హిజాబ్‌లు పరదాలు
రాజేసిన వివాదాలను
ఒక్క బంగారు పతకం
జ్ఞానవాపి తవ్వకాల్లో
సమాధి చేసింది
ఇల్లు దాటని దాటనీయని
పిల్లల వ్యవస్థలో
ఓ పిల్ల
వూరు దాటింది
పట్నం దాటింది
ఒక్కో పంచ్‌తో క్లీన్ ఫైట్
ప్రపంచ పటంలో మెరిసింది
తవ్వితే సరిగ్గా తవ్వండి
చరిత్రకి అందినదే నిజం
పుక్కిటి కిళ్ళీ
తుపుక్కున ఊంచక
హేతువుని పట్టుకో
రెండు చేతుల గ్లౌజ్‌లో
విసిరే ఒక్కో సిల్హౌట్
రింగ్‌లో బలాబలాల బేరీజు
వీధుల్లో వీరంగం
మనుషుల మధ్య పెట్టే మంటలంత సులువు కాదు
మెళ్ళో కాషాయం
బౌద్ధ నకలు
లేనిదాన్ని వున్నట్లు
భ్రమింప జేసే కాలంలో
బౌట్‌లో పాదాల
కదలికలో వేగం
వేటాడే జింక విసిరిన పంజా
మౌఢ్యంపై ఎగరేసిన జెండా
తిండిపై యుద్ధం
తిండి గింజల కోసం
ఎదురు చూపు
పని కోసం ప్రతీ క్షణం ఆరాటం
ఇవేవీ వద్దు
ఎవడు కట్టాడు
ఎవడు కూల్చాడు
కట్టినోడు వీడు కాదు
కూల్చినోడు వాడు కాదు
పనులు లేక రాద్దాంతం
సోమరిపోతుల డైరీ ఫాంలో ఉత్పత్తులు
ఒక్కసారి ఆ బిగిసిన పిడికిలి తెచ్చిన గౌరవాన్ని చూడండి!!
ఏం కావాలో
ఏమవ్వాలో సోచాయించు!!
గొర్లకి మనుషులకి
తేడా తెమల్చు!!
గిరి ప్రసాద్ చెలమల్లు
9493388201