ప్రజాశక్తి-ఆలూరు
గతేడాది ఖరీఫ్‌లో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.15 వేల పరిహారం ఇవ్వాలని ఎపి రైతుసంఘం జిల్లా సహాయ కార్యదర్శి పి.హనుమంతు, మండల కార్యదర్శి ఈరన్న డిమాండ్ చేశారు. మంగళవారం ఆలూరులోని రైతుభరోసా కేంద్రంలో అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 2022వ సంవత్సరంలో నష్టపోయిన రైతులకు వచ్చిన బీమా పరిహారాన్ని నామమాత్రంగా విడుదల చేశారన్నారు. గతేడాది అతివృష్టి, అనావృష్టి, నకిలీ పత్తి విత్తనాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.1300 ఇవ్వడం అన్యాయమని తెలిపారు. ఒక్కో రైతు ఎకరాకు రూ.20 వేలు నష్టపోతే, ఒక్కో మండలంలో ఒక్కో రకంగా పరిహారం ఇవ్వడం సరికాదన్నారు. రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకునే నాయకులు ఆచరణలో విస్మరించారని తెలిపారు. వెంటనే నష్టపోయిన ప్రతి రైతుకూ, ప్రతి పంటకూ ఎకరాకు రూ.15 వేలు బీమా పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే రైతులను సమీకరించి పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. సిఐటియు మండల నాయకులు తిమ్మప్ప, రైతు సంఘం నాయకులు పరమేష్ గౌడ్, రామయ్య, శీను, శివ, సుంకప్ప, అంజి, సురేష్ పాల్గొన్నారు. ఆస్పరిలో ఎంపిఇఒ అనిల్‌కు వినతిపత్రం అందజేశారు. రైతు సంఘం మండల కార్యదర్శి రంగస్వామి, అధ్యక్షులు మధు రెడ్డి, నాయకులు మాణిక్యప్ప, బాలకృష్ణ, అనిమేష్, మల్లికార్జున, మహానంది, హనుమంతు, రామాంజనేయులు, రంగన్న పాల్గొన్నారు.
ఆర్‌బికె అధికారికి వినతిపత్రం అందజేస్తున్న రైతుసంఘం నాయకులు










