Apr 29,2022 07:00

కేవలం తన బడ్జెట్‌ లోటును భర్తీ చేసుకోవడానికి ప్రభుత్వం ఎల్‌ఐసి ఐపిఓ ను తీసుకొస్తోందన్న మాట కేవలం పైపై విశ్లేషణ మాత్రమే. విషయం అంతకంటే పెద్దది! పేదల కష్టంతో సృష్టించిన సంపదను ధనికుల లోగిళ్ళ లోకి దారి మళ్ళించే విధానంలో భాగంగానే ప్రభుత్వం ఈ పని చేస్తున్నది. అందుకు ప్రభుత్వం ఎంచుకున్న మార్గం ప్రైవేటీకరణ. ఐపిఓ చేపట్టడమంటే... ఎల్‌ఐసి సంస్థ సృష్టించిన సంపదను...సంపన్నుల చేతుల్లోకి, లాభాల వేటలో ఉన్న స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్ల జేబుల్లోకి తరలించడమే.

ఎల్‌ఐసి లో పబ్లిక్‌ ఇష్యూ మే 4 నుండి 9 వరకు రాబోతోందని...షేర్‌ ధర, ఇతర వివరాలను ఎల్‌ఐసి బోర్డ్‌ ఏప్రిల్‌ 27న ప్రకటించింది. ఎల్‌ఐసి ఐ.పి.ఓ పై నిర్ణయం, షేర్‌ ధర అన్ని విషయాలు ఎల్‌ఐసి బోర్డ్‌ సొంత నిర్ణయమే అనుకోవాలన్నది ప్రభుత్వ ఆలోచన. అయితే ఎల్‌ఐసి ఐ.పి.ఓ ప్రహసనాన్ని గమనిస్తున్న వారెవరూ ఎల్‌ఐసి బోర్డు ఆధ్వర్యంలో ఇదంతా నడుస్తోందని నమ్మే స్థితిలో లేరు. ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్‌ను రెండేళ్ల కిందట సిఫారసు చేసి ఇప్పటిదాకా ప్రభుత్వ ఆమోదం పొందలేని బోర్డు...సంస్థ స్వరూప స్వభావాన్ని మార్చే ఐ.పి.ఓ విషయంలో స్వతంత్రంగా వ్యవహరిస్తోందని ఎవరైనా భావించగలరా?

2021-22 సంవత్సరాంతానికి ఎల్‌ఐసిలో 5 శాతం పెట్టుబడుల ఉపసంహరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ఆ అంచనాలను తలకిందులు చేసింది. యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా షేర్‌ మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఈ తరుణంలో కొత్త పెట్టుబడులు పెట్టడానికి వెనుకాడుతున్నారు. ఇటువంటి సమయంలో ఎల్‌ఐసి ఐ.పి.ఓ కోసం అర్రులు చాచడం చూస్తే ప్రపంచ పరిణామాల నుండి మన పాలకులు ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని అర్ధం అవుతుంది.

ఎల్‌ఐసి షేర్‌ ధర నిర్ణయం ఒక పెద్ద భారీ కుంభకోణమని 'న్యూస్‌ క్లిక్‌'లో ప్రముఖ జర్నలిస్టు వి.శ్రీధర్‌ అభివర్ణించారు. ఎల్‌ఐసి ఎంబెడెడ్‌ విలువ రూ.5.39 లక్షల కోట్లని మిల్లిమాన్‌ అనే అమెరికన్‌ కంపెనీ నిర్ణయించింది. ఇదే కంపెనీ గతంలో స్టాక్‌ మార్కెట్లో లిస్టింగ్‌ చేసిన ఇతర ప్రైవేట్‌ జీవిత బీమా కంపెనీల విలువను కూడా మదింపు చేసింది. అప్పుడు ఈ ప్రైవేట్‌ కంపెనీల ఆఫర్‌ ప్రైస్‌ ను ఎలా లెక్క కట్టారు? ఎంబెడెడ్‌ వాల్యూను 2.5 నుండి 4.05 వరకు ఫ్యాక్టర్‌ తో గుణించి లెక్క కట్టారు. హెచ్‌.డి.ఎఫ్‌.సి స్టాండర్డ్‌ లైఫ్‌ ను 4.05 రెట్లు, ఎస్‌.బి.ఐ లైఫ్‌ ను 3.1 రెట్లు, ఐ.సి.ఐ.సి.ఐ ప్రుడెన్షియల్‌ ను 2.5 రెట్లు గుణించి లెక్కగట్టారు.

నెల కిందట ఎల్‌ఐసి విలువను కూడా అదే పద్ధతిలో ఎంబెడెడ్‌ వాల్యూను 3 చేత గుణించి నిర్ణయిస్తారని కథనాలు వచ్చాయి. అలా చేసినట్లయితే, ఎల్‌ఐసి విలువ రూ.13.5 లక్షల కోట్ల నుండి రూ. 16.2 లక్షల కోట్ల వరకు నిర్ణయించేవాళ్లు. కానీ అలా జరగకుండా ఎంబెడెడ్‌ వాల్యూను కేవలం 1.1తో గుణించి ఎల్‌ఐసి విలువను రూ.6 లక్షల కోట్లుగా నిర్ణయించారు. దీంతో, ఎల్‌ఐసి లో షేర్ల అమ్మకం ద్వారా రూ.47,250 - రూ.56,700 కోట్ల రూపాయలు రావడానికి బదులు, సుమారు రూ. 21,000 కోట్లు మాత్రమే వచ్చే అవకాశం వుంది. అసలు మిల్లిమాన్‌ సంస్థ ఎల్‌ఐసి కి వున్న లక్షల కోట్ల రియల్‌ ఎస్టేట్‌ విలువను పరిగణన లోకి తీసుకోకుండానే, ఎంబెడెడ్‌ విలువ నిర్ధారించిందని, ఇదంతా భారీ కుంభకోణం కాక మరేమిటన్నది శ్రీధర్‌ ఆరోపణ.

ఈ మదింపు పద్ధతి పట్ల యాంకర్‌ ఇన్వెస్టర్లు సంతృప్తి పడ్డారని ప్రభుత్వం చెబుతోంది. ఎల్‌ఐసి షేర్ల విలువను దాని అసలు విలువ ఆధారంగా లెక్కగడతారా? లేక యాంకర్‌ ఇన్వెస్టర్ల కోరిక మేరకు లెక్క కడతారా? ఇది దారుణం కాదా? ప్రపంచ ఇన్సూరెన్స్‌ మార్కెట్లో ఎల్‌ఐసిది ఐదవ స్థానమనీ, మూడవ బలమైన, పదవ విలువైన బ్రాండ్‌ అనీ కేంద్ర ప్రభుత్వానికి తెలియంది కాదు. మణిపూసగా ఆర్థికవేత్తలచే కితాబులందుకున్న ఎల్‌ఐసి విలువను తక్కువ చేసి చూపడం అన్యాయం కాదా?

పాలసీదారులకు సర్‌ప్లస్‌ (బోనస్‌) పంపిణీ విధానాన్ని 95:5 నుండి 90:10కి మార్చారు. ఈ విధానాన్ని మార్చే చట్టబద్ధ సవరణలు అమలులోకి రాకముందు విక్రయించిన పాలసీలకు సర్‌ప్లస్‌లో అధిక వాటాలను ఆయా పాలసీదారులకు అందించాల్సిన ఒప్పందపర బాధ్యత ప్రభుత్వంపై లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అలాగే, నాన్‌ పార్టిసిపేటివ్‌ (బోనస్‌ వర్తించని) పాలసీల నుండి సర్‌ప్లస్‌ ను పాలసీదారులకు గాక, షేర్‌ హోల్డర్లకు వర్తించేలా మార్చడం ఎవరి ప్రయోజనాల కోసం 31 మార్చి 2021 నాటికి 73.25 శాతంగా ఉన్న పార్టిసిపేటింగ్‌ పాలసీల శాతం, 30 సెప్టెంబర్‌ 2021 కల్లా 61.67 శాతానికి పడిపోయింది. ఇదే కాలానికి నాన్‌ పార్టిసిపేటింగ్‌ పాలసీలు 24.82 శాతం నుండి 37.03 శాతానికి పెరిగాయి. దీనిని విశ్లేషిస్తే భవిష్యత్తులో పాలసీదారులకంటే షేర్‌హోల్డర్లకు అధిక లాభాలు చేకూర్చే విధంగా వ్యాపార సేకరణ విధానాలు అమలు జరిగే అవకాశం ఉందని మనకు అర్థమవుతుంది.

ఐపిఓ ప్రవేశపెట్టిన తర్వాత ఎల్‌.ఐ.సి వ్యాపార శైలి పూర్తిగా మారిపోతుందని 'అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘం' (ఎఐఐఇఎ) ఎప్పటి నుంచో చెప్తోంది. సంస్థ వ్యాపార దృక్పథం పూర్తిగా షేర్‌ హోల్డర్లకు అధిక లాభాలను ఆర్జించే విధంగా ఉండబోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఎస్‌.బి.ఐ లో పొందుపరిచిన డి.ఆర్‌.హెచ్‌.పి నివేదికను నిశితంగా పరిశీలించినట్లయితే ఈ విషయం మనకు స్పష్టమవుతుంది. అలాగే లాభార్జనే లక్ష్యంగా పెట్టుబడులు పెట్టే పద్ధతి కూడా మారబోతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. ఈక్విటీ మార్కెట్లో ఎల్‌ఐసి పెట్టుబడులు చారిత్రాత్మకంగా 18 శాతం ఉండేవి. 30 సెప్టెంబర్‌ 2021 నాటికి ఇది 24.77 శాతానికి పెరిగింది.

ఐపిఓ ప్రవేశపెట్టిన తర్వాత గ్రామీణ ప్రాంతాలను, బలహీన వర్గాలను ఎల్‌ఐసి పట్టించుకోదేమోననే ఆందోళన ఎఐఐఇఎ కు మొదటి నుంచీ ఉంది. గ్రామీణ ప్రాంతాల నుండి ఎల్‌ఐసి కి 48.22 శాతం ఏజెంట్లు ఉండగా, వారి ద్వారా ఎల్‌ఐసి కి మొత్తం పాలసీలలో 21.46 శాతం, ప్రీమియంలో 15.6 శాతం వ్యాపారం వస్తుంది. గ్రామీణ ప్రాంతాలను, బలహీన వర్గాలను విస్మరిస్తే తలెత్తే ప్రతికూల ప్రభావం ఈ గణాంకాల ద్వారా అర్థమవుతుంది. ఎల్‌ఐసి వ్యాపారాన్ని గమనిస్తే 28.89 శాతం పాలసీదారులు సాలీనా లక్ష కంటే తక్కువ సంపాదన కలవారు. 43 శాతం పాలసీదారుల వార్షిక ఆదాయం రూ.లక్ష నుండి రెండు లక్షల మధ్యలో ఉన్నది.

2021-22 ఆర్థిక సంవత్సరంలో ఎల్‌ఐసి పాలసీల సగటు ఏడాది ప్రీమియం రూ. 25,000 కాగా, ప్రయివేటు కంపెనీలలో ఇది రూ. 95,000గా ఉంది. దీనిని విశ్లేషించినప్పుడు ప్రైవేటు బీమా కంపెనీలు పెద్ద పాలసీలపై దృష్టి పెడితే, ఎల్‌ఐసి సంస్థ ఒక్కటే సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు బీమా రక్షణ కలిగిస్తుందని స్పష్టమవుతుంది. పెద్ద ప్రీమియం పాలసీలు, అర్బన్‌ వ్యాపారం బీమా సంస్థలకు లాభసాటిగా ఉంటుందనేది నిస్సందేహం. కాబట్టి ఎల్‌ఐసి లో వాటాలు కొన్న పెట్టుబడిదారులకు అధిక లాభాలను తెచ్చి పెట్టే వ్యాపారం వైపు సంస్థ సహజంగానే మొగ్గు చూపాల్సి వస్తుంది. ఇది మన దేశ గ్రామీణ పేద, బలహీన వర్గాల పట్ల తిరోగమన చర్యగానే భావించాలి.

ఎల్‌.ఐ.సి లో వాటాలు అమ్మకం చట్టపరమైన, నైతిక ప్రశ్నలను కూడా లేవనెత్తుతోంది. జీవిత బీమా వ్యాపారాన్ని జాతీయీకరణ చేసింది, ఎల్‌.ఐ.సి సంస్థను నెలకొల్పింది పాలసీదారుల పొదుపును పరిరక్షించడం కోసమే. ఇందులో ప్రభుత్వం ధర్మకర్తగా తన పాత్రను పోషించింది. 1956లో ఎల్‌.ఐ.సి లో ప్రభుత్వం పెట్టుబడి పెట్టిన ప్రారంభ మూలధనం రూ. 5 కోట్లు. అప్పటి నుండి నేటి వరకు ఎల్‌.ఐ.సి లో వ్యాపార విస్తరణ, అభివృద్ధి, జోనల్‌, డివిజినల్‌, బ్రాంచి కార్యాలయాల ఏర్పాటు అంతా పాలసీదారుల సొమ్ముతోనే జరిగింది. కాబట్టి ఎల్‌.ఐ.సి కి తాను యజమాని అని ప్రభుత్వం చెప్పుకోవడం అనైతికం. ఎల్‌ఐసి వేసిన ప్రతి ముందడుగు కేవలం పాలసీదారుల నుంచి సేకరించిన నిధుల వల్లనే సాధ్యమైంది. కాబట్టి ఈ సంస్థకు నిజమైన యజమానులు పాలసీదారులే.
కేవలం తన బడ్జెట్‌ లోటును భర్తీ చేసుకోవడానికి ప్రభుత్వం ఎల్‌ఐసి ఐపిఓ ను తీసుకొస్తోందన్న మాట కేవలం పైపై విశ్లేషణ మాత్రమే. విషయం అంతకంటే పెద్దది! పేదల కష్టంతో సృష్టించిన సంపదను ధనికుల లోగిళ్ళ లోకి దారి మళ్ళించే విధానంలో భాగంగానే ప్రభుత్వం ఈ పని చేస్తున్నది. అందుకు ప్రభుత్వం ఎంచుకున్న మార్గం ప్రైవేటీకరణ. ఐపిఓ చేపట్టడమంటే...ఎల్‌ఐసి సంస్థ సృష్టించిన సంపదను...సంపన్నుల చేతుల్లోకి, లాభాల వేటలో ఉన్న స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్ల జేబుల్లోకి తరలించడమే.

ఎటచ్చీ పాలసీదారులను శాంతింప చేసేందుకుగాను వారికి మొత్తం పది శాతం షేర్లను తగ్గింపు ధరకు ఇస్తామని ప్రకటించారు. దేశంలో 20 కోట్ల వ్యక్తిగత ఎల్‌.ఐ.సి పాలసీదారులు ఉన్నారు. కానీ వాళ్ల కోసం కేటాయించిన షేర్లు 2.21 కోట్లు మాత్రమే. ఇది కోట్లాది మంది పాలసీదారులను మభ్యపెట్టడం తప్ప మరొకటి కాదు. ఎల్‌ఐసి ఐపిఓ అన్నది సంస్థను ప్రైవేటీకరించే దిశగా తొలి మెట్టు అన్నది ఎఐఐఇఎ అభిప్రాయం. అందుకే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎఐఐఇఎ నాయకత్వంలో జరిగిన పోరాటం ఎల్‌ఐసి ప్రైవేటుపరం కాకుండా 28 సంవత్సరాల పాటు నిలువరించింది. ప్రభుత్వాల విధానాన్ని ఒక ట్రేడ్‌ యూనియన్‌ ఇంత సుదీర్ఘ కాలం ఆపిన చరిత్ర ప్రపంచంలో ఎక్కడా లేదు. ప్రభుత్వం ఒడిగట్టిన ఈ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా, రాబోయే రోజుల్లో కూడా ఎఐఐఇఎ ఆధ్వర్యంలో ఉద్యోగులు తమ పోరాటాన్ని కొనసాగించాలన్న దృఢ నిశ్చయంతో ఉన్నారు. కేరళ పూర్వ ఆర్థిక మంత్రి థామస్‌ ఐజాక్‌, ప్రొ. ప్రభాత్‌ పట్నాయక్‌, ప్రొ. జయతీ ఘోష్‌, ప్రొ.సి.పి. చంద్రశేఖర్‌, మాజీ బ్యూరోక్రాట్‌ ఇఐఎస్‌ శర్మ వంటి మేధావులున్న 'పీపుల్స్‌ కమిషన్‌' ఎల్‌ఐసి ఐ.పి.ఓ ప్రక్రియలో పారదర్శకత లేదని, దాన్ని నిలుపుదల చేయాలని...ప్రధానమంత్రికి, ఆర్థికమంత్రికీ లేఖలు రాసింది. ప్రెస్‌మీట్‌ లు నిర్వహించింది. ప్రభుత్వ బీమా రంగాన్ని పరిరక్షించుకోవడం కోసం పలు రూపాల్లో జరుగుతున్న పోరాటాలకు పాలసీదారులు, దేశభక్తులైన ప్రజానీకం మద్దతునివ్వాలి.

ఎల్‌ఐసి విలువ తగ్గింపు, అమ్మకం ఇన్వెస్టర్ల లాభాల కోసమే

పి. సతీష్‌
(వ్యాసకర్త : ఎల్‌ఐసి సౌత్‌ సెంట్రల్‌ జోన్‌ ఉద్యోగుల అధ్యక్షులు)