
ప్రజాశక్తి-అనకాపల్లి
ఈ నెల 22, 23 తేదీల్లో విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో జరగనున్న ఎల్‌ఐసి ఏజెంట్స్ ఆర్గనైజేషన్ అఫ్ ఇండియా 6వ అఖిల భారత మహా సభలను జయప్రదం చేయాలని అనకాపల్లి బ్రాంచ్ ఏఓఐ అధ్యక్షులు పెంటకోట సైదునాయుడు పిలుపునిచ్చారు. స్థానిక జీవిత బీమా కార్యాలయం ఎదుట మహాసభకు సంబంధించిన గోడ పత్రికను మంగళవారం యూనియన్ ప్రతినిధులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గొర్లె శంకరావు, బ్రాంచ్ సెక్రటరీ, ట్రెజరర్ కరణం మాణిక్యం రావు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఐపీఓ పేరుతో బీమా సంస్థను ప్రైవేటుపరం చేసే కుట్ర చేస్తుందన్నారు. దీని వల్ల సంస్థతోపాటు ఏజెంట్ల భవిష్యత్తు ఆందోళనకరంగా మారిందన్నారు. రైతు ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఏజెంట్స్ వ్యవస్థని, యల్‌ఐసిని పరిరక్షించుకోడానికి, భవిష్యత్తు కార్యచరణ రూపొందించేందుకు మహాసభను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 22న విశాఖపట్నంలో భారీస్థాయిలో యల్‌ఐసి ఏజెంట్స్, ఉద్యోగులు, పాలసీదారులతో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ మహాసభలో కేరళ మాజీ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్, యల్‌ఐసి ఏఓఐ అఖిల భారత అధ్యక్షులు బాసుదేవ్ ఆచార్య, మాజీ ఎంపీ డాక్టర్ ఏ సంపత్ తదితరులు పాల్గొంటారని, ప్రతినిధుల సభను సీఐటీయూ జాతీయ కార్యదర్శి కేఎన్ ఊమేష్ ప్రారంభం చేస్తారని తెలిపారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జీవిత బీమా ఏజెంట్స్ ఎన్ అప్పారావు, పీలా శ్రీనివాసరావు, రొంగలి వెంకట్రావు, ఐతా రాము, కన్నారావు,అల్లవరపు రామకష్ణ, కొణతాల నూక అప్పారావు, ముమ్మన అప్పారావు, నరాలశెట్టి బాబురావు, సత్యారావు, చింత సురేష్ తదితరులు పాల్గొన్నారు.