ఇద్దరు అరెస్టు
ప్రజాశక్తి - ఏలూరు స్పోర్ట్స్
వ్యక్తిని బెదిరించి బాధితుడికి రావాల్సిన రూ.50 లక్షల నగదును మాఫీ చేసేందుకు ప్రయత్నించిన ఓ ముఠాను పోలీసులు పట్టుకుని వారిని రిమాండ్‌కు తరలించారు. మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపడుతున్నారు. నగరంలోని రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో సిఐ బి.చంద్రశేఖరరావు గురువారం విలేకర్ల సమావేశం నిర్వహిం వివరాలు తెలిపారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం ప్రాంతానికి చెందిన అన్నే కాంతారావు స్థానికంగా రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేస్తూ భార్యాపిల్లలతో కలిసి జీవిస్తున్నాడు. ఈ క్రమంలో 2017 నుంచి 2019 మధ్యకాలంలో గతంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో నివాసం ఉండి, ప్రస్తుతం హైదరాబాదులో ఉంటున్న దాట్ల బాలవెంకటసత్యనారాయణ అలియాస్ సతీష్ రాజుకు, కాంతారావుకు పరిచయం ఏర్పడింది. తనకు విదేశాల్లో ఎస్‌బిఎల్‌సి ఎకౌంట్ ఉందని, అది కొన్ని అనివార్య కారణాల వల్ల ఫ్రీజ్ అయిందని, ఆ ఎకౌంటును రిలీజ్ చేస్తే దాంట్లో పెద్ద మొత్తంలో నగదు ఉందని, తనకు రూ.50 లక్షలు ఇస్తే ఆ ఎకౌంటును ఫ్రీజ్ నుంచి విడిపించి ఖాతాలో ఉన్న నగదు నుంచి రూ.2 కోట్లు తిరిగి ఇస్తానని సత్యనారాయణ కాంతారావును నమ్మించాడు. 2017 నుంచి 2019 వరకూ దఫాదఫాలుగా మొత్తం రూ.50 లక్షలు సత్యనారాయణకు కాంతారావు ఇచ్చారు. అప్పటి నుంచి అతను కాంతారావుకు కనపడకుండా తిరుగుతూ వచ్చాడు. అయితే సతీష్‌రాజు సిబిఐ కోర్టులో బెంగళూరు ప్రాంతంలో హాజరవుతున్నాడని తెలుసుకున్న కాంతారావు గతనెల 19వ తేదీన కోర్టు వద్ద తనకు ఇవ్వాల్సిన సొమ్ముల కోసం నిలదీసేందుకు అతని వద్దకు వెళ్లాడు. అదే సమయంలో అతని పక్కన హైదరాబాద్ ప్రాంతానికి చెందిన వినరురెడ్డి అనే వ్యక్తి ఉన్నాడు. అతను మీరిద్దరి మధ్య సంధి చేస్తానని, రెండు మూడు రోజుల్లో ఆర్థిక లావాదేవీలను సెటిల్ చేస్తానని కాంతారావుకు తెలిపాడు. గత నెల 26వ తేదీన కాంతారావుకు వినరురెడ్డి ఫోన్ చేసి 27వ తేదీ మధ్యాహ్నం ఏలూరు ఎన్-స్క్వేర్ హోటలకు రావాలని, తామిద్దరం వస్తున్నామని, అప్పు సొమ్ము ఇచ్చివేస్తామని చెప్పారు. 27వ తేదీ మధ్యాహ్నం ఎన్-స్క్వేర్ హోటల్‌కి వచ్చిన కాంతారావును వారిద్దరు గదిలో బంధించారు. ఆ తరువాత నలుగురు వ్యక్తులు వచ్చి తాము తెలంగాణా ఎన్‌ఎస్‌టి ఫోర్స్ పోలీసులమని కాంతారావుపై అరెస్టు వారెంటు ఉందని, అందుకే అరెస్టు చేస్తున్నామని అతనిని గదిలో చిత్రహింసలకు గురిచేసి కొట్టారు. అక్కడ నుంచి కాంతారావును ఆ నలుగురు ఇన్నోవా కారులో ఎక్కించుకుని తాడేపల్లిగూడెం వైపు తీసుకెళ్లి మళ్లీ వెనుకకు తీసుకొచ్చి దెందులూరు జాతీయ రహదారిలోని ఓ నిర్మానుష ప్రాంతానికి తీసుకువెళ్లారు. అక్కడ అతని తలపై తుపాకీ పెట్టి చంపేస్తామని బెదిరిస్తూ రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. భయభ్రాంతులకు గురైన కాంతారావు తనను వదిలేస్తే డబ్బులు తిరిగి అడగనని వారిని బ్రతిమాలడంతో మళ్లీ అదే కారులో తీసుకొచ్చి రూమ్ నెంబర్ 506లో ఉన్న వినరురెడ్డికు అప్పగించి మేటర్ సెటిల్ అయిపోయిందని, అప్పు సొమ్ము అడగరని చెప్పి ఆ నలుగురు వెళ్లిపోయారు. ఈ సంఘటనపై బాధితులు ఏలూరు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో టూ టౌన్ సిఐ చంద్రశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డిఎస్‌పి శ్రీనివాసులు ఆధ్వర్యంలో నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వీరిలో ప్రధాన నిందితులైన సతీష్, వినారురెడ్డిలను పోలీసులు ఈ నెల నాలుగో తేదీన సిఐ చంద్రశేఖరరావు అరెస్టు చేసి వారి వద్ద నుంచి కారును రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ దాట్ల సత్యనారాయణ కాంతారావును మోసం చేసి దఫాదఫాలుగా రూ.50 లక్షలు తీసుకున్నాడని, ఆ సొమ్ము బదులుగా తన పేరుపై ఉన్న చరాస్తిని తనకు రాసి ఇవ్వాలని ఒత్తిడి తెస్తుండడంతో అతడిని సినిమా తరహాలో బెదిరించేందుకు సుపారి గ్యాంగ్‌ను మాట్లాడాడు. సుపారిగ్యాంగ్‌కు సత్యనారాయణ ముందుగా రూ.2.50 లక్షలను అడ్వాన్స్‌గా ఇచ్చాడు. ఈ కేసులో నాగరాజుతో పాటు మరో ముగ్గురు నిందితులు ఉన్నట్లు గుర్తించామని సిఐ తెలిపారు. వీరందరినీ పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు.










