా నిందితులను కాపాడటానికి అక్కడి బిజెపి నాయకులు ఎంతలా ప్రయత్నించారో చూశాం. ఉన్నావ్ ఘటనలో 16 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన అక్కడి బిజెపి ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ ఎంత ప్రజా వ్యతిరేకతకు గురైతే ఆ పార్టీ నుండి బహిష్కరించారో కదా. మన ప్రభుత్వాలు అత్యాచార నిందితులను ఎన్‌కౌంటర్ చేస్తూ చేతులు దులుపుకుంటున్నాయి తప్ప న్యాయబద్ధమైన మార్గం చూపకపోవడంతో చైత్ర లాంటి (ఆరేళ్ళ సింగరేణి కాలనీ అత్యాచార బాధితురాలు) ఎంతోమంది అమాయక పిల్లలు అసువులు బాస్తున్నారు.
బడ్జెట్‌లో కోతలు
ఇన్ని సమస్యల మధ్య కొట్టుమిట్టాడుతున్న బాలికలకు ఊరట ఇవ్వకపోగా వారి కోసం కేటాయించే బడ్జెట్లో కోత వేయడం మరింత ఆందోళన కలిగించే విషయం. మన దేశంలో మొత్తం జనాభాలో 42 శాతంగా ఉన్న పిల్లలకు 2019-20 లో 2.99 శాతం అంటే రూ. 80,440 కోట్లు కేటాయించగా...2020-21లో 3.17 శాతం అంటే రూ. 96,040 కోట్లు కేటాయించారు. ఇక 2021-22 ఆర్థిక సంవత్సరంలో దీనిని మరింత కుదించి 2.46 శాతం బడ్జెట్ మాత్రమే చిన్నారుల కోసం కేటాయించారు. మరోపక్క ఈ ఆర్థిక సంవత్సరంలో విద్యా శాఖ కేటాయింపులను రూ. 59,370 కోట్ల నుండి రూ. 53,600 కోట్లకు కుదించారు. పిల్లల రక్షణకు కేటాయించే బడ్జెట్లో 40 శాతం కోత విధించారు. అంటే క్రితం సంవత్సరం రూ. 1500 కోట్లు కేటాయించగా ఈ సంవత్సర బడ్జెట్లో కేవలం రూ. 900 కోట్లు మాత్రమే పిల్లల రక్షణకు కేటాయించారు. ఈ రకంగా కోతలు విధించే నేతలు...వున్న కాస్త బడ్జెట్‌ని కూడా ఎంత వరకు సక్రమంగా ఖర్చు చేస్తారన్నది ఒక ప్రశ్న. అందులో ఎంత భాగం ఆడపిల్లల అభ్యున్నతికి వినియోగిస్తారన్నది మరో పెద్ద ప్రశ్న. అంతే కాదు. ఈ సారి బడ్జెట్లో మహిళలు, పిల్లల పౌష్టికాహారంపై కేటాయింపులను 27 శాతం కుదించారు. ఈ విధంగా కేటాయింపులను తగ్గించుకుంటూ పోతే మరింతగా సంకట స్థితిలోకి నెట్టబడతారు. బడ్జెట్‌ని సరిపడా కేటాయించడం, దానిని సక్రమంగా వినియోగించడం చేస్తే ఈ సమస్యలు పూర్తిగా పరిష్కారం కాకపోయినా కొంతవరకైనా మెరుగవ్వవచ్చు. అందుకుగాను ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాల్సి వుంటుంది.
( వ్యాసకర్త : రిసెర్చి స్కాలర్ )
ప్రత్యూష వెలగ











