Jan 19,2023 23:39

నిరసన చేపుడుతున్న ఎల్‌ఐసి ఉద్యోగులు

ప్రజాశక్తి -నర్సీపట్నం టౌన్‌ :ప్రభుత్వ రంగాన్ని కాపాడి, ఎల్‌ఐసిని బలోపేతం చేయాలని స్థానిక ఎల్‌ఐసి ఉద్యోగులు కోరారు. స్థానిక ఎల్‌ఐసి ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఎల్‌ఐసి కార్యాలయం ముందు నినాదాలు చేశారు. ఎల్‌ఐసి ఉద్యోగుల సంఘం ఉద్యోగులు మాట్లాడుతూ, పాలసీదారులు కష్టపడి పొదుపు చేసుకున్న సొమ్మును దుర్వినియోగం అవుతుందనే ఉద్దేశ్యంతోనే ఎల్‌ఐసి ఆఫ్‌ ఇండియా ను జాతీయం చేశారన్నారు.ప్రజల సొమ్ము ప్రజలకు అనే నినాదంతోనే నాడు కొన్ని సంవత్సరాలు క్రితమే జీవిత భీమా వ్యాపార సంస్థలు జాతీయకరణ చేయాలని డిమాండ్‌ చేసేవారని అన్నారు. ఎల్‌ఐసి స్థిరంగా ఉంటూ తమ లక్ష్యాలను అద్భుతంగా సాధిస్తుందని, సామాజిక బాధ్యతలు నెరవేర్చడంలో ప్రముఖ పాత్ర వహిస్తుందని తెలిపారు. 1955లో ఐదు కోట్లతో ప్రారంభమైన ఎల్‌ఐసి ప్రస్తుతం 42.37 కోట్ల రూపాయలు ఆస్తులు కలిగివుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎల్‌ఐసి విస్తరించి ఉందని 30 కోట్లకు పైగా ఎల్‌ఐసి పాలసీదారులు ఉన్నారని, 2020 21 ఆర్థిక సంవత్సరంలో భారీ ఎత్తున భీమా సెటిల్మెంట్లు చేసి రికార్డు సాధించిందని గుర్తు చేశారు. అటువంటి ఈ సంస్థలో ప్రభుత్వం వాటా మూడు పాయింట్‌ ఐదు శాతం ఉపసంహరణ చేసుకుందని, ఇది ఎల్‌ఐసి మౌలిక లక్ష్యాలకు విఘాతం కలిగించే విధంగా ఉందన్నారు. దీన్ని భీమా ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఐఆర్‌డిఏఐ అనుసరిస్తున్న విధానాలతో దేశంలో బీమా సంస్థలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాయని, ప్రైవేటు ఇన్సూరెన్స్‌ సంస్థలకు లాభం చేకూర్చే విధంగా వ్యవహరిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు విసిహెచ్‌ నూకరాజు, కార్యదర్శి కేకేబీ పడాల్‌, చంటి, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.