ప్రజాశక్తి-విజయనగరం : జిల్లాలోని విజయనగరం 1వ పట్టణ, 2వ పట్టణ, బొబ్బిలి, నెల్లిమర్ల పోలీసు స్టేషన్ల పరిధిలో నివసిస్తూ పండగలకు, పుణ్య క్షేత్రాలకు, సొంత పనులపై ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రజలంతా తమ ఇళ్లలో ఎటువంటి దొంగతనాలూ జరగకుండా ఉండేందుకు ఎల్‌హెచ్‌ఎంఎస్. సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్‌పి ఎం.దీపిక కోరారు. దొంగతనాల నివారణకు పోలీసుశాఖ లాక్డ్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టంను ప్రత్యేకంగా రూపొందించి, భద్రతను మరింత పటిష్టం చేసిందన్నారు. ఈ విధానం పట్ల ప్రజలకు అవగాహన లేకపోవడం వలన అవసరాల నిమిత్తం ఇల్లు విడిచిపెట్టి బయట ప్రాంతాలకు వెళ్లేటప్పుడు దొంగతనాలు జరుగుతున్నా యన్నారు. తాము ఇల్లు విడిచి బయటకు వెళ్తున్నట్లు సంబంధిత పోలీసు స్టేషనుకు ముందస్తు సమాచారాన్ని అందిస్తే స్థానిక పోలీసులు ఎల్‌హెచ్‌ఎంఎస్ సౌకర్యాన్ని ఉచితంగా అందిస్తారన్నారు. ఏదైనా అవసరం లేదా ప్రత్యేక పని మీద తమ ఇంటిని విడిచిపెట్టి వెళ్లే ప్రజలు ముందుగా సంబంధిత పోలీసు స్టేషనుకు సమాచారం ఇస్తే పోలీసు అధికారులు ఆ ఇంటిని సందర్శించి, సిసి కెమెరాలను ఏర్పాటు చేసి, ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేస్తారన్నారు. ఇందుకు ఇంటి యజమాని తమ స్మార్ట్ ఫోనులో ఎల్‌హెచ్‌ఎంఎస్ యాప్‌ను డౌనులోడు చేసుకోవాలన్నారు. నిఘా కోసం ఏర్పాటు చేసిన సిసి కెమెరాలతో ఈ యాప్ అనుసంధానం చేయడం వలన దొంగతనాలను నివారించ వచ్చునన్నారు. ఎవరైనా అపరిచిత వ్యక్తులు ఇంటి పరిసరాలలోకి ప్రవేసించిన వెంటనే పోలీసులకు సమాచారం చేర వేస్తుందని, దీంతో అప్రమత్తమై, దొంగతనాలు జరగకుండా సులువుగా నియంత్రించ వచ్చునని ఎస్‌పి తెలిపారు. ఈ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు అత్యాధునికమైన 50 ఎల్‌హెచ్‌ఎంఎస్ కెమెరాలు అందుబాటులో ఉంచామన్నారు. దొంగతనాలను నివారించడానికి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
హోంగార్డు కుటుంబానికి ఆర్థిక సాయం
జిల్లా పోలీసుశాఖలో హోంగార్డుగా ఎంపికై పోలీసు శిక్షణ కళాశాలలో విధులు నిర్వహిస్తూ, ఇటీవల మృతి చెందిన పి.సూర్య ప్రకాశరావు కుటుంబానికి హోంగార్డులు ఒక్కరోజు అలవెన్సు రూ.3.46లక్షలను ఎఎస్‌పి అస్మాఫర్హీన్ అందజేశారు. మంగళవారం ఆయన కుమారుడు పి.మణికంఠకు ఈ మొత్తాన్ని చెక్కు రూపంలో అందజేశారు. కార్యక్రమంలో ఎఆర్ డిఎస్‌పి యూనివర్స్, ఆర్‌ఐ ఎన్.గోపాలనాయుడు, కార్యాలయ పర్యవేక్షకులు ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.