ప్రజాశక్తి-కాకినాడ వర్షం లేక పంట పొలాలు ఎండిపోతున్న నేపథ్యంలో రైతులకు ఎకరానికి రూ.30 వేల పరిహారం ఇవ్వాలని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు డిమాండ్ చేశారు. గొల్లప్రోలు మండలంలో నీరు లేక ఎండిపోతున్న పంట పొలాలను సంఘం నాయకులతో కలిసి సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్రాంతంలో మొక్కజొన్న, మిరప, టమాట, బొబ్బర్లు, బెండ, పంటలను పరిశీలించామనానరు. వర్షాల్లేక పంట వేసినప్పటికీ పంటలన్నీ ఎండిపోతున్నాయన్నారు. రైతులు అప్పులు చేసి ఎకరానికి రూ.30 వేల వరకూ పెట్టుబడి పెట్టారన్నారు. వెంటనే వారికి నష్టపరిహారం చెల్లించాలని, బ్యాంకు రుణాలు మాఫీ చేయాలని, సాగునీరు కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. ఈ పర్యటనలో ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కెఎస్.శ్రీనివాస్, ఎపి కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం.రాజశేఖర్, వల్లు రాజబాబు, స్థానిక రైతులు దాసం నారయ్య, గారపాటి కాటంస్వామి, కుంపట్ల అన్నవరం, మేకల వీర్రాజు, పాశం వెంకటరమణ పాల్గొన్నారు.










