Jul 01,2023 22:32

             ఏలూరు ప్రతినిధి, ఏలూరు అర్బన్‌:పోలవరం పోరుకేక యాత్రతో శనివారం ఏలూరు నగరం దద్దరిల్లింది. తంగెళ్లమూడిలో ప్రారంభమై ఏలూరు నగరం మీదుగా హనుమాన్‌ జంక్షన్‌ వరకూ సాగింది. పాదయాత్రకు అడుగడుగునా వివిధ పార్టీలు, ప్రజాసంఘాలు, ప్రజలు నీరాజనాలు పలికారు. టిడిపి, జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జులు బడేటి చంటి, రెడ్డి అప్పలనాయుడు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డేగా ప్రభాకర్‌, జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణచైతన్య, బిఎస్‌పి నాయకులు నేతల రమేష్‌, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్‌రావు మద్దతు ప్రకటించారు. ఎల్‌ఐసి ఏజెంట్ల యూనియన్‌, చేతివృత్తిదారుల సంఘం, ఎపిడబ్ల్యూజెఎఫ్‌ నాయకులు తమ పూర్తి మద్దతు ప్రకటిస్తూ పాదయాత్ర బృందానికి స్వాగతం పలికారు. తంగెళ్లమూడి, పన్నెండు పంపలు సెంటర్‌, పవర్‌ పేట రైల్వేస్టేషన్‌, ఆర్‌ఆర్‌పేట, ఫైర్‌స్టేషన్‌, వట్లూరు మీదుగా ఈయాత్ర సాగింది. ఆర్‌ఆర్‌పేట పార్క్‌ వద్ద జరిగిన సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, బిఎస్‌పి నాయకులు నేతల రమేష్‌, కాంగ్రెస్‌ నాయకులు రాజనాల రామ్మోహన్‌రావు, సిపిఎం నాయకులు వి.ఉమామహేశ్వరరావు, సిఐటియు ఆలిండియా ఉపాధ్యక్షురాలు జి.బేబిరాణి, సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఎ.రవి, జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి రెడ్డి అప్పలనాయుడు మాట్లాడారు. పాదయాత్రకు టిడిపి నాయకులు బడేటి చంటి రూ.పది వేలు విరాళం ప్రకటించగా, చేతివృత్తిదారుల సంఘం నాయకులు పిచ్చుకల ఆదిశేషు తమ సంఘం తరపున రూ.11,300 విరాళంగా పాదయాత్ర నాయకులకు అందించారు.