Oct 31,2022 23:05

ప్రజాశక్తి - విజయవాడ : నగరపాలక సంస్థ కౌన్సిల్‌ సమావేశం ఏకపక్షంగా సాగింది. మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి అధ్యక్షతన సోమవారం జరిగిన కౌన్సిల్‌ సాధారణ సర్వసభ్య సమావేశంలో అనేక ముఖ్యమైన అంశాలను సైతం 'ఎస్‌ ఆర్‌ నో' అన్న పద్ధతిలో అధికార వైసిపి ఫ్లోర్‌లీడర్‌ అరవ వెంకట సత్యనారాయణ ఆమోదింపజేసుకున్నారు. విపక్ష సభ్యుల ప్రతిపాదనలపై కనీసం చర్చ జరగలేదు. కనకదుర్గ వారధి వద్ద కృష్ణలంకలో కృష్ణానది వెంబడి రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం కారణంగా తొలగించిన 524 మంది ఇళ్లతోపాటు అదనంగా 187 మంది నిర్వాసితులను గుర్తించి ప్రభుత్వ గృహాలను మంజూరు చేసే అంశాన్ని అత్యవసర అంశం సెక్షన్‌-88(కె) కింద అప్పటికప్పుడు తీసుకొచ్చారు. దీనిపై కనీసం తీర్మానం కాపీని కూడా సభ్యులకు పంపిణీ చేయకుండా ఏకపక్షంగా ఆమోదింపజేసుకున్నారు. యుజిడి, పైప్‌లైన్లతోపాటు ప్రత్యేక కమిటీల నుంచి కౌన్సిల్‌కొచ్చిన 48వ అంశం నుంచి 81 వరకు మొత్తం 34 అంశాలపై చర్చించాలని టిడిపి సీనియర్‌ నాయకులు ముమ్మనేని వెంకటప్రసాద్‌, జాస్తి సాంబశివరావు, సిపిఎం ఫ్లోర్‌లీడర్‌ బోయి సత్యబాబు పట్టుబట్టారు. అయితే అసలు చర్చకే తావివ్వకుండా నిమిషాల వ్యవధిలోనే ముగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి విడుదల కావాల్సిన 14వ, 15వ ఆర్థిక సంఘాల నిధులు, గ్రాంట్లు మొత్తం రూ.650 కోట్లను విఎంసికి తెప్పించడంలో అధికార వైసిపి విఫలమైందని, ఇప్పటికైనా ఆ నిధులు తెప్పించాలని సిపిఎం ఫ్లోర్‌లీడర్‌ బోయి సత్యబాబు చేసిన డిమాండ్‌ను అధికార వైసిపి కనీసం పరిగణనలోకి తీసుకోలేదు. 120 మంది పారిశుధ్య కార్మికులను భర్తీ చేసుకోవాలని ఏడాది క్రితం విఎంసి చేసిన తీర్మానాన్ని అమలు చేమలు చేయాలని, విఎంసి కార్యాలయ సిబ్బంది మంచినీటి వసతి కోసం కృష్ణానది నీటిని సరఫరా చేయాలని, చనుమోలు వెంకట్రావు ఫ్లైవోవర్‌పై గుంటలకు మరమ్మతులు చేయాలని సత్యబాబాబు ప్రతిపాదించారు. దీనిపై ఆయన మాట్లాడేందుకు ప్రయత్నించేలోగానే వైసిపి ఫ్లోర్‌లీడర్‌ చకచకా వాటిని చదివేశారు. ఇక మాట్లాడేదేమి లేదన్నట్లుగా వ్యవహరించారు. రద్దీ ప్రదేశాలు, కూడళ్లలో మరుగుదొడ్లను సైతం బిఒటి పద్ధతిలో ప్రైవేటు వారికి అప్పగించే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సత్యబాబు డిమాండ్‌ చేశారు. కోట్లాది రూపాయల విలువైన స్థలాలకు రక్షణ కరువైందని, దళారులు, భూకబ్జాకోరుల పరమవుతుంటే విఎంసి చూస్తూ మిన్నకుంటోందని మండిపడ్డారు. వివిధ విభాగాల్లోని కార్మికుల వేతనాలను సుప్రీంకోర్టు చేసిన సిఫారస్సులకు అనుగుణంగా పెంచాలని డిమాండ్‌ చేశారు. నగరంలో లైటింగ్‌ వ్యవస్థను మెరుగుపరచాలని పార్టీలకతీతంగా సభ్యులు పట్టుబట్టారు. తన డివిజన్‌ నుంచి వివిధ రూపాల్లో ఏడాదికి రూ.4 కోట్ల ఆదాయం విఎంసికి వస్తుంటే కనీసం రూ.30 లక్షల విలువైన పనులు కూడా చేయడంలేదని టిడిపి సీనియర్‌ సభ్యులు ముమ్మనేని వెంకటప్రసాద్‌ ఆవేదన వ్యక్తం చేశారు. యుజిడి వ్యవస్థ, పారిశుధ్యం దారుణంగా ఉందని ఆయన విమర్శించారు. దీనిపై సిపిఎం, వైసిపి సభ్యులు కూడా తమ తమ డివిజన్లలోనే అదే పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. విఎంసి కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ సమాధానమిస్తూ సభ్యులు వ్యక్తంచేసిన అభిప్రాయాలతో తానూ ఏకీభవిస్తున్నానని, యుజిడి వ్యవస్థ మెరుగుదలకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.