May 09,2023 00:23

నష్టపరిహారం కోసం చర్చలు జరుపుతున్న నాయకులు

ప్రజాశక్తి- ములగాడ : హెచ్‌పిసిఎల్‌ ఎల్‌పిజి బాట్లింగ్‌ ప్లాంట్‌లో ఓ వ్యక్తి సోమవారం మధ్యాహ్నం మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం... శ్రీహరిపురం పవన్‌ పుత్రనగర్‌లో పల్లా శ్రీధర్‌ కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నారు. రోజూమాదిరిగానే సోమవారం 6 గంటలకు విధులకు చేరుకున్నాడు. ఎల్‌పిజి బాట్లింగ్‌ ప్లాంట్‌లో లోడింగ్‌, అన్‌లోడింగ్‌ సెక్షన్‌లో సూపర్‌వైజర్‌గా విధులు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా కుప్ప కూలిపోయాడు. తోటి ఉద్యోగులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వైద్యులు మృతిచెందినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న స్థానిక నాయకులు సంఘటనా స్థలానికి చేరుకొని యాజమాన్యంతో చర్చలు జరిపారు. మృతుని కుటుంబానికి రూ.14 లక్షలు, ఇంట్లో ఒకరికి లోడింగ్‌ అన్‌లోడింగ్‌ విభాగంలో ఉద్యోగం ఇస్తామని యాజమాన్య ప్రతినిధులు అంగీకరించారు. పశ్చిమ నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త ఆడారి ఆనంద్‌కుమార్‌ తన సొంత నిధులు రూ.2 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారు. దహన సంస్కారాలకు రూ.25 వేలును తోటి ఉద్యోగులు ఇచ్చారు. ఈ చర్చల్లో గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, సిపిఎం నాయకులు అప్పలరాజు, కె.పెంటారావు, ఆర్‌.లక్ష్మణమూర్తి, 60వ వార్డు కార్పొరేటర్‌ పీవీ.సురేష్‌, ఎఐటియుసి నాయకులు కసిరెడ్డి సత్యనారాయణమూర్తి, సిపిఐ నాయకులు గుడాల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.