Oct 05,2023 00:41

చేబ్రోలులోని పొలాల్లో రైతులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు

ప్రజాశక్తి - చేబ్రోలు : ఎలుకల బారి నుండి పైరును కాపాడుకోవడానికి సామూహిక ఎలుకల నివారణ చేపట్టాలని రైతులకు అధికారులు సూచించారు. ఈ మేరకు మండల కేంద్రమైన చేబ్రోలులోని రైతు భరోసా కేంద్రం వద్ద బుధవారం అవగాహన కల్పించారు. ఎలుకలను నివారించే విషపు ఎర తయారీపై గుంటూరు పెస్టిసైడ్స్‌ ల్యాబ్‌ నుండి వచ్చిన ఎడిఎ సిహెచ్‌.తిరుమలదేవి వివరించాఉ. వ్యవసాయ శాఖ అందించే బ్రోమోడోయోలిన్‌ మందు ఎలుకల నివారణకు బాగా ఉపయోగపడుతుందని, ఒక హెక్టారు (రెండున్నర ఎకరాలు)కు 480 గ్రాములు నూకలు 10 గ్రాముల బ్రోమోడయోలిన్‌ మందు, 10 గ్రాముల విజిటేబుల్‌ ఆయిల్‌ కలిపి విషపు ఎర మిశ్రమాన్ని తయారు చేసుకోవచ్చని చెప్పారు. ఈ మిశ్రమాన్ని 10 గ్రాములతో చిన్న చిన్న పొట్లాలుగా చేసుకుని ఎలుకల బొరియల వద్ద ఉంచాలని వివరించారు. రైతులు ఎవరికి వారే ఎలుకల నివారణ ప్రయత్నం చేస్తే పెద్దగా ఉపయోగం ఉండదని, అన్ని పొలాల రైతులు ఏకకాలంలో చేయడం ద్వారా పిలకలు తొడిగే దశలో ఉన్న వరి పైరును కాపాడుకోవచ్చని చెప్పారు. కార్యక్ర మంలో మండల వ్యవసా యాధికారి బి.శ్రీనివాస నాయక్‌, పొన్నూరు సహాయ వ్యవసాయ సంచాలకులు వి.రామకోటేశ్వరి, మండల వ్యవసాయ సలహా మండలి సభ్యులు బి.అప్పిరెడ్డి పాల్గొన్నారు.
ప్రజాశక్తి - కాకుమాను : మండల కేంద్రమైన కాకుమానుతోపాటు కొండపా టూరు, అప్పాపురం, రేటూరు, బోడిపాలెం, గరికపాడు, బి.కె.పాలెం, వల్లూరు, చినలింగాయపాలెం, పాడ్రపాడు, కెజిపాలెం, తెలగాయపాలెం తదితర గ్రామాల్లో బుధవారం సామూహిక ఎలుకల నివారణ చేపట్టినట్లు మండల వ్యవసాయ అధికారి కె.కిరణ్మయి తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేసిన ఎలుకల మందును రైతులకు అందించారు. ఈ మందును నూనె, నూకలతో కలిపి చిన్న పొట్లాలుగా చేసి ఎలుకల బొరియల వద్ద ఉంచాలని చెప్పారు. కార్యక్రమాల్లో జిల్లా వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్‌ ఎన్‌.శివరామకృష్ణయ్య, ఎంపిపి ఆర్‌.శ్రీనివాసరావు, జెడ్‌పిటిసి గుల్జార్‌ బేగం, సర్పంచులు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.