పంచాయతీ కార్మికుల ఆందోళన
ప్రజాశక్తి - చాట్రాయి
ఏళ్ల తరబడి పంచాయతీ కార్మికుల జీతాలు పెండింగ్‌లో ఉంటే తామెలా బతకాలంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మండలంలోని చనుబండ పంచాయతీ కార్మికులు ఎంపిడిఒ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్మికులు విస్సంపల్లి ప్రసాదరావు, కారుమంచి భిక్షాలు మాట్లాడుతూ చనుబండ పంచాయతీలో చెత్త నుండి సంపద తయారీ కేంద్రంలో 2018 నుంచి పనిచేస్తున్నామన్నారు. తమకు ఒక్కక్కరికి నెలకు రూ.ఆరు వేలు చొప్పున 42 నెలలుగా పనిచేస్తున్నామని, కేవలం మూడు నెలలు మాత్రమే జీతాలిచ్చారన్నారు. 39 నెలల జీతం బకాయి ఉందన్నారు. అనంతరం ఎంపిడిఒ ఎన్.మురళీమోహన్‌ను కలిసి సమస్యను వివరించారు. అంతేకాక తమను అన్యాయంగా తొలగించారని, కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి పెండింగ్ వేతనాలు ఇప్పించి, తమకు న్యాయం చేయాలని కోరారు. దీనిపై స్పందించిన ఎంపిడిఒ మాట్లాడుతూ సమస్య పరిష్కరించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.










