ప్రజాశక్తి- అనంతగిరి:భీంపోల్ పంచాయతీ పరిధిలో ప్రవేటు ఏకో టూరిజం నిర్మానానికి శ్మశాన భూమి, గెడ్డ పోరంబోకు భూములను ఎలా కేటాయిస్తారని జెడ్పీటీసీ దీసరి. గంగరాజు ప్రశ్నించారు. సోమవారం ఈ విషయం పై జెడ్పీటీసీ గంగరాజు ఆధ్వర్యాన తహశీల్దార్‌కు విన్నవించేందుకు వెళ్లారు. ఆయన అందుబాటులో లేక పోవడంతో సీనియర్ అసిస్టెంట్, ఆర్‌ఐలకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గంగరాజు మాట్లాడుతూ, భీంపోలు పంచాయతీ పరిధిలోని భూములు కేటాహిస్తుట్లు అనంతగిరి తహాశీల్దార్ ఈ 4న సర్క్యులర్ జారీ చేయడంపై మండి పడ్డారు. భీంపోలు పంచాయతీ నందకోట రెవెన్యూ పరిధిలోని సర్వే నెం 22/24/28లో భూమిని ఫారెస్టు డిపార్టుమెంటు ద్వారా విజయనగరం జిల్లాకి చెందిన రమేష్ అనే బడా భూస్వామికి లీజుకు ఇవ్వడానికి నోటిఫికేషన్ జారీ చేయడం పై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వాల్టా చట్టం ప్రకారం నదీ పరివాహక ప్రాంతాల్లో ఎటువంటి కట్టడాలు చేయకూదన్నారు.శ్మశానం భూములు ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వరాదనే నిబంధనలు ఉన్నప్పటికీ ఏకో టూరిజం పేరుతో ప్రైవేటు వ్యక్తికి సుమారు 50 ఎకరాలు ఇవ్వడానికి ప్రతిపాదన ఎలా చేశారని గంగరాజు ప్రశ్నించారు. చట్టాన్ని కాపాడాల్సిన అధికారులే అధికార పార్టీ నాయకుల ఒత్తిడికి తలొగ్గి ఈ విధంగా చట్టాన్ని ఉల్లంఘించడం సమంజసం కాదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజల వినతులు పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులతో కలిసి పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు కె.మొస్య, ఎస్.నాగులు, జేష్ట వెంకటరమణ, జె.సుబ్బారావు, రైతులు వనెపూరి .దేముడు, వనెపూరి కన్నయ్య, వనెపూరి. ఈశ్వరమ్మ, మామిడి రమేష్, తామరపల్లి సోమయ్య, సన్యాసి పాల్గొన్నారు.










