ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోనే పేద వాడల్లో జీవిస్తున్న పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన గర్భిణులకు, బాలింతలకు, బాలలకు 48 ఏళ్లుగా సేవలు చేస్తూ ప్రభుత్వ లక్ష్యం నెరవేర్చే దిశలో అంగన్వాడీ వర్కర్లు, మినీ వర్కర్లు, హెల్పర్లు ఎంతో కృషి చేస్తున్నారని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) పల్నాడు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కెపి మెటిల్డాదేవి, జి.మల్లీశ్వరి అన్నారు. అయినా వీరికి కనీస వేతనాలు ఇవ్వడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని విమర్శించారు. ఈ మేరకు బుధవారం ప్రాజెక్టు కార్యాలయంలో సుపెరినెంట్‌కు, సిడిపిఒ ఉమామహేశ్వరికి వినతిపత్రాలు అందించారు. ఈ సందర్భంగా మెటిల్డాదేవి, మల్లీశ్వరి లు మాట్లాడుతూ తెలంగాణ కంటే అదనంగా వేతనాలు ఇస్తామని జగన్మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేత హోదాలో చెప్పి నాలుగున్నరేళ్లు గడుస్తున్నా పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. వివిధ రకాల యాప్‌లతో ఇబ్బందులు పెడుతూ మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారని మండిపడ్డారు. వివిధ రకాల యాప్‌లో రద్దుచేసి ఒక యాప్ ద్వారా విధులు నిర్వహించే విధంగా చేయాలన్నారు. మినీ సెంటర్లను తక్షణమే మెయిన్ సెంటర్లుగా మార్చాలని, అర్హులకు ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ విరమణ వయసు 62కు పెంచాలని, ఆఖరి వేతనంలో 50 శాతం పెన్షన్ ఇవ్వాలని, పెండింగ్లో ఉన్న సెంటర్ అద్దెలు, 2017 ఏడాదికి సంబంధించిన టిఎ బిల్లులు ఇతర బకాయిలు వెంటనే ఇవ్వాలని కోరారు. కచ్చితమైన కొలతలతో ప్రతినెలా 5వ తేదీలోపు నిర్దేశించిన సరుకులు నాణ్యత ఉండేలా చూడాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనాలు అమలు చేయాలన్నారు. ఈ అంశాలపై సిఐటియు, ఎఐటియుసి, ఐఎఫ్‌టియు అనుబంధ అంగన్వాడి సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 25న విజయవాడ ధర్నా చౌక్ వద్ద మహాధర్నాలో అంగన్వాడిలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమస్యలు పరిష్కరించే వరకూ దశల వారిగా పోరాటం చేస్తామని చెప్పారు.
అసెంబ్లీలో మాట్లాడాలని ఎమ్మెల్యేకు వినతి
గురువారం నుండి జరగనున్న అసెంబ్లీ సమావేశాలలో అంగన్వాడీల సమస్యలపై మాట్లాడాలని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి అంగన్వాడీలు, యూనియన్ నాయకులు వినతిపత్రం ఇచ్చారు. అంకిత భావంతో పనిచేస్తున్నా అంగన్వాడీలకు సరైన గుర్తింపు లేదని ఆవేదన వెలిబుచ్చారు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలతో పోలిస్తే తమకు ఇస్తున్న వేతనాలు ఏ మాత్రమూ సరిపోవని, కుటుంబాలు గడవడం కష్టంగా ఉందని అన్నారు. సెంటర్ల నిర్వహణకు సంబంధించి బిల్లులు పెండింగ్లో ఉండటంతో ఇబ్బందులు పడుతున్నామని, సంబంధిత శాఖ మంత్రి కమిషనర్లు, ప్రిన్సిపల్ సెక్రటరీలకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. వీటిపై అసెంబ్లీలో ప్రస్తావించి తమ సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యేను అంగన్వాడీలు కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో నాయకులు నిర్మల, కవిత, ధనలక్ష్మి అంనగ్వాడీలు పాల్గొన్నారు.










