
ప్రజాశక్తి-గుంటూరు లీగల్ : గుంటూరు ఎక్సైజ్ కోర్టులో సూపరింటెండెంట్, జిల్లా న్యాయశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షులుగా పనిచేస్తున్న ఎన్‌రెడ్డి పాపిరెడ్డి మంగళవారం స్వచ్చంద పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగ విరమణ సభకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై.వి.ఎస్.బి.జి పార్థసారధి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ పాపిరెడ్డి వృత్తిపట్ల నిబద్ధత, క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అని అన్నారు. అందరితో స్నేహంగా ఉండేవారని, మృదుస్వభావి అని ఇతరులకు సహాయపడే గుణం వ్యక్తి అని కొనియాడారు. కోవిడ్ సమయంలో న్యాయశాఖ ఉద్యోగస్తులకు సేవా కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి జి.స్పందన మాట్లాడుతూ విధులను ఎంతో పట్టుదలతో, ఎలాంటి అలసత్వం లేకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేసే వారన్నారు. సహచర ఉద్యోగులతో, న్యాయవాదులతో స్నేహంగా ఉండేవారన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు కె.సురేష్, జిల్లా కోర్టు ఏఒ బి.సూరిబాబు, నాజర్, అసిస్టెంట్ నాజర్ పి.మల్లేశ్వరరావు, జ్యోతి, నాలుగో తరగతి ఉద్యోగ సంఘ నాయకులు ఆర్.చంద్రశేఖర్, ఆర్.శ్రీనివాసరావు, న్యాయశాఖ సిబ్బంది, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం పాపిరెడ్డి దంపతులను న్యాయమూర్తులు సన్మానించారు.