Mar 09,2021 07:11

   పంచాయితీ ఎన్నికలు జరుగుతాయని గ్రామంలో చాటింపు వేశారు. అందరూ రచ్చబండ దగ్గర చేరారు. గ్రామసభ మొదలైంది. పోటీలో ఇద్దరే అభ్యర్ధులు నిలబడ్డారు. ఒకరు పబ్లిక్‌ కాకి, రెండవవారు ప్రైవేటు కోయిల.
  ముందుగా ప్రైవేట్‌ కోయిల అభ్యర్ధిత్వాన్ని బలపరుస్తూ గోడీరావు తన గంభీరమైన శైలిలో ఆకట్టుకునే ప్రసంగం చేశాడు. అసలు ప్రైవేట్‌ కోయిలకి, పబ్లిక్‌ కాకి ఎందులోనూ సాటి రానేరాదన్నాడు. ఆ కోయిల మధురగాత్రం ఈ కాకికి ఎప్పటికీ రానే రాదన్నాడు. ప్రైవేట్‌ కోయిల చేసే గానం వింటే చాలు మన బాధలు, కష్టాలు అన్నీ మటుమాయమైపోతాయన్నాడు. ప్రైవేట్‌ కోయిల ఏవిధంగా కూస్తుందో తన బండ గొంతుకతో అనుకరించి వినిపించేడు. జనం
  ఉత్సాహంగా చప్పట్లు కొట్టేరు. వాళ్ళు చప్పట్లు కొట్టిందెందుకంటే అతగాడి ఉపన్యాస జడివాన కాసేపు ఆగినందుకు. గోడీరావు మాత్రం మరింత రెచ్చిపోయేడు. ప్రైవేట్‌ కోయిలకూతను ఇష్టపడనివాడు అసలు దేశభక్తుడే కాదన్నాడు. '' అదేంటి? ఒక దేశద్రోహికి కూడా ప్రైవేట్‌ కోయిల కూత నచ్చవచ్చును కదా? కూత నచ్చడానికీ, నచ్చకపోవడానికీ, దేశభక్తికీ సంబంధం ఏమిట''ని ఒక సందేహాలరావు లేచి అడిగేడు. వెంటనే అతగాడిని గోడీరావు అనుచరులు ''జై కోయిలా'' అని కేకలు పెడుతూ పక్కకి లాక్కుపోయేరు. ప్రైవేట్‌ కోయిల ఎన్నిక కాకుండా చూడడానికి పొరుగు దేశం కుట్ర పన్నుతోందని గోడీరావు గర్జించేడు. దాంతో జనాలు అలర్ట్‌ అయిపోయి సందేహాలరావు సంగతి మరిచిపోయేరు. అప్పుడు గోడీరావు ప్రైవేట్‌ కోయిలది మన అందరి లాంటి ఉత్తమ జాతి అని, పబ్లిక్‌ కాకిది ఏ జాతో ప్రజలే నిర్ణయించాలని అన్యాపదేశంగా రెచ్చగొట్టాడు. 'దమ్ముంటే ప్రైవేట్‌ కోయిలకు సాటిగా పాటల పోటీకి పబ్లిక్‌ కాకి సిద్ధమేనా?' అని సవాలు చేశాడు.
   పరిస్థితి చూస్తే వార్‌ వన్‌సైడ్‌ అయిపోయేలా ఉంది అనుకున్నారు జనమంతా.
  అప్పుడు పబ్లిక్‌ కాకి వంతు వచ్చింది. పబ్లిక్‌ కాకిని బలపరిచేవారు ఎవరు? అని అధ్యక్షులవారు అడిగేరు. వెనక నుంచి ఒక చెయ్యి పైకి లేచింది. సదరు వ్యక్తిని ముందుకొచ్చి మాట్లాడమని అధ్యక్షులవారు కోరేరు. అతగాడిని ముందుకు రాకుండా అడ్డుకోడానికి గోడీరావు అనుచరులు ప్రయత్నించేరు. కాని కుదరలేదు.
  ముందుకొచ్చిన ఆ వ్యక్తి ఎవరో కాదు. అతగాడి పేరు కార్మికదాసు. ప్రతీ ఏటా మేడే నాడు ఎర్రజెండా ఎగరేసి డప్పు కొట్టి మాంచి హుషారైన ట్యూన్‌లలో పాటలు పాడతాడని మాత్రం జనానికి తెలుసు. ఇప్పుడు కూడా పాట పాడితే విందామని సరదా పడ్డారు జనం.
  ''మీరంతా నా పాట వినాలని కోరుతున్నారని నాకు తెలుసు. కాని నేను వచ్చినది పబ్లిక్‌ కాకి అభ్యర్ధిత్వాన్ని బలపరచడానికి, అందుచేత మీ కోరిక ఆ తరవాత తీరుస్తాను. ముందు నేను కొన్ని చిన్న చిన్న ప్రశ్నలడుగుతాను. వాటికి సమాధానాలు తెలిస్తే మీరు చెప్పండి. '' అన్నాడు కార్మిక దాసు. అభ్యంతరం పెట్టడానికి లేచేడు గోడీరావు. ''నా ప్రశ్నలకి సమాధానం తెలిస్తే ముందు మీరే చెప్పవచ్చు.'' అని కార్మికదాసు అనడంతో గోడీరావు అభ్యంతరాన్ని అధ్యక్షులవారు తోసిపుచ్చేరు. అప్పుడు కార్మికదాసు ప్రారంభించేడు.
  మొదటి ప్రశ్న- మనల్ని ఉదయాన్నే తన కూతలతో నిద్ర నుండి మేలుకొలిపేది ఎవరు?
  ఆప్షన్‌ ఎ- పబ్లిక్‌ కాకి, ఆప్షన్‌ బి- ప్రైవేట్‌ కోయిల
  అందరూ ఆప్షన్‌ ఎ అని అరిచేరు ముక్త కంఠంతో.
 గోడీరావు లేచి కావాలంటే కోయిల కూడా లేపుతుంది అన్నాడు. ''కోయిల కూస్తే మరికాస్సేపు నిద్రపోవాలనిపిస్తుంది'' అని వెనకనుంచి అరిచారెవరో. గోడీరావు వెంటనే కూచుండిపోయాడు.
 రెండో ప్రశ్న- మనం పారేసిన ఎంగిలి మెతుకుల్ని తినడానికి, మనం బైట పారేసిన చచ్చిన ఎలకలు, బొద్దింకలు వంటివి వెంటనే ఎత్తుకుపోడానికి సిద్ధంగా ఉండేదెవరు?
ప్రశ్న పూర్తి కాకుండానే అందరూ 'పబ్లిక్‌ కాకి' అని గట్టిగా అరిచిచెప్పేరు.
''అటువంటి నీచపు పనుల్ని మా ప్రైవేట్‌ కోయిల ఎన్నటికీ చేయదు, మాది ఉత్తమ జాతి'' అని గర్వంగా చెప్పేడు గోడీరావు. ఆ దెబ్బకి ఇక 'పబ్లిక్‌ కాకి' పని అయిపోయిందనుకున్నాడు.
''ధన్యవాదాలు గోడీరావు గారూ, మీ ప్రైవేట్‌ కోయిల వలన జనానికి అవసరమైన పనులు ఏవీ జరగవు అని మీరే ఒప్పుకున్నందుకు'' అన్నాడు కార్మికదాసు. ''గోడీ, దెబ్బ తిన్నావులే'' అన్నారెవరో వెనకనించి.
మూడో ప్రశ్న- మన పెరట్లో పెంచుకునే కోళ్ళు వంటి వాటిని తన్నుకు పోడానికి గెద్దలు వంటి శత్రువులు వస్తే ఆ గెద్దల వెంటబడి తరిమే దమ్ము ఎవరికి ఉంది?
''ఇంకెవరికి? మన పబ్లిక్‌ కాకికే'' అని జనం అరిచేరు.
జనం మూడ్‌ మారిపోతోందని గాభరా పడిన గోడీరావు లేచి ''నువ్వు ఎన్నైనా చెప్పు. మా ప్రైవేట్‌ కోయిలకు సాటిగా మీ పబ్లిక్‌ కాకి పాడగలదా?'' అని నిలవేసేడు.
''ఎన్నటికీ పబ్లిక్‌ కాకి ప్రైవేట్‌ కోయిలలాగా పాడలేదు. అయితే అసలు ప్రైవేట్‌ కోయిల ఎందుకు పాడుతుంది? ఎప్పుడు పాడుతుంది? ఎవరి కోసం పాడుతుంది? వీటికి సమాధానం చెప్పగలరా?'' అనడిగేడు. జనం ఎవ్వరూ మాట్లాడలేదు. గోడీరావు కూడా మాట్లాడలేదు. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం దండుగ అనుకున్నాడు. ఓడిపోయేవాళ్ళే ఇలాంటి చెత్త ప్రశ్నలు వేస్తారన్నాడు.
అప్పుడు అక్కడికొచ్చిన ఓ పిట్టలు పట్టేవాడు ముందుకొచ్చి ఇలా చెప్పేడు. ''కోయిలలు అన్నీ పాడలేవు. గండుకోయిలలే కూస్తాయి. ఎప్పుడు కూస్తాయంటే వసంత కాలంలోనే కూస్తాయి. ఎందుకు కూస్తాయంటే అవి జతకట్టడం కోసం జంట కావాలి గనుక ఆకర్షించడానికి కూస్తాయి.''
పక్షుల నిపుణుడు చెప్పేడు గనుక తిరుగులేదని తీర్పు చెప్పేడు అధ్యక్షుడు.
''అంటే ప్రైవేట్‌ కోయిల తన కోసం, తనకి అవసరమైనప్పుడు మాత్రమే కూస్తుంది. పబ్లిక్‌ కాకి పబ్లిక్‌ కోసం రోజూ కూస్తుంది. ఏ కూత మనకి ఉపయోగం?'' అనడిగేడు కార్మికదాసు.
ఇక లాభం లేదని గోడీరావు మళ్ళీ కల్పించుకున్నాడు. ''కాకి కూతే మనకి ఉపయోగం. ఒప్పుకుంటాను. అందుకని పబ్లిక్‌ కాకినే ఎన్నుకోవాలా? ఉత్తమజాతి ప్రైవేట్‌ కోయిలను తిరస్కరిస్తే ప్రజల మనోభావాలు దెబ్బ తినవా?'' అని ఘోషించేడు.
అప్పుడు పిట్టలు పట్టేవాడు మళ్ళీ ముందుకొచ్చి ''అయ్యా, ఓ మాట. ఈ కోయిలకి అసలు గూడు కట్టుకోవడమే రాదయ్యా. అది తన గుడ్లను కాకి లేని సమయం చూసి ఆ కాకి గూట్లో పెట్టేస్తుంది. పాపం, ఆ కాకి తన గుడ్లతోబాటు వాటినీ పొదుగుతుంది. కోయిల పిల్లలు గుడ్ల లోంచి బైటకి రాగానే అక్కడి నుంచి పారిపోతాయి.'' అని చెప్పేడు.
''తను పెట్టిన గుడ్లను సైతం పొదగడం చేతకాని ప్రైవేట్‌ కోయిల, పబ్లిక్‌ కాకిని మోసం చేసే ఈ ప్రైవేట్‌ కోయిల ఇక మనకందరికీ ఏం చేస్తుందయ్యా?'' అని ఈ సారి జనం గోడీరావును అడిగేరు. జనం మూడ్‌ గోడీరావుకు అర్ధం అయిపోయింది. తన అనుచరులకు సైగ చేయబోయేడు. ఇంకెక్కడి అనుచరులు? జనం వాళ్ళ పని ఎప్పుడో పట్టేశారు.
అప్పుడు కార్మికదాసు అన్నాడు. ''చూడండి గోడీరావు గారూ, మీ ప్రైవేట్‌ కోయిల ఎందుకోసం కూసినా, ఆ కూత వినడానికి మాకూ బాగానే ఉంటుంది. కాబట్టి కూయనివ్వండి. గూడు కట్టుకోవడం చేతకాదు గనుక మా పబ్లిక్‌ కాకి గూట్లోనే తన గుడ్లను పెట్టనిద్దాం. దానికీ అభ్యంతరం లేదు. కాని తన కూత విని ముగ్ధులైపోయి తనకే మొత్తం అధికారం కట్టబెట్టమంటే మాత్రం అందుకు సిద్ధంగా లేం. చేతకానివాడికి ఎవరైనా అధికారం ఇస్తారా? అందుచేత ప్రైవేట్‌ కోయిలను ఉండనివ్వండి. ఆకులందు అణగిమణిగి అని గురజాడ అన్నట్టు అణగిమణిగి ఉండనివ్వండి. అంతేకాని ఎగిరెగిరి పడవద్దని చెప్పండి.''
''ఇక పబ్లిక్‌ కాకి అందంగా ఉండకపోవచ్చు. దాని కూత అసహ్యంగా ఉండొచ్చు. మమ్మల్ని అప్పుడప్పుడూ విసిగించవచ్చు. కాని పబ్లిక్‌ కాకి లేని గ్రామాన్ని మేం ఊహించుకోలేకపోతున్నాం. ఎలా ఉన్నా మా పబ్లిక్‌ కాకి మాకు కావాలి. అదే మాకు నాయకుడు.'' అన్నాడు కార్మికదాసు.
పబ్లిక్‌ కాకి గెలిచినట్టు అధ్యక్షులవారు జనం హర్షధ్వానాల మధ్య ప్రకటించేరు.
అప్పుడు జనం కార్మిక దాసును పాట పాడమని కోరేరు.
''అమ్మడానికి ఆడెవడు, కొనడానికి ఈడెవడు'' అంటూ పాట అందుకున్నాడు కార్మికదాసు.