- ఆగస్టు 21, 22 తేదీలలో సౌత్ సెంట్రల్ జోన్ 12వ మహాసభలు
కేంద్ర ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం పన్నులు, డివిడెండ్ల రూపంలో ఎల్.ఐ.సి కోట్లాది రూపాయలు చెల్లిస్తోంది. సుమారు 42 కోట్ల పాలసీలతో అతి పెద్ద బీమా సంస్థగా ఎల్.ఐ.సి నిలిచింది. రైల్వేలు, జాతీయ రహదారులు, ఇరిగేషన్, హౌసింగ్, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలకు కోట్లాది రూపాయల పెట్టుబడులను ఎల్.ఐ.సి సమకూర్చింది. రూ. 32 లక్షల కోట్లకు పైగా ఆస్తులు కలిగిన ఎల్.ఐ.సి కోట్లాది మంది దేశ ప్రజలు కూడబెట్టుకున్న సంపద. ఇటువంటి అద్భుతమైన ప్రజా సంస్థను అస్థిరపరచేందుకు బి.జె.పి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
మన దేశ బీమా రంగంలో అతి పెద్ద ట్రేడ్ యూనియన్‌గా ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఎఐఐఇఎ) ప్రసిద్ధిగాంచింది. ఎల్.ఐ.సి లోని 85 శాతం పైగా ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తోంది. 1956లో 245 ప్రైవేట్ బీమా కంపెనీలను విలీనం చేసి నాటి నెహ్రూ ప్రభుత్వం ఎల్.ఐ.సిని ఏర్పాటు చేయకముందే 1951లో ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆవిర్భవించింది. స్ఫూర్తిదాయక పోరాటాలు, అపూర్వమైన త్యాగాలు, ప్రజలతో మమేకమై వారి మద్దతును కూడగట్టడం, ప్రభుత్వ విధానాలతో రాజీ పడకుండా ఉద్యోగుల మధ్య ఐక్యత సాధించటం, ఎన్నో సేవా కార్యక్రమాలు, ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న ప్రభుత్వ రంగ ఎల్.ఐ.సి ని బలోపేతం చేసేందుకు యూనియన్ ఇచ్చే పలు రకాల కార్యక్రమాలు, పట్టాదారుల సర్వీసింగ్‌కు అత్యంత ప్రాముఖ్యత, అనేక రంగాలలో జరుగుతున్న ఉద్యోగ, కార్మికవర్గ పోరాటాలకు అండగా నిలబడటం-ఇలా గత 70 సంవత్సరాల యూనియన్ చరిత్రలో ఎన్నో మలుపులు, మైలు రాళ్ళు. అనుభవాలు, ఘనమైన విజయాలు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వాల దాడి నుండి ఒక పక్క సంస్థను పరిరక్షించుకుంటూనే, మరొకపక్క ఉద్యోగుల జీవన ప్రమాణాల మెరుగుదలకు యూనియన్ విశేషంగా కృషి చేస్తోంది.
అనేక జోనల్, డివిజినల్, బ్రాంచి యూనిట్ల సమ్మేళనమే ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్- రాష్ట్రాలకు సంబంధించిన జోనల్ యూనిట్-సౌత్ సెంట్రల్ జోన్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (ఎస్‌సిజడ్‌ఐఇఎఫ్). ఈ జోనల్ యూనిట్ 12వ మహాసభలు ఆగస్టు 21, 22 తేదీలలో విజయవాడ లోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతున్నాయి. ఈ మహాసభలను జాతీయ ప్రధాన కార్యదర్శి కా|| శ్రీకాంత్ మిశ్రా ప్రారంభిస్తారు. మూడు రాష్ట్రాల నుండి ప్రతినిధులు, ఆల్ ఇండియా, జోనల్ మరియు డివిజన్ నాయకులు మహాసభలకు హాజరవుతున్నారు. మహాసభలను విజయవంతం చేసేందుకు శాసనమండలి సభ్యులు కె.యస్.లక్ష్మణరావు అధ్యక్షతన ఆహ్వాన సంఘం ఏర్పడింది.
రెండవ సారి ఏర్పడిన బి.జె.పి నాయకత్వం లోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎల్.ఐ.సితో పాటు యావత్తు ప్రభుత్వ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే విధానాలను అవలంభిస్తున్న నేపథ్యంలో ఈ మహాసభలు జరుగుతున్నాయి. 2020-21 బడ్జెట్ లోనే కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్టాక్ మార్కెట్‌లో ఎల్.ఐ.సి లిస్టింగ్ చేపడతామని ప్రకటించారు. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.2,10,000 కోట్ల మేరకు నిధుల్ని సమీకరిస్తామని ఆనాటి బడ్జెట్‌లో లక్ష్యాన్ని తీసుకున్నారు. 2021-22 బడ్జెట్‌లో ఈ లక్ష్యం రూ.1,75,000 కోట్లుగా కిందటి బడ్జెట్‌లో ప్రకటించారు. కోట్లాదిమంది పాలసీదారుల మన్ననలను పొంది, పలు ప్రపంచ రికార్డులు నెలకొల్పి అత్యంత సమర్థవంతంగా నడుస్తున్న ఎల్.ఐ.సి ని ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రైవేట్ బీమా కంపెనీలను 2000 సంవత్సరంలో అనుమతించారు. జీవిత బీమా మార్కెట్ లోకి ఇప్పటికే 25 కంపెనీలు ప్రవేశించాయి. అయినప్పటికీ ప్రతి సంవత్సరం బీమా మార్కెట్ లీడర్‌గానే కాకుండా మార్కెట్ కమాండర్‌గా ఎల్.ఐ.సి ప్రతి సంవత్సరం సుమారు 75 శాతం మార్కెట్ వాటాతో అగ్రగామి సంస్థగా నిలుస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు లక్షలాది మంది బాధితులకు సంబంధించిన క్లెయిమ్‌లను సత్వరమే ఎల్.ఐ.సి పరిష్కరించింది. కరోనా కష్టకాలంలోను ఇది స్పష్టంగా రుజువైంది. కేంద్ర ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం పన్నులు, డివిడెండ్ల రూపంలో ఎల్.ఐ.సి కోట్లాది రూపాయలు చెల్లిస్తోంది. సుమారు 42 కోట్ల పాలసీలతో అతి పెద్ద బీమా సంస్థగా ఎల్.ఐ.సి నిలిచింది. రైల్వేలు, జాతీయ రహదారులు, ఇరిగేషన్, హౌసింగ్, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలకు కోట్లాది రూపాయల పెట్టుబడులను ఎల్.ఐ.సి సమకూర్చింది. రూ. 32 లక్షల కోట్లకు పైగా ఆస్తులు కలిగిన ఎల్.ఐ.సి కోట్లాదిమంది దేశప్రజలు కూడబెట్టుకున్న సంపద. ఇటువంటి అద్భుతమైన ప్రజా సంస్థను అస్థిరపరచేందుకు బి.జె.పి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
కీలక రంగాలలో ఎటువంటి నియంత్రణ లేకుండా విచ్చలవిడిగా విదేశీ పెట్టుబడులను అనుమతిస్తున్నారు. ఆత్మనిర్భర్ భారత్ అంటూ ప్రధానమంత్రి మోడీ ఒక పక్కన ప్రకటిస్తుంటే, మరొక పక్కన రైల్వేలు, రక్షణ రంగ ఫ్యాక్టరీల ప్రైవేటీకరణ ప్రక్రియ వేగవంతమవుతోంది. లాభాలతో ఉన్నప్పటికీ ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను ఏమాత్రం ఆపేదిలేదని పార్లమెంట్ సాక్షిగానే కేంద్ర ఆర్థికమంత్రి ప్రకటించారు. దేశాభివృద్ధిలో ముఖ్య భూమిక పోషించిన ప్రభుత్వరంగ బ్యాంకులను సైతం క్రమంగా ప్రైవేటీకరిస్తున్నారు. బ్యాంకుల విలీనం ప్రక్రియను చేపట్టి వేగవంతంగా అమలు చేసేశారు. టెలికం రంగంలో దిగ్గజంగా ఉన్న బి.యస్.యన్.ఎల్ ను ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వమే దెబ్బతీసింది. రిలయన్స్ జియోను ప్రోత్సహించి ముఖేష్ అంబానీకి అండగా నిలబడింది. ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ను విదేశీ కంపెనీ పోస్కోకు అమ్మేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజాభిప్రాయాన్ని, ఉద్యోగుల నిరసనను ఏమాత్రం లెక్కచేయటం లేదు. స్టీలు ప్లాంట్ నిర్మాణానికై ఉద్యమించి అసువులుబాసిన వారి కలల్ని, వేలాదిమంది రైతుల ఆకాంక్షల్ని ప్రభుత్వం కాలరాస్తోంది. ప్రభుత్వ రంగ సాధారణ బీమా సంస్థలు, ఎయిర్ ఇండియా, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, బి.పి.సి.యల్., హెచ్.పి.సి.యల్ తో సహా ఏ ఒక్క ప్రభుత్వ రంగ సంస్థను ప్రభుత్వం వదిలిపెట్టడం లేదు.
పెట్రోలు, డీజిల్ ధరలతోపాటు నిత్యవసర సరకుల ధరలన్నీ ఆకాశాన్నంటాయి. ప్రజలపై ప్రభుత్వం పెను ఆర్థిక భారాలను మోపుతోంది. పేదరికం, నిరుద్యోగం, అసమానతలు దేశప్రజల ముందు పెను సమస్యలుగా మారాయి. ఆర్థిక వ్యవస్థ గత రెండు సంవత్సరాలుగా దిగజారింది. కోట్లాదిమంది ప్రజలకు జీవన భద్రత కొరవడింది. కనీస వేతనం రూ. 21,000 ఇవ్వాలని కోట్లాదిమంది కార్మికులు ఎప్పటినుండో డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం చెవికెక్కించుకోవటం లేదు. కోట్లాదిమంది శ్రామికుల కొనుగోలు శక్తి పెరగకుండా మన ఆర్థిక వ్యవస్థ ఎలా ముందుకు వెళుతుంది? బడా కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే కట్టుబడ్డ ప్రభుత్వానికి ఈపాటి కనీస ఆర్థిక సూత్రం తెలియక కాదు. ఏ ఆర్థిక విధానాలు ప్రజల జీవన స్థితిగతులను గత మూడు సంవత్సరాలుగా దిగజార్చాయో అవే విధానాలను మోడీ ప్రభుత్వం మరింత దూకుడుగా అమలు చేస్తోంది.
పైగా దేశ ప్రజల ప్రజాస్వామ్య, కార్మిక హక్కులపై దాడి జరుగుతోంది. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ తొమ్మిది నెలలుగా కొనసాగుతున్న రైతాంగ ఉద్యమం చారిత్రకమైనది. అన్నదాతల పట్ల మోడీ ప్రభుత్వం అత్యంత కర్కశంగా వ్యవహరిస్తోంది. ఎన్నో పోరాటాలతో, త్యాగాలతో సాధించుకున్న 44 కార్మిక చట్టాలను అత్యంత సులువుగా రద్దు చేసి వాటిని 4 కోడ్‌లుగా మార్చేశారు. కరోనా కష్టకాలంలోనూ అంబానీ, అదానీల ఆస్తులు భారీగా పెరిగిపోయాయి. మానవాభివృద్ధి నివేదిక, ఆక్స్‌ఫాం నివేదిక, ప్రజాస్వామ్య ఇండెక్స్, హ్యాపీ ఇండెక్స్-ఇలా పలు నివేదికలు మన దేశప్రజల జీవన పరిస్థితులు ఏమాత్రం సజావుగా లేవని స్పష్టంగా తేల్చేశాయి. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్ళించే కుటిల ప్రయత్నం జరుగుతోంది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రజల మధ్య అనైక్యత సృష్టించబడింది. ఇది చాలా ఆందోళనకరం. ఎల్.ఐ.సి ఉద్యోగులతో పాటు మొత్తం మధ్యతరగతి ఉద్యోగులందరూ సీరియస్‌గా గమనించాల్సిన ప్రమాదకర అంశమిది.
ఏ.ఐ.ఐ.ఇ.ఏ ఎప్పటికప్పుడు తీసుకుంటున్న వైఖరి ఫలితంగా ఉద్యోగుల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. సంస్థ ప్రగతి, సామర్ధ్యాలకు అనుగుణంగా మంచి వేతన సవరణ ఇటీవలనే జరిగింది. గత 70 ఏళ్ళలో ఎన్నో సదుపాయాలు, సౌకర్యాలు లభించాయి. దేశ విశాల ప్రయోజనాల కోసం ఎల్.ఐ.సి మరింత బలపడాలి. అటువంటి సంస్థను పాలసీదారులు, ఏజంట్లు, అధికారులు, ఉద్యోగులు అందరూ కలసి కంటికి రెప్ప వలె కాపాడుకోవాలి. అదే సమయంలో దేశప్రజల ఐక్యతను, మన వ్యవస్థలను భారత రాజ్యాంగాన్ని, ఆర్థిక స్వావలంబనను పరిరక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ సమాయత్తం కావాలి. ''దేశమంటే మట్టికాదోరు-దేశమంటే మనుషులోరు'' అన్న గురజాడ మాటలను, ''మానవుడే నా ఎజెండా'' అన్న మహాకవి శ్రీశ్రీ పదాలను మనమెలా మరిచిపోగలం !
/ వ్యాసకర్త సౌత్ సెంట్రల్ జోన్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సంయుక్త కార్యదర్శి /
జి. కిషోర్ కుమార్











