Nov 06,2023 22:07

విలేకరులతో మాట్లాడుతున్న మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌ రెడ్డి

ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్‌ : ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చలేని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఏ మొహం పెట్టుకొని పుట్టపర్తికి వస్తున్నారని మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌ రెడ్డి ప్రశ్నించారు. సోమవారం టిడిపి స్థానిక కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జిల్లాకు ఏం చేశారని పుట్టపర్తి పర్యటనకు వస్తున్నారన్నారు. పుట్టపర్తిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చి మాట తప్పినందుకా? సత్యసాయి తాగునీటి పథకాన్ని నిర్వీర్యం చేసినందుకా? నియోజకవర్గంలోని 193 చెరువులో నింపుతామని రైతులకు ఇచ్చిన హామీని తుంగలో తొక్కి నందుకా? అని పల్లె నిలదీశారు. వ్యవస్థలను నిర్వీర్యం చేసి ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన ముఖ్యమంత్రి ఏ మొహం పెట్టుకొని పుట్టపర్తి పర్యటనకు వస్తారని అన్నారు. సత్యసాయి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మంచినీటి పథకాన్ని నాశనం చేసి నేడు ఆ సంస్థలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు ఇవ్వలేని స్థితికి తెచ్చారన్నారు. పాదయాత్ర సమయంలో తాము అధికారంలోకి రాగానే 193 చెరువుల నింపుతామని నల్లమాడ బహిరంగ సభలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాలు అయినా చెరువులను నింప లేకపోయారని విమర్శించారు. కప్పలబండలో పరిశ్రమల ఏర్పాటుకు పెద్ద ఎత్తున ప్రభుత్వ భూమి సమీకరించినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి పరిశ్రమలు తీసుకురాలేదన్నారు. తీవ్ర కరువుతో రైతులు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ ఇన్‌ఫుట్‌ సబ్సిడీ ప్రకటించలేదన్నారు. నూతనంగా పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి ఇంతవరకు కనీస మౌలిక సదుపాయాలు, కార్యాలయాలకు భవనాలు నిర్మించలేదన్నారు. పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయారన్నారు. టిడిపి ప్రభుత్వ హయాంలో పుట్టపర్తి, కొత్తచెరువు, బుక్కపట్నం మండలాలను కలుపుతూ నాలుగు లైన్ల రింగు రోడ్డుని ప్రకటించి నిధులు మంజూరు చేసినప్పటికీ ఇప్పటివరకు ఒక తట్టెడు మట్టి కూడా వేయలేదని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతో రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా నిధులు మంజూరు చేస్తూ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. ఇందులో ఈ ప్రభుత్వ ఘనత ఏమిటో చెప్పాలని డిమాండ్‌ చేశారు.