Apr 02,2021 07:20

   2018 ఫిబ్రవరిలో మొదటి విడతగా రూ.222 కోట్ల విలువ చేసే బాండ్లను జారీ చేశారు. వీటిల్లో 94.5 శాతం అంటే దాదాపు రూ. 210 కోట్ల వరకు బిజెపికే వెళ్ళాయి. ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన, ఆడిట్‌ చేసిన బిజెపి ఖాతాల ద్వారా ఈ విషయం స్పష్టమైంది. ఈ విరాళాలన్నీ కార్పొరేట్‌ సంస్థల నుండి లేదా అధికాదాయం కలిగిన వ్యక్తుల నుండి వస్తున్నాయనేది వాస్తవం. పైగా ఇప్పటి వరకు జారీ చేసిన వాటిలో 92.12 శాతం బాండ్లు కోటి రూపాయల పైచిలుకువే అన్నది సుస్పష్టమైన వాస్తవం.
   మొదటి విడతగా ఏప్రిల్‌ ఒకటవ తేదీ నుండి పదవ తేదీ వరకు కొనసాగనున్న ఎలక్టోరల్‌ బాండ్ల జారీపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు తిరస్కరించింది. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఉద్దేశించిన ఈ బాండ్ల జారీపై స్టే విధించాలంటూ ఎన్‌జిఓ అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఎడిఆర్‌) విజ్ఞప్తి చేసింది.
   ఎలాంటి అడ్డంకులు, అవరోధాలు లేకుండా గత మూడేళ్ళుగా ఈ పథకం నిర్వహించబడుతోందని, కొన్ని రక్షణలు కూడా కల్పించారని కోర్టు పేర్కొంది. అయితే ఇవన్నీ కూడా ఏమాత్రమూ నమ్మలేని కారణాలు. రాజకీయ పార్టీలకు నిధులు అందే మార్గం వెల్లడి కాకుండా ఈ పథకం అడ్డుగోడలా నిలబడడం ఇందులో ముఖ్యమైన అంశం. పైగా, పాలక పార్టీకి అనుకూలంగా వుండేలానే దీన్ని రూపొందించారు. తమకు అందిన ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలను సీల్డ్‌ కవర్‌లో పెట్టి ఎన్నికల కమిషన్‌కు రాజకీయ పార్టీలు అందచేయాలని 2019 నాటి ఉత్తర్వుల్లో కోర్టు పేర్కొంది. ఈ పథకానికి నిర్దిష్ట రక్షణలు వున్నాయంటూ కోర్టు చెబుతున్నది ఈ ఉత్తర్వుల గురించే.
   ప్రత్యేకంగా ఎన్నికల సమయంలో బాండ్లు జారీ చేయడం, ఆ తర్వాత దానిపై ఎలాంటి చర్యలు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఎలక్టోరల్‌ బాండ్ల పథకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లు 2018 నుండి పెండింగ్‌లో వున్నాయి. వాటిని కోర్టు విచారణకు స్వీకరించకపోవడం ఇక్కడ అసలు సమస్య. ఈ బాండ్లను సవాలు చేస్తూ సిపిఎం కూడా ఒక రిట్‌ పిటిషన్‌ను దాఖలు చేసింది.
   ఈ పిటిషన్లను పరిష్కరించకుండా వుండడం, ఎలాంటి చట్టపరమైన అవరోధాలు లేకుండా గత మూడేళ్ళుగా ఈ పథకం అమలవుతోందని చెప్పడం, వాస్తవానికి ఎలక్టోరల్‌ బాండ్‌ పథకాన్ని చట్టబద్ధం చేయడానికేనన్నది సుస్పష్టం. రాజకీయ పార్టీలకు నిధులు అందించే ఈ హానికరమైన వ్యవస్థ ఏమాత్రమూ పారదర్శకంగా లేదు. పైగా, పాలక పార్టీ తమకు చేసిన సాయానికి ప్రతిఫలంగా కార్పొరేట్‌ సంస్థలు నిధులు అందించేందుకు వీలు కల్పిస్తోంది. బాండ్ల ద్వారా ఇచ్చే ఈ మొత్తాలు ఎవరికి ఇస్తున్నారో దాత చెప్పనక్కరలేదు...లేదా ఈ నిధులు అందుకున్న పార్టీ తమకు ఎక్కడ నుండి విరాళాలు వచ్చాయో వెల్లడించాల్సిన అవసరం లేదు. అంటే ముడుపులు, అక్రమంగా డబ్బు లావాదేవీలు జరిగేందుకు ఇది చక్కటి మార్గమన్న మాట. పార్టీకి చట్టబద్ధంగా అక్రమ మొత్తాలను మళ్ళించేందుకు బూటకపు కంపెనీలను పెట్టుకోవచ్చు.
    ఆర్‌టిఐ సమాచారం ప్రకారం, 2018 ఫిబ్రవరి నుండి ఇప్పటి వరకు ఎస్‌బిఐ 14 దశల్లో ఎలక్టోరల్‌ బాండ్లను జారీ చేసింది. 2020 చివరి నాటికి మొత్తంగా 12,773 బాండ్లను జారీ చేశారు. వాటిల్లో రూ.6,472 కోట్లు విలువ చేసే 12,632 బాండ్లను నగదు రూపంలోకి మార్చుకున్నారు. 2018 ఫిబ్రవరిలో మొదటి విడతగా రూ.222 కోట్ల విలువ చేసే బాండ్లను జారీ చేశారు. వీటిల్లో 94.5 శాతం అంటే దాదాపు రూ.210 కోట్ల వరకు బిజెపికే వెళ్ళాయి. ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన, ఆడిట్‌ చేసిన బిజెపి ఖాతాల ద్వారా ఈ విషయం స్పష్టమైంది. ఈ విరాళాలన్నీ కార్పొరేట్‌ సంస్థల నుండి లేదా అధికాదాయం కలిగిన వ్యక్తుల నుండి వస్తున్నాయనేది వాస్తవం. పైగా ఇప్పటి వరకు జారీ చేసిన వాటిల్లో 92.12 శాతం బాండ్లు కోటి రూపాయల పైచిలుకువే అన్నది సుస్పష్టమైన వాస్తవం.
   ఈ బాండ్ల పథకానికి తోడు, భారతదేశంలో పనిచేస్తున్న బహుళ జాతి కంపెనీలు విదేశీ సంస్థల్లా కాకుండా భారతీయ కంపెనీల మాదిరిగానే నిధులను విరాళమిచ్చేందుకు వీలుగా సంబంధిత చట్టాలకు మోడీ సర్కార్‌ సవరణలను కూడా తీసుకువచ్చింది. పైగా, ఒక కంపెనీ మూడేళ్ళ సగటు లాభాల్లో 7.5 శాతం మొత్తాలను రాజకీయ పార్టీలకు విరాళాలుగా ఇవ్వవచ్చన్న పరిమితిని కూడా ఎత్తివేశారు.
   దీంతో విదేశీ కంపెనీల నుండి డబ్బు వరదలా వెల్లువెత్తడానికి మార్గం సుగమమైంది. భారత కంపెనీల నుండి అడ్డూ అదుపు లేకుండా పెద్ద మొత్తాలు పాలక పార్టీకి విరాళాలుగా వస్తున్నాయి. మోడీ ప్రభుత్వ నిరంకుశ ధోరణిని గమనించిన చాలా కంపెనీలు ప్రతిపక్షాలకు విరాళాలిచ్చి ముప్పును కొని తెచ్చుకోవడం లేదు. ప్రజలకు సంబంధించినంత వరకు ఈ బాండ్లు అజ్ఞాతమైనవే. కానీ, ఎవరికి బాండ్లు వస్తున్నాయో ప్రభుత్వం తెలుసుకోగలదు. ఎందుకంటే ప్రభుత్వ బ్యాంకుల ద్వారానే ఇవన్నీ వస్తాయి కాబట్టి.
   ఏప్రిల్‌లో జారీ అయ్యే బాండ్లు అసెంబ్లీ ఎన్నికలకు ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల కోసం బిజెపి కి నిధులు అందిస్తాయి. ఇప్పటి వరకు, ముంబయి తర్వాత పెద్ద మొత్తంలో బాండ్లు జారీ అయింది కోల్‌కతా లోనే. ముంబయి తర్వాత కోల్‌కతా లోనే బడా వ్యాపారాలన్నీ విస్తరించి వున్నాయి.
   ఈ బాండ్లు జారీ చేయడం వల్ల ఎన్నికల్లో నల్లధనం ప్రవహించదని, లెక్కలకు తగినట్లుగా వైట్‌ మనీని ఈ పథకం ప్రోత్సహిస్తోందని ప్రభుత్వం చెప్పడం కూడా మరో బూటకం. వ్యాపార వర్గాల నుండి పెద్ద మొత్తంలో వచ్చే బ్లాక్‌ మనీ...ఎన్నికల విరాళాల్లో ప్రధాన పాత్ర పోషిస్తోందన్నది సుస్పష్టం. ఈ బాండ్ల ద్వారా కార్పొరేట్లు, సంపన్నులు ఇచ్చే చట్టబద్ధమైన నిధులపై బిజెపి గుత్తాధిపత్యం చెలాయిస్తోంది. మరోపక్క ఇదే వర్గాల నుండి వచ్చే అప్రకటిత మొత్తాలు భారీగా పెరుగుతున్నాయి. బడా వ్యాపార వర్గాలతో గల సంబంధాలను లాంఛనప్రాయం చేసుకోవడానికి ఈ ఎలక్టోరల్‌ బాండ్‌ పథకం పాలక పార్టీకి చాలా విలువైనది.
   ఎలక్టోరల్‌ బాండ్లకు సంబంధించిన కేసులను మూడేళ్ళుగా చేపట్టకుండా సుప్రీంకోర్టు తన బాధ్యతలను నిర్లక్ష్యం చేసింది. 370వ అధికరణను రద్దు చేయడం, జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసిన కేసును చేపట్టడంలో విఫలమైనట్లుగానే ఇందులో కూడా సుప్రీం విఫలమైంది. ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోరు హయాం నుండి ఈ దాటవేత ధోరణి ప్రదర్శితమవుతూనే వుంది.
   రాజకీయ పార్టీలకు అందే నిధుల విషయంలో పారదర్శకత వుండేలా చూడడం కోర్టు బాధ్యత. జవాబుదారీతనం లేని, రహస్య వనరుల ద్వారా డబ్బు రావడాన్ని ఆపడం కూడా కోర్టు బాధ్యతే. ఈ సమస్యను ఎంత త్వరగా పరిష్కరిస్తే భారత ప్రజాస్వామ్యానికి అంత మంచిది.
 

/ 'పీపుల్స్‌ డెమోక్రసీ' సంపాదకీయం /