ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : బొల్లాపల్లి మండలం కనుమలచెరువు పంచాఅతీలోని గాంధీనగర్ యానాదుల భూముల సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కౌలురైతు సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షులు కె.రామారావు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఏపూరి గోపాలరావు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని ధర్నాచౌక్ వద్ద గాంధీనగర్ సంఘం గ్రామ యానాదుల భూసాధన కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన రిలే దీక్షలకు రామారావు, గోపాలరావు సంఘీభావం తెలిపి మాట్లాడారు. 150 కుటుంబాలకు 1959లో ప్రభుత్వం రెడ్డి యానాది టెనెంట్ కో-ఆపరేటివ్ సొసైటీ (1438) ఏర్పరిచి 450 ఎకరాలను ఉమ్మడిగా ఇచ్చిందని, 10 ఏళ్ల తరవాత 1969 ప్రభుత్వమే ఒంగోలు కెనాల్ కోసం 300 ఎకరాలు తీసుకుందని చెప్పారు. మిగిలిన భూములు రాజకీయ పలుకుబడి కలిగిన సుగాలీలు ఆక్రమించడంతో మొత్తం భూమి కోల్పోయిన యానాదులు ఏడేళ్లగా అధికారులకు మొరపెట్టుకుంటున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా స్పందించాలని కోరారు. దీక్షలకు పిడిఎం జిల్లా కార్యదర్శి జి.రామకృష్ణ, సిఐటియు పల్నాడు జిల్లా అధ్యక్షులు కె.హనుమంతరెడ్డి, సంఘీభావం తెలిపారు. భూముల సాధన కమిటీ నాయకులు బి.సుందర్రావు, సిహెచ్ ఆంజనేయులు, బి.బాల, పి.వెంకట్రావు పాల్గొన్నారు.










