Feb 08,2022 15:36

లక్నో :  యుపి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బిజెపి ఉచితాల వర్షం కురిపించింది. మంగళవారం లక్నోలో 'లోక్‌ కల్యాణ్‌ సంకల్ప పత్ర' పేరిట బిజెపి నేత అమిత్‌ షా ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సంకల్ప పత్రాన్ని యుపికి బిజెపి బృందం సిద్ధం చేసిందని అమిత్‌ షా పేర్కొన్నారు. 2017లో ఇచ్చిన 212 హామీల్లో 92 శాతం నేరవేర్చామని అన్నారు. వచ్చే ఐదేళ్లలో రాష్ట్ర తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేయడంతో పాటు రూ.10 లక్షల కోట్ల వరకు పెట్టుబడులను రప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆ మేనిఫెస్టోలో పేర్కొన్నారు.

రైతుల కోసం ఉచిత విద్యుత్‌, గోధుమ, వరి పంటకు కనీస మద్దతు ధర ఇస్తామంటూ పేర్కొంది. అలాగే వచ్చే ఐదేళ్ల కాలంలో మూడు కోట్ల కొత్త ఉద్యోగాలు. అందులో ప్రతి కుటుంబంలో కనీసం ఒక్కరికి ఉద్యోగం ఇస్తామంటూ హామీలు గుప్పించింది. ఉజ్వల యోజన పథకం కింద హోళీ, దీపావళి పండుగల వేళ దారిద్య్ర రేఖ దిగువన ఉండే కుటుంబాల్లోని మహిళలకు రెండు ఉచిత ఎల్‌పిజి సిలిండర్లు ఇస్తామని పేర్కొంది. 60 ఏళ్లు పైబడిన మహిళలు ప్రజా రవాణాలో ఉచితంగా ప్రయాణించవచ్చని వెల్లడించింది. యుపిలో ఏడు దశల్లో పోలింగ్‌ జరగనుంది. మొదటి దశ పోలింగ్‌ ఈనెల 10 నిర్వహించనున్నారు.