ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 బడ్జెట్ ప్రవేశ పెడుతూ ఎల్‌ఐసి లో ఐపిఓ చేపట్టడానికి వీలుగా ఎల్‌ఐసి చట్టానికి 27 సవరణలు ప్రతిపాదించారు. అలాగే బీమా రంగంలో విదేశీ పెట్టుబడుల శాతాన్ని 74 శాతానికి పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎల్‌ఐసి ని లిస్టింగ్ చేసే ప్రక్రియలో భాగంగా ఆర్థిక మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న 'దీపం' కు సలహాదారులుగా డెలాయిట్ కంపెనీ, ఎస్‌బిఐ కాప్స్ కంపెనీలను నియమించింది. ఎల్‌ఐసి నిజ విలువ మదింపు చేయడానికంటూ మిల్లిమాన్ కంపెనీని నియమించింది. ఎల్‌ఐసి లో వాటాలు అమ్మి ఆర్థిక లోటును పూడ్చుకునే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ఉందని స్పష్టంగా తెలుస్తోంది.
మన దేశ బీమా రంగంలో ఎఫ్‌డిఐ పరిమితిని పెంచాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఐఆర్‌డిఎ చట్టం 1999 ద్వారా బీమా రంగంలో 26 శాతం విదేశీ ఈక్విటీని అనుమతించారు. తదనంతరం, ఎఫ్‌డిఐ పరిమితిని 2015 సంవత్సరంలో 26 శాతం నుంచి 49 శాతానికి పెంచారు. ఇప్పుడు ఈ పరిమితిని 49 నుండి 74 శాతానికి పెంచాలని, బీమా సంస్థలలో విదేశీ యాజమాన్యాన్ని కూడా అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మన దేశ బీమా రంగంలోకి ప్రవేశించిన పెద్ద కార్పొరేట్ సంస్థలు తమ వ్యాపార ప్రయోజనాల విస్తరణ కోసం దేశం వెలుపల భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. కొన్ని కార్పొరేట్ బీమా సంస్థలు ఇప్పటికే స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయ్యి, మార్కెట్ల ద్వారా మూలధనాన్ని సమీకరించే స్థితిలోనే ఉన్నాయి. కనుక దేశీయ బీమా రంగంలో విదేశీ పెట్టుబడుల అవసరం ఎంతమాత్రం లేదు! బీమా రంగంలో విదేశీ పెట్టుబడులను ఎక్కువగా అనుమతిస్తే అవి దేశీయ పొదుపుపై పట్టు, నియంత్రణ సాధిస్తాయి. ప్రపంచ వ్యాప్త అనుభవాలను బట్టి చూస్తే విదేశీ పెట్టుబడులు, దేశీయ పొదుపుకు ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదని నిరూపితమైంది. ఇప్పటికీ 49 శాతం పరిమితితో ఉండవలసిన విదేశీ పెట్టుబడులు జీవిత బీమాలో 35.36 శాతం, సాధారణ బీమాలో 23.66 శాతంగా మాత్రమే ఉన్నాయి. అందువల్ల బీమా పరిశ్రమలో విదేశీ పెట్టుబడులను 49 శాతం నుంచి 74 శాతానికి పెంచడానికి ఎటువంటి హేతుబద్ధత లేదు. గత ఇరవై సంవత్సరాల కాలంలో, ఇప్పడిదాకా ఎఫ్‌డిఐ రూపేణా దేశ బీమా రంగంలోకి వచ్చిన రూ.10 వేల కోట్ల పెట్టుబడులలో అధిక భాగం స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికే వినియోగించబడింది. అంతే తప్ప దేశంలో మౌలిక వసతుల కల్పన కోసం ఏమాత్రం ఉపయోగపడలేదు. ఇప్పటికే లిస్టింగ్ అయిన ప్రైవేటు బీమా కంపెనీల బాలన్స్ షీట్లు చూస్తే, దేశ నిర్మాణం, మౌలిక వనరుల ప్రయోజనాల కోసం అవి పెట్టిన పెట్టుబడులు నామమాత్రమే అని అర్ధం అవుతుంది. బీమా రంగంలో ఎఫ్‌డిఐ లను పెంచడం, విదేశీ యాజమాన్యాన్ని అనుమతించడం మొదలైన నిర్ణయాలు భారతదేశం లోని ప్రజల విలువైన పొదుపును విదేశీ శక్తుల చేతికి అప్పగించడమే అవుతుంది!
ఎల్‌ఐసిలో వాటాల అమ్మకం పేరుతో ప్రభుత్వ పెట్టుబడులు ఉపసంహరించడం సంస్థ ప్రైవేటీకరణ దిశగా వేసే మొదటి అడుగు. ప్రజల చిన్న మొత్తాల పొదుపును ప్రీమియంల రూపంలో సమీకరించి, తద్వారా దేశ సర్వతో ముఖాభివృద్ధికి తోడ్పడే లక్ష్యంతో ఎల్‌ఐసి పార్లమెంటు చట్టం ద్వారా 1956లో ఏర్పరచారు. 'ప్రజల సొమ్ము, ప్రజా సంక్షేమానికి' అనే లక్ష్యంతో నాటి నుండి నేటి వరకు విజయవంతంగా, ప్రజలకు ఎల్‌ఐసి విశిష్ట సేవలు అందిస్తోంది.
లిస్టింగ్ వల్ల ఎల్‌ఐసిలో పారదర్శకత మెరుగుపడుతుందనే ప్రభుత్వ వాదన అసంబద్ధం! ఎల్‌ఐసి ఒక పారదర్శక సంస్థ. సమర్థవంతమైన బోర్డు నిర్వహించే సంస్థ. ప్రతి నెలా రెగ్యులేటర్ ఐఆర్‌డిఎ కి తన పని తీరు నివేదికలను సమర్పిస్తుంది. అలాగే పార్లమెంటు పరిశీలనకు తన జమా ఖర్చులు, ఎకౌంటు పుస్తకాలను ఉంచుతుంది. ఇంత పారదర్శకంగా ఈ సంస్థ పని చేస్తున్నప్పుడు ఇంకేం పారదర్శకత కావాలి? 'సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్' సంస్థ నిర్వహించిన ట్రాన్స్పరెన్సీ ఆడిట్లో ఎల్‌ఐసి గ్రేడ్-ఎ (97 శాతం)గా నిలిచింది. ఎల్‌ఐసి నిరర్ధక ఆస్తులు కేవలం 0.33 శాతం మాత్రమే.
భారత ఆర్థిక వ్యవస్థలో ప్రతి సంవత్సరం రూ.3.5 లక్షల కోట్ల నుంచి రూ.4 లక్షల కోట్లు వరకు నిధులను పెట్టుబడులుగా పెట్టగల ఎల్‌ఐసి సంస్థకు నిధుల కోసం మార్కెట్‌ను ఆశ్రయించాల్సిన పరిస్థితి లేదు. మార్చి 31, 2020 నాటికి ఎల్‌ఐసి రూ. 30.67 లక్షల కోట్ల పెట్టుబడులను ప్రజా సంక్షేమానికి అందించింది. ఇందులో రూ.24.10 లక్షల కోట్ల నిధులను కేంద్ర, రాష్ట్ర సెక్యూరిటీలలో, హౌసింగ్, నీటి పారుదల సౌకర్యాల కల్పన కోసం ఎల్‌ఐసి కేటాయించింది. దేశ అంతర్గత వనరుల సమీకరణలో ఎల్‌ఐసి వాటా 25 శాతం పై మాటే! దేశీయ రైల్వే అభివృద్ధికి ఎల్‌ఐసి రూ. లక్షా యాభైవేల కోట్లు, జాతీయ రహదారుల అభివృద్ధికి మరో లక్ష పాతిక వేల కోట్లు అందించనుంది. 440 బిలియన్ డాలర్ల విలువ చేసే ఆస్తులు కలిగిన (ఐక్యరాజ్యసమితి జాబితాలో ఉన్న 75 శాతం దేశాల జిడిపి కంటే చాలా ఎక్కువ), ఆదాయ పరంగా ఫార్చ్యూన్ 500 కంపెనీల జాబితాలో స్థానం పొందిన ఎల్‌ఐసి కి మార్కెట్ నుండి నిధుల అవసరం ఉందనేది హాస్యాస్పదం! లిస్టింగ్ చేయటం వలన ఎల్‌ఐసి పాలసీదారులకు లాభం కలుగుతుందనే వాదనలు పూర్తిగా అర్ధరహితం.1956 నుండీ ఎల్‌ఐసి పాలసీదారుల నిధులను పరిపూర్ణంగా సంరక్షిస్తూ వారికి మంచి బోనస్ కూడా అందిస్తోంది. 98.27 శాతం క్లెయిమ్‌లను పరిష్కరించడం ద్వారా ఎల్‌ఐసి ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఎల్‌ఐసి 2.15 కోట్ల క్లెయిమ్స్ చెల్లించి ప్రపంచంలోనే క్లెయిమ్ పరిష్కారంలో అత్యుత్తమ బీమా సంస్థగా పేరు పొందింది. ఐఆర్‌డిఎ వార్షిక నివేదిక 2018-19 ప్రకారం 99.57 శాతం డెత్ క్లెయిమ్‌లను ఎల్‌ఐసి పరిష్కరించింది. ఎల్‌ఐసి లో పెట్టుబడులు ఉపసంహరించి అందులో 10 శాతం షేర్లు పాలసీదారులకు ఇస్తామని ప్రభుత్వం ఆశ చూపుతోంది. ఎల్‌ఐసి చట్టానికి ప్రభుత్వం తీసుకు వస్తున్న సవరణలు భవిష్యత్‌లో పాలసీదారుల ప్రయోజనాలకు గండి కొట్టేలా ఉన్నాయి. కనుక, లిస్టింగ్ వలన ఎల్‌ఐసి జాతీయీకరణ లక్ష్యాలు వెనుకబాటు పట్టి, పేద, మధ్యతరగతి ప్రజలు, బలహీన వర్గాలకు చౌకగా బీమా సౌకర్యాన్ని అందించే సామాజిక లక్ష్యం కుంటుపడి, లాభరహితంగా గ్రామీణ ప్రాంతాల్లో బీమాను విస్తరించే లక్ష్యం కూడా వీగిపోతుంది.
ఎల్‌ఐసి ని స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేయడం ద్వారా దాని నిజవిలువ ఆవిష్కారం అవుతుందని, అలా సృష్టించిన సంపదలో రిటైల్ పెట్టుబడిదారులు పాల్గొనే అవకాశం వస్తుందనే ప్రభుత్వ వాదనలు అసంబద్ధం, అర్ధరహితం!! స్టాక్ మార్కెట్లో పాల్గొనే రిటైల్ మదుపుదారుల సంఖ్య, మొత్తం మదుపుదారుల సంఖ్యలో 3 శాతం మాత్రమే. మన దేశంలో మొత్తం డీమాట్ అకౌంట్లు దాదాపు 4 కోట్లు ఉంటే, అందులో కేవలం 0.95 అకౌంట్లు చురుకుగా ఉన్నాయి. కాబట్టి ఎల్‌ఐసి ని లిస్టింగ్ చేయటం వలన రిటైల్ పెట్టుబడిదారులకు ప్రయోజనం కలుగుతుందనటం అవాస్తవం. ఎల్‌ఐసి చట్టం, 1956 లోని సెక్షన్ 37 ప్రకారం ఎల్‌ఐసి లో పాలసీదారులు దాచుకున్న మొత్తాలకు, బోనస్ లకు కేంద్ర ప్రభుత్వం అదనంగా గ్యారంటీ ఇచ్చిన ఎల్‌ఐసి ప్రభుత్వ గ్యారెంటీని ఇంతవరకూ ఉపయోగించుకోలేదు. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం ధాటికి ఎఐజి వంటి అతి పెద్ద బీమా కంపెనీని అమెరికా ప్రభుత్వం ఆదుకోక తప్పలేదు. సెప్టెంబరు 11,2001న అమెరికాలో ట్విన్ టవర్లు తీవ్రవాద ఘటనలో కూలిపోతే, ప్రభుత్వ సాయం ఉంటేనే క్లయిములు చెల్లిస్తామని అక్కడి బీమా కంపెనీలు తెగేసి చెప్పాయి. ఇవన్నీ ప్రపంచ ప్రఖ్యాత స్టాక్ మార్కెట్ల లోని లిస్టింగ్ కంపెనీలే! దీనికి భిన్నంగా, దేశంలో ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు (వరదలు, సునామీలు, భూకంపాలు) సంభవించినా అన్ని నిబంధనలు సడలించి పాలసీదారుల క్లెయిములను, ఒక్క రూపాయి ప్రభుత్వ సాయం కోరకుండానే, ఎల్‌ఐసి పరిష్కరించింది. ప్రైవేటు బీమా పాలసీలకు ఎటువంటి ప్రభుత్వ గ్యారంటీ ఉండదు. విచక్షణా రహితంగా అమెరికన్ బీమా కంపెనీలు అధిక లాభాపేక్షతో పెట్టుబడులు పెట్టడం వల్లనే, ఆయా దేశాల్లో బీమా కంపెనీలు మునిగిపోయి, పాలసీదారులు పెద్ద ఎత్తున నష్టపోయారని అమెరికా లోని ఎ.ఎం ఏజెన్సీ దిగ్భ్రాంతి కలిగించే వాస్తవాలు బయట పెట్టింది. లిస్టింగ్ వల్ల కంపెనీలలో ఆర్థిక క్రమశిక్షణ పెరిగేలా ఉంటే, సెబీ కనుసన్నల్లో ఉన్న ఐఎల్‌ఎఫ్‌ఎస్, డిహెచ్‌ఎఫ్‌ఎల్, ఎస్ బ్యాంక్, లక్ష్మీ విలాస్ బ్యాంక్.... వంటి అనేక లిస్టెడ్ కంపెనీలు నిర్వహణా లోపం వల్ల ఎలా కుప్పకూలిపోయాయో మనం చూసాం. దీనికి భిన్నంగా స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు ఏర్పడిన ప్రతి సందర్భంలోనూ మార్కెట్లను ఎల్‌ఐసి నే ఆదుకుంది. అనేక సార్లు అత్యుత్తమ కార్పొరేట్ నిర్వహణకు 'బంగారు నెమలి' పొందింది. కేంద్ర ప్రభుత్వం ఎల్‌ఐసి లో పెట్టిన 100 కోట్ల ఈక్విటీ పెట్టుబడిపై 1956 నుండి ఇప్పటి వరకు డివిడెండ్ రూపంలో రూ.28,000 కోట్లను కేంద్ర ప్రభుత్వానికి ఎల్‌ఐసి అందించింది. 2019-20 సంవత్సరానికి రూ.2,697 కోట్ల డివిడెండ్‌ను ప్రభుత్వానికి ఎల్‌ఐసి అందించనుంది. ఇదిగాక పన్నుల రూపంలో ఎల్‌ఐసి ప్రభుత్వానికి ఏటా పది వేల కోట్ల రూపాయల పైబడి చెల్లిస్తోంది.
ఆత్మ నిర్భర భారతానికి ఎల్‌ఐసి పాత్ర కీలకం. 1956లో కేంద్ర ప్రభుత్వం రూ.5 కోట్ల మూలధన పెట్టుబడి పెడితే, నేడు రూ. 32 లక్షల కోట్ల ఆస్తులను ఎల్‌ఐసి స్వీయ శక్తితో ఆర్జించింది తప్ప, ప్రభుత్వ సాయాన్ని ఏనాడూ కోరలేదు. గత 20 సంవత్సరాలుగా 23 ప్రైవేటు బీమా కంపెనీల పోటీని ఎదుర్కొంటూ నేటికీ 71 శాతానికి పైగా మార్కెట్ షేర్‌తో ఎల్‌ఐసి మార్కెట్ లీడర్‌గా కొనసాగుతోంది. ఎల్‌ఐసి తన 2547 కార్యాలయాలను (52.1 శాతం) 50,000 కంటే తక్కువ జనాభా కలిగిన గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో నెలకొల్పింది. 23 ప్రైవేట్ బీమా కంపెనీల 77.1 శాతం కార్యాలయాలు మెట్రో, అర్బన్ ప్రాంతాల్లోనే నెలకొల్పారు. కేంద్ర ప్రభుత్వం ఎల్‌ఐసి లో ఐపిఓ ప్రయత్నాలను విరమించి... బీమా రంగంలో ఎఫ్‌డిఐ పెంపు బిల్లును విరమించుకోవాలని కోరుతూ...ఇప్పటికే ఎల్‌ఐసి ఉద్యోగ సంఘాలు, ఏజెంట్లు దేశవ్యాప్తంగా దాదాపు 450 మంది పార్లమెంట్ సభ్యులను కలిసి వినతి పత్రాలు సమర్పించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బడ్జెట్ పత్రాలతో పాటే ఎల్‌ఐసి చట్ట సవరణలను ఆమోదించుకోవాలన్న ప్రభుత్వ ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఎల్‌ఐసి లో ఉన్న దాదాపు అన్ని ఉద్యోగ సంఘాలు, ఏజెంట్ల సంఘాలు ఎల్‌ఐసి పరిరక్షణ ధ్యేయంగా రేపటి సమ్మెకు పిలుపునిచ్చాయి.
* పి. సతీష్ /వ్యాసకర్త ఎల్‌ఐసి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘ రాష్ట్ర నాయకులు, సెల్ : 94417 97900/
* మార్చి 18న ఎల్‌ఐసి దేశవ్యాప్త సమ్మె *










