Aug 11,2021 06:33

బ్యాంకుల జాతీయీకరణపై 1969లో పార్లమెంట్‌లో జరిగిన చర్చలో పాల్గొన్న యువ పార్లమెంట్‌ సభ్యుడు అటల్‌ బిహారీ వాజ్‌పేయి దీనిని వ్యతిరేకించారు. బ్యాంకుల జాతీయీకరణ ఒక వికృతమైన చర్య అని, అవసరం లేనిదనీ, అకారణమైనదనీ, అనుచితమని పేర్కొన్నారు. అప్పటి నుండీ ప్రభుత్వ రంగ సంస్థల పట్ల జనసంఫ్‌ు / జనతా పార్టీ / బిజెపి వైఖరి అలాగే ఉంది. అందుకే, ఈ ప్రభుత్వాన్ని మేము సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాం? ఎందుకు ఎల్‌ఐసి ని లిస్టింగ్‌ చేస్తున్నారు? ఎందుకు ఎల్‌ఐసి లో పెట్టుబడుల ఉపసంహరణ చేస్తున్నారు? ఇది ఎవరి ప్రయోజనాల కోసం ?

    డెబ్బై నాల్గవ స్వాతంత్య్ర దినోత్సవానికి దేశం సన్నద్ధమవుతోంది. పాలక వర్గాలు దేశభక్తి, జాతీయత వంటి మాటలతో మీడియాలో ఊదరగొడతాయి. అయితే, దేశ సహజ సంపదను, దశాబ్దాల ప్రజల స్వేదం, రక్తంతో నిర్మించుకున్న అన్ని ప్రభుత్వ సంస్థలనూ...ప్రయివేటు వారికి, కార్పొరేట్లకు సంతర్పణ చేసేస్తూ...జండా పండగ, దేశభక్తి అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడాన్ని ఏమనాలి? ఇదేం స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తి !
      ఎల్‌ఐసి ఆవిర్భావానికి దారి తీసిన బీమా జాతీయీకరణ ఆలోచన స్వాతంత్య్రోద్యమ సమయంలో వెల్లివిరిసిన జాతీయ స్పృహలో అంతర్భాగం. స్వాతంత్య్రోద్యమం కేవలం వలస పాలన నుండి విముక్తి పొందడమే కాకుండా, స్వేచ్ఛాయుతమైన సమ సమాజ స్థాపనను లక్ష్యంగా పెట్టుకుంది. 'దోపిడీని అంతమొందించాలంటే, రాజకీయ స్వేచ్ఛతో బాటు, ఆకలితో ఉన్న లక్షలాది మందికి నిజమైన ఆర్థిక స్వేచ్ఛ ఉండాలి' అని 1931లో కరాచీ లో జరిగిన జాతీయ కాంగ్రెస్‌ సదస్సు తీర్మానించింది. 1934లో జరిగిన కాంగ్రెస్‌ సోషలిస్ట్‌ గ్రూప్‌ సమావేశంలో తన చార్టర్‌ ఆఫ్‌ ఫ్రీడంలో 'ప్రజా పొదుపును జాతీయం చేయాల్సిన అవసరం ఉందనీ, దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వం వ్వూహాత్మక స్థానాన్ని కలిగి ఉండాలని కాంగ్రెస్‌ గట్టిగా నమ్ముతుందని పేర్కొన్నారు. ప్రజల పొదుపుపై ప్రభుత్వం నియంత్రణ ఉండాలని, అది ప్రైవేట్‌ సంస్థల పరం కాకుండా జాతీయాభివృద్ధికి మాత్రమే ఉపయోగించాలనే విషయమై స్వాతంత్య్రోద్యమం చాలా స్పష్టంగా ఉందని మనకు అర్ధమౌతుంది. జీవిత బీమా అనేది దీర్ఘకాల పెట్టుబడి. జీవిత బీమా వ్యాపారం కేవలం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. యూరోపియన్‌ దేశాల్లో ప్రయివేట్‌ గుత్త సంస్థలు చేసిన ఆర్థిక అరాచకాన్ని గుర్తించిన డా|| బి.ఆర్‌ అంబేద్కర్‌, బీమా రంగం ప్రభుత్వ అజమాయిషీలోనే ఉండాలని తన స్టేట్స్‌ అండ్‌ మైనారిటీస్‌ గ్రంథంలో పేర్కొన్నారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించిన 'రాజ్యాంగ సభ' భారతదేశం సమతుల్యంగా అభివద్ధి చెందాలంటే, దేశ ఆర్థిక రంగంలో ప్రభుత్వం ముఖ్య పాత్ర పోషించాలంది.
       అయితే, నాడు మన దేశ బీమా రంగంలో ఘోరమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇన్సూరెన్స్‌, బ్యాంక్‌ లు ప్రజల పొదుపును పోగుచేసి పెట్టుబడి గా తయారు చేసే సాధనాలు గనుక పెట్టుబడిదారులు ఒక బ్యాంక్‌, ఒక ఇన్సూరెన్స్‌ కంపెనీని తమ చేతుల్లో ఉంచుకునేవారు. ఉదాహరణకు టాటా చేతుల్లో న్యూ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీ, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఉండేది. అలాగే, దాల్మియా చేతుల్లో భారత్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ఉండేది. బిర్లా చేతుల్లో బాంబే లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ, యునైటెడ్‌ కమర్షియల్‌ బ్యాంక్‌ ఉండేది. ప్రజల పొదుపును తమ సొంత పెట్టుబడిగా మార్చుకుని, 1953లో 12 కోట్లు పెట్టుబడి పెట్టిన పెట్టుబడిదారులు 318 కోట్లు సంపాదించగలిగారు. ఈ పరిస్థితుల నడుమ 25 జీవిత బీమా కంపెనీలు మూతపడ్డాయి. మరొక 25 కంపెనీలు ఇతర కంపెనీలకు బదలాయించబడ్డాయి. దాల్మియా నేతృత్వం లోని భారత్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ రూ.2 కోట్లు దగా చేసింది. బీమా కంపెనీల ప్రీమియమ్‌ ధరల యుద్ధం నేపథ్యంలో కంపెనీ లాభాలు నిలబెట్టుకోవడం కోసం, సిబ్బందిని తగ్గించడం మొదలు పెట్టారు. ఈ పోటీలో నెగ్గలేని చిన్న కంపెనీలు మూతపడి ఉద్యోగులు వీధుల్లో పడ్డారు. దీంతో ఉద్యోగ భద్రత ప్రధాన సమస్య అయ్యింది.
       ఈ నేపథ్యంలోనే జీవిత బీమా రంగంలో పట్టాదారుల సొమ్ము, భద్రత ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లో మృగ్యం అని, పట్టాదారుల సొమ్ముకు పూర్తి రక్షణ కావాలంటే జాతీయీకరణ ఒక్కటే పరిష్కారమని అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో 1951 నుండి 1956 వరకు సమరశీలంగా జరిగిన ఉద్యమాల ఫలితంగా అప్పటి కేంద్ర ప్రభుత్వం జనవరి 19, 1956న జీవిత బీమా రంగాన్ని జాతీయీకరణ చేస్తూ ఆర్డినెన్సు తీసుకు వచ్చింది. అందుకే, స్వాతంత్య్రోద్యమ ప్రమాణాలలో జీవిత బీమా రంగ జాతీయీకరణ అత్యంత కీలకమైనది.
      ఈ రోజు ఏడాదికి రూ.3.5 లక్షల కోట్ల నుండి రూ.4 లక్షల కోట్లు దేశాభివృద్ధికి పెట్టుబడులు అందించగల స్థితిలో ఎల్‌ఐసి ఉందంటే, దానికి స్వాతంత్య్రోద్యమ నాయకుల దార్శినికతే ప్రధాన కారణం. 1956 నుండి ఇప్పటి వరకు దేశ ఆర్థిక వ్యవస్థలో 30 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టి, రూ. 35 లక్షల కోట్ల ఆస్తులు కలిగి, 40 కోట్ల పాలసీదారులకు ఎల్‌ఐసి విశేష సేవలు అందిస్తున్నది. ఇది ప్రపంచంలోనే అరుదైన ఘనత. ఎల్‌ఐసి దేశ సంక్షేమంతో పాటు దేశంలోని పెట్టుబడిదారీ వ్యవస్థకు సైతం ఊతం అందిస్తున్నది. ఎల్‌ఐసి ఈక్విటీ పెట్టుబడులు యాభై కంపెనీలలో ఉండటం దీనికి తార్కాణం.
        అటువంటి ఎల్‌ఐసి సంస్థలో వాటాలు దేనికి అమ్ముతున్నారో నిర్దిష్టమైన సమాధానం చెప్పే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. ఎల్‌ఐసి లో కేంద్ర ప్రభుత్వం కేవలం 5 శాతం నుండి 10 శాతం మాత్రమే వాటాను అమ్ముతుందని అదేపనిగా కేంద్ర మంత్రులు చెప్తున్నారు. ఎల్‌ఐసి చట్టానికి చేసిన తాజా సవరణల ప్రకారం 5 ఏళ్లలో ఎల్‌ఐసి లో కేంద్ర పెట్టుబడులు 51 శాతానికి పరిమితం కావడానికి అవసరమైన భూమికను ఏర్పరిచారు. ఒకపక్క యునైటెడ్‌ ఇండియా సాధారణ బీమా కంపెనీలో 100 శాతం ప్రభుత్వ వాటా అమ్మివేయాలని నిర్ణయించారు. ఇప్పటి దాకా స్టాక్‌ మార్కెట్‌ లో వుంచిన వివిధ ఆర్థిక, పారిశ్రామిక సంస్థలలో ప్రస్తుత ప్రభుత్వ వాటాను పరిశీలిద్దాం. ఎస్‌బిఐ -57.68 శాతం, ఒఎన్‌జిసి-62 శాతం, బిహెచ్‌ఇఎల్‌-63.17 శాతం, బిఇఎల్‌-55.27 శాతం, ఎస్‌సిఐ-63.17 శాతం. దీన్ని బట్టి చూస్తే ఒకసారి వాటాల విక్రయాలు మొదలైతే దానికి అంతే లేదు! ఇప్పటికే ప్రభుత్వం ఎన్‌టిపిసి, బిహెచ్‌ఇఎల్‌ లో 26 శాతం మేర వాటాలను అమ్మాలని నిర్ణయించింది
నీతి ఆయోగ్‌ సిఫార్సుల మేరకు అనేక ప్రభుత్వ రంగ సంస్థల్లో, బ్యాంకుల్లో వాటాలు పెద్ద ఎత్తున అమ్మడానికి రంగం సిద్ధమైంది. రెండు బ్యాంకులు మాత్రమే కాదు, దాదాపు ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ అమ్మివేస్తామని తాజాగా ఆర్థిక మంత్రిత్వ కార్యదర్శి ప్రకటించారు. బిపిసిల్‌ ను అమ్మాలని, హెచ్‌పిసిఎల్‌ లో మిగిలి ఉన్న ఒఎన్‌జిసి వాటాలను సైతం అమ్మివేయాలని ప్రయత్నిస్తున్నారు.
ఎల్‌ఐసి ని స్టాక్‌ మార్కెట్లో లిస్టింగ్‌ చేస్తే, అది కొద్ది మంది కార్పొరేట్లకు, ధనిక మదుపుదారులకు తప్ప దేశ ప్రయోజనాలకు ఎటువంటి ప్రయోజనం లేదు. ఒకసారి లిస్టింగ్‌ అయితే షేర్‌ హోల్డర్ల ప్రయోజనాలకు తప్ప దేశ ప్రయోజనాలకు పని చేయడం సాధ్యం కాదు. వి.ఎస్‌.ఎన్‌.ఎల్‌, బి.ఎ.ఎల్‌.సి.ఒ, సెన్‌టార్‌ హోటల్‌లో జరిగిన అనుభవాలు చూస్తే ఈ విషయం మనకు అర్ధం అవుతుంది. ఎల్‌ఐసి లిస్టింగ్‌ అయితే సంస్థ నిజ విలువ ఆవిష్కారం అవుతుందని, దాని విలువ పెరిగి చిన్న మదుపుదారులకు లాభం అని ఒకటే ప్రచారం చేస్తున్నారు. అయితే, సంస్థ లాభదాయకతకూ, షేర్‌ విలువకూ సంబంధం లేదని న్యూ ఇండియా ఇన్‌స్యూరెన్సు కంపెనీలో జరిగిన (ప్రభుత్వ సాధారణ బీమా రంగ కంపెనీ) పెట్టుబడుల ఉపసంహరణ ఉదంతం మనకు తెలియచేస్తుంది!
       నవంబర్‌ 2017 లో న్యూ ఇండియా కంపెనీ కు చెందిన 14.56 శాతం ప్రభుత్వ వాటాలను రూ. 9,600 కోట్ల రూపాయలకు ఐ.పి.ఓ రూపేణా విక్రయించడం జరిగింది. ఐ.పి.ఓ చేసేటప్పుడు ప్రతి షేర్‌ ధర రూ. 770-800 మధ్య నిర్ణయించారు. మొత్తంగా 12 కోట్ల షేర్లు అమ్మారు.తదనంతరం బోనస్‌ షేర్లు కూడా ఇచ్చారు. రిటైల్‌ ఇన్వెస్టర్లకు, ఉద్యోగులకు ఆఫర్‌ షేర్‌ ధరలో రూ. 30 తగ్గించారు. అయినా, కేవలం 2 శాతం ఉద్యోగులు మాత్రమే షేర్లు కావాలని దరఖాస్తు చేశారు. బోనస్‌ షేర్‌ కూడా కలుపుకుంటే, న్యూ ఇండియా ప్రారంభ షేర్‌ ధర సుమారు రూ.350 అనుకోవాల్సి ఉంటుంది. అయితే, నేడు స్టాక్‌ మార్కెట్‌లో ట్రేడింగ్‌ అవుతున్న న్యూ ఇండియా షేర్‌ ధర సుమారు రూ.165. ఐ.పి.ఓ తర్వాత, ఒకసారి మాత్రమే గరిష్టంగా రూ.179 కు షేర్‌ ధర చేరింది. అసలు న్యూ ఇండియా షేర్‌ ధర ఆశించినంత మేర ఎందుకు ఉండడం లేదు?
      న్యూ ఇండియా కంపెనీ 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఏ విభాగంలో చూసినా అద్భుతమైన పాటవాన్ని ప్రదర్శించి సాధారణ బీమా రంగంలో 16.8 శాతం మార్కెట్‌ వాటా సొంతం చేసుకుని ముందంజలో వుంది. కంపెనీ నికర విలువ, సేకరించిన ప్రీమియం, పన్నుల తర్వాత లాభం, బ్రాంచ్‌ శాఖలు, ఇలా అనేక అంశాల్లో ఇతర బీమా కంపెనీలతో పోలిస్తే న్యూ ఇండియా కంపెనీ దూసుకుపోతోంది. మరి, ఇంత అద్భుతంగా రాణిస్తున్న న్యూ ఇండియా కంపెనీ షేర్‌ విలువ తారాజువ్వలా పైపైకి పెరగాలి. అలా, ఎందుకు పెరగడం లేదు! సంస్థ లాభదాయకతకూ, షేర్‌ విలువకూ సంబంధం లేదని ఈ ఉదంతం మరొకసారి తెలియచేస్తోంది !
      నేడు న్యూ ఇండియా షేర్లు కలిగి ఉన్న రిటైల్‌ ఇన్వెస్టర్ల (2 లక్షల కంటే తక్కువ పెట్టుబడులు పెట్టే వారి) శాతం-కేవలం 0.81 శాతం. వారి సంఖ్య 1,01,800. కనుక, ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ చేసే సందర్భంలో చెప్పే వాదనలన్నీ అసంబద్ధ వాదనలే! పెట్టుబడుల ఉపసంహరణ వల్ల, రిటైల్‌ ఇన్వెస్టర్లు లాభపడతారు అనే వాదన భ్రమ! అతి కొద్ది మంది మాత్రమే షేర్లు కలిగి ఉంటారు. అసలు హవా అంతా స్వదేశీ, విదేశీ మదుపుదారులదే! ప్రభుత్వ రంగ సంస్థల లాభదాయకతకూ, వాటి షేర్‌ ధరలకు ఎటువంటి సంబంధం లేదు. ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థల షేర్‌ ధరలు పెరగకుండా, స్టాక్‌ మార్కెట్‌ లోని తిమింగలాలు కుయుక్తులు పన్నుతాయి. ఎస్‌బిఐ షేర్‌ ధరను, హెచ్‌డిఎఫ్‌సి షేర్‌ ధరను పోలిస్తే ఇదే అర్ధం అవుతుంది. షేర్‌ ధర పెంచడానికంటూ కంపెనీని లాభాల వేటలో పరుగులు తీయిస్తారు. సామాజిక లక్ష్యాలకు మంగళం పాడతారు. పర్మినెంట్‌ ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలని చూస్తారు. భవిష్యత్‌లో ఎల్‌ఐసి ని లిస్టింగ్‌ చేసినా, జరిగేదిదే!
ఎల్‌ఐసి లిస్టింగ్‌ విషయంలో ప్రభుత్వాన్ని నడిపే పార్టీ సిద్ధాంతాన్ని, భావజాలాన్ని మనం గమనంలో ఉంచుకోవాలి. బ్యాంకుల జాతీయీకరణపై 1969లో పార్లమెంట్‌లో జరిగిన చర్చలో పాల్గొన్న యువ పార్లమెంట్‌ సభ్యుడు అటల్‌ బిహారీ వాజ్‌పేయి దీనిని వ్యతిరేకించారు. బ్యాంకుల జాతీయీకరణ ఒక వికృతమైన చర్య అని, అవసరం లేనిదనీ, అకారణమైనదనీ, అనుచితమని పేర్కొన్నారు. అప్పటి నుండీ ప్రభుత్వ రంగ సంస్థల పట్ల జనసంఫ్‌ు / జనతా పార్టీ / బిజెపి వైఖరి అలాగే ఉంది. అందుకే, ఈ ప్రభుత్వాన్ని మేము సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాం? ఎందుకు ఎల్‌ఐసి ని లిస్టింగ్‌ చేస్తున్నారు? ఎందుకు ఎల్‌ఐసి లో పెట్టుబడుల ఉపసంహరణ చేస్తున్నారు? ఇది ఎవరి ప్రయోజనాల కోసం? ఈ చర్య జాతీయోద్యమ స్ఫూర్తికి విఘాతమని దేశభక్తులైన ప్రజానీకం భావిస్తున్నారు.

/ వ్యాసకర్త సెల్‌: 9441797900 /

పి. సతీష్‌

పి. సతీష్‌