Jul 23,2023 00:37

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి పిఠాపురం మండలం జల్లూరు శివారు గోవిందరాజుపాలెం ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5 వరకు 12 మంది విద్యార్థులున్నారు. ఇక్కడ ఒక్కరే ఉపాధ్యాయుడు పని చేస్తున్నాడు. ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు రాకపోతే పాఠశాలకు ఆ రోజు సెలవు ఇచ్చేయాల్సిందే. అంతేకాక ఒక్కో తరగతికి ఐదు సబ్జెక్టులు చొప్పున అన్ని తరగతులకూ ఒకరే సిలబస్‌ పూర్తి చేయాలి. వీటితోపాటు బోధనేతర పనులు నిర్వహించాల్సి వస్తుంది. ఇలా జిల్లాలో అనేక చోట్ల ఒక్కొక్కరే విధులు నిర్వహిస్తుండడం వల్ల పాఠ్యాంశాల బోధనకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. అంతేకాక ప్రాథమిక విద్యలో నాణ్యత కొరవడుతోంది.
విలీనం సమస్యలతో ప్రాథమిక విద్య కనుమరుగయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. నూతన విద్యా విధానంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక కిలోమీరు పరిధిలో ఉన్న 3, 4, 5 తరగతుల ప్రాథమిక పాఠశాలలను, 3 కిలోమీటర్లు పరిధిలో ఉన్న యుపి స్కూళ్లను హైస్కూళ్లలో విలీనం చేయడం వల్ల పలువురు విద్యార్థులు ప్రైవేట్‌ పాఠశాలల్లో చేరిపోయారు. దీంతో పలు ప్రైమరీ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య బాగా తగ్గిపోయింది. దీంతో సింగిల్‌ టీచర్‌ పాఠశాలల సంఖ్య మరింత పెరిగింది. మరోవైపు ప్రభుత్వం 20 కంటే తక్కువగా విద్యార్థులున్న పాఠశాలల్లో ఒక్కొక్క టీచర్‌నే ఉంచింది. ఇలా జిల్లాలో 250 పైనే సింగిల్‌ టీచర్‌ పాఠశాలలున్నాయి. అయితే కాకినాడ జిల్లా విద్యాశాఖ అధికారులు మాత్రం ఈ వివరాలు వెల్లడించేందుకు నిరాకరిస్తున్నారు.
కుంటుపడుతున్న ప్రాథమిక విద్య
ప్రభుత్వ విధానాలతో ప్రాథమిక విద్య భవిష్యత్తులో కనుమరుగయ్య పరిస్థితి నెలకొంది. విలీనం సమస్యలతో అనేకచోట్ల విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గిపోవడంతో పాటు ప్రభుత్వం ఉపాధ్యాయుల సంఖ్యను కుదించింది. కరప మండలం వేములవాడ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న 3, 4, 5 తరగతి విద్యార్థులను సమీపంలో ఉన్న హైస్కూల్లో విలీనం చేయడం వల్ల 1, 2 తరగతుల్లో ఇక్కడ కేవలం 16 మంది మాత్రమే విద్యార్థులు మిగిలారు. ఒకే ఉపాధ్యాయుని ఉంచారు. విద్యార్థులందరికీ చదువు చెప్పడంతో పాటు బోధనేతర పనులు ఒక్కరే చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పిఠాపురం మండలం మల్లం గ్రామంలో నెంబర్‌ వన్‌ ఎలిమెంటరీ పాఠశాలలో ముగ్గురు, కెపి.మల్లంలో నలుగురు, ఎవిఎన్‌ మల్లంలో 12 మంది విద్యార్థులు ఉండగా ఒక్కో ఉపాధ్యాయుడే విధులు నిర్వర్తిస్తున్నారు. దీని వల్ల సింగిల్‌ టీచర్లు 1 నుంచి 5వ తరగతి వరకు 18 సబ్జెక్టులు ఉదయం నుంచి సాయంత్రం వరకు విరామం లేకుండా బోదించాల్సి రావడంతో ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పరిస్థితిలోనూ సమీప పాఠశాలల్లోనూ ఇద్దరేసి ఉపాధ్యాయులే ఉండటం, వారిలో ఒకరు సెలవు పెడితే డిప్యుటేషన్‌ ఇబ్బందిగా మారుతోంది. కొన్ని సందర్భాల్లో స్కూళ్లు మూసి వేస్తున్న సందర్భాలు ఉన్నాయి. అన్ని తరగతుల పిల్లలకు ఒకే గదిలో పాఠాలు చెబుతూ ఉండడంతో అభ్యసనపై ప్రభావం పడుతోందని పలురు టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్న భోజనం, ఆన్‌లైన్‌ హాజరు నమోదు, మరుగుదొడ్ల శుభ్రత ఫొటోలు అప్‌లోడ్‌ చేయాల్సి రావడం. 'నాడు-నేడు' పనులు చూసుకోవడంతో బోధన పనులకు కష్టాలు తప్పడం లేదు.