ప్రజాశక్తి -యంత్రాంగం
గోపాలపట్నం : ఎల్‌జి పాలిమర్స్ దుర్ఘటనకు మూడేళ్లు కావడంతో వెంకటాపురం గ్రామంలో బాధిత కుటుంబాలతో కలిసి సిఐటియు నాయకులు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు గోపాలపట్నం కార్యదర్శి బలివాడ వెంకటరావు మాట్లాడుతూ, ఎల్‌జి పాలిమర్స్ దుర్ఘటన తరువాత ప్రభుత్వం బాధితకుటుంబాలకు ఎటువంటి సౌకర్యాలూ సమకూర్చలేదన్నారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తామని చెప్పి శంకుస్థాపనకే పరిమితమైన దుస్థితి ఈ ప్రభుత్వంలో ఉందని ఎద్దేవా చేశారు. వెంకటాపురం గ్రామం రెడ్ జోన్‌లో ఉందని, ఈ గ్రామానికి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని హామీ ఇచ్చి మరిచారని విమర్శించారు. ఎల్‌జి పాలిమర్స్ యాజమాన్యం చేసిన తప్పుకు 370 మంది కాంట్రాక్ట్ కార్మికులు బలైపోయారన్నారు. వీరికి ఒక్క రూపాయి కూడా నష్ట పరిహారం ఇవ్వకుండా చట్ట విరుద్ధంగా తొలగించారని తెలిపారు. సిఐటియు సీనియర్ నాయకులు పి.వెంకటరెడ్డి మాట్లాడుతూ, ఎల్‌జి పాలిమర్స్ ఘటన జరిగిన నెల రోజులు తరువాత మూడు కుటుంబాలకు చెందిన వ్యక్తులు మరణించారని, వారికి రూ.కోటి చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఆర్.శ్రీనివాసరావు. పి.అనసూయ, ఎ.గోవిందరావు, బాధిత కుటుంబాలు పాల్గొన్నాయి.
పెందుర్తిలో కొవ్వొత్తుల ప్రదర్శన
పెందుర్తి :ఎల్‌జి పాలిమర్స్ ఘటనకు మూడేళ్లయిన సందర్భంగా పెందుర్తి పోలీస్ స్టేషన్ వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జోన్ కార్యదర్శి బి.రమణి మాట్లాడుతూ, ఎల్‌జి పాలిమర్స్ ఘటనతో ఎంతో మంది ఎంతోమంది వికలాంగులుగా మారారని, వారిని నేటికీ ప్రభుత్వం ఆదుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతానని హామీ ఇచ్చినా నేటికీ అమలు కాలేదన్నారు. ఇప్పటికైనా బాధితులను ఆదుకోవాలని, లేకుంటే భారీ ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అప్పలనాయుడు, సంతోష్, రజిని తదితరులు పాల్గొన్నారు.










