Aug 08,2021 12:00

సభ ఇంకా మొదలు కాకపోవటంతో అక్కడంతా కోలాహలంగా ఉంది.
సివిల్స్‌లో దేశంలోనే టాప్‌ ర్యాంక్‌ సాధించినందుకుగాను వంశీకి అతని స్నేహితులూ, అతడు చదివిన కాలేజీ యాజమాన్యమూ కలిసి, పెద్ద ఎత్తున సన్మానం ఏర్పాటు చేశారు. సన్మాన కార్యక్రమానికి హాజరయ్యే పెద్దలకోసం డయాస్‌ మీద ఏర్పాట్లు జరుగుతున్నాయి. కింద ముందు వరుసలో రాఘవరావుగారు ఆశీనులై వున్నారు. ఆయన పక్కనే మధ్య వయస్కుడైన కృష్ణ కూర్చుని వున్నాడు.
తన మనవడు సాధించిన విజయానికి రాఘవరావుగారు సంతోషంలో మునిగిపోయి, 'ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది కృష్ణా!' అన్నారు.
'అవును మాస్టారూ! వంశీకి చిన్నప్పట్నుంచీ చదువు సంధ్యలు నేర్పించి, అతడీ స్థాయికి చేరటానికి మీరు మీ సర్వశక్తులూ ధారపోశారు. మీరు చాలా గ్రేట్‌' అన్నాడు.
'వాడికి చదువు చెప్పింది నేనే అయినా, నువ్వా రోజు నా గురించి వాడితో అన్న మాటలే, వాడికి స్ఫూర్తిని కలిగించి, నాపైన అపారమైన నమ్మకం కలిగేట్లు చేశాయి. నువ్వు నా శిష్యుడివన్న సంగతి వాడికి నువ్వు చెప్పి వుండకపోతే, ఇప్పుడు వాడీ స్టేజీమీద వుండేవాడు కాదు. ఏదేమైనా ఇలా నా మనవడు అభివృద్ధిలోకి రావటానికి ప్రత్యక్షంగా నేనూ, పరోక్షంగా నువ్వూ కారణమయ్యాం' అన్నారాయన.
అవునంటూ తలూపాడు కృష్ణ. అతని గతంలోకి మనసు పరిగెత్తింది.

                                                                        ***

'ఏమ్మా వసంతా! దేనిగురించి అంత దిగులుగా ఉన్నావు?' అడిగారు రాఘవరావుగారు వరండాలో స్థంభానికి చేరగిలబడి ఉన్న తన కోడలు వసంతని చూసి.
ఆమె మెల్లిగా లేచి 'మన వంశీ గురించే మామయ్యగారూ! మీకు తెలుసుగా స్వతహాగా వాడు చాలా చురుకైనవాడు. కానీ ఈ మధ్య ఎందుకో చాలా డల్‌గా తయారయ్యాడు. ఏమిటని అడిగితే కారణం చెప్పడు' అంది.
'అంతేనా? అది నేనూ గమనించాను. ఆ సంగతి నేను కనుక్కుంటాలేగానీ ముందు నువ్వు ఇలా డల్‌గా ఉండటం మానేసి, మాంఛి ఘుమఘుమలాడే కాఫీ పట్రా తల్లీ' అనటంతో ఆమె నవ్వి, 'అలాగే' అంటూ లోపలికి వెళ్ళిపోయింది.
దాదాపు 35 ఏళ్లు గవర్నమెంటు టీచరుగా పనిచేసిన ఆయన ఈ మధ్యే రిటైరయ్యాడు. అప్పటికే ఆయన భార్య కన్నుమూసింది. ఆయన కొడుకు ఓంకార్‌, సిటీ ఔట్‌స్కర్ట్స్‌లో ఏదో ఫ్యాక్టరీ నడుపుతుంటాడు. అతడెప్పుడూ ఆఫీసు పనిలో బిజీగా వుండటంమూలాన, ఆయన కోడలు వసంతే పిల్లల చదువు గురించి చూసుకునేది. కానీ ఉన్నట్లుండి వంశీ అలా ఎందుకు మారిపోయాడో ఆమెకు అంతు పట్టలేదు.
వంశీ ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌లో ఇంగ్లీష్‌లో బొటాబొటి మార్కులు చూడగానే రాఘవరావుగారికి స్కూల్లో ఏదో జరిగి వుంటుందని అర్థమైంది. లేకుంటే వంశీ మార్కులు అలా వుండవు. వంశీ మునుపులా హుషారుగా లేకపోవటం, ఏదైనా అడిగినా పుల్లవిరుపు సమాధానాలివ్వటం చూశాక ఆయనకు అనుమానం బలపడింది. క్లాసులో పాఠాలు అర్థం కావటంలేదేమోనని మనవడిని దగ్గర కూర్చోబెట్టుకుని, పాఠాలు చెబుదామని ఆయనెంతో ప్రయత్నించాడు. కానీ ఆయన చెప్పేది వాడు బుర్రకి ఎక్కించుకోకపోగా 'నువ్వు చెప్పేది నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావటంలేదు తాతయ్యా' అన్నాడు.
దాంతో ఆయన 'ఎంతోమంది నా దగ్గర చదువుకుని గొప్పవాళ్ళు అయ్యారు. ఈ కుర్రకుంకకి నేను చెప్పేది అర్థం కావట్లేదా? ఇదేం విచిత్రం. ఎందుకైనా మంచిది ఒకసారి వీడి స్కూలుకు వెళ్లి ఈ సంగతేమిటో తేల్చుకోవాలి' అనుకున్నారు.
అనుకున్నట్లుగానే ఓ రోజు రాఘవరావుగారు వంశీ చదివే స్కూలుకి వెళ్ళారు. స్కూల్‌ ప్రిన్సిపల్‌ ఆయన్ని సాదరంగా ఆహ్వానించాడు. తన మనవడిలో వచ్చిన మార్పు గురించి ఆయనకు చెప్పి 'స్కూల్లో ఏదైనా అనుకోని సంఘటన జరిగిందా? పిల్లల మనసు మీద ఎక్కువ ప్రభావం చూపే సంఘటన... మీరేమైనా గమనించారా?' అని ఆయన అడగటంతో ప్రిన్సిపల్‌ ఆలోచనలోపడ్డాడు. కొద్ది క్షణాల తర్వాత ఆయన 'ఇది ఎంతవరకు కరెక్టో తెలీదుగానీ, ఈ మధ్య ఒక టీచర్‌ తనకి గవర్నమెంట్‌ ఉద్యోగం వచ్చిందని, స్కూలు వదిలి, వెళ్ళిపోయాడు. ఆ టీచరంటే పిల్లలకి చాలా ఇష్టం అని అందరూ అంటుంటారు. మీవాడికి అదే మనసులో ఉందేమో' అని చెప్పాడు.
ఆయనకు పిల్లల సైకాలజీ తెలుసు. 'వారు ఇష్టపడే టీచరుంటే వాళ్ళ చదువు బాగా సాగుతుంది. తన మనవడి విషయంలో ఆ ప్రిన్సిపల్‌ చెప్పింది నిజమై వుంటుంది. లేకుంటే వున్నట్లుండి ఇలా ఎందుకు మారిపోతాడు. చూద్దాం ఆ టీచర్ని కలిస్తే సంగతి తెలిసిపోతుంది' అనుకుని అక్కడ సెలవు తీసుకుని బయల్దేరారు. వస్తూ వస్తూ ఆ టీచర్‌ ఇంటి అడ్రస్‌ తీసుకోవటం మరచిపోలేదాయన.
మర్నాడు ఆ టీచర్‌ ఇల్లు కనుక్కుని, వెళ్లి కలిశారు. అతని పేరు కృష్ణ.
'మీరు ఈ మధ్య ఉద్యోగం మానేసిన స్కూల్లో, ఆరో తరగతి చదువుతున్న వంశీవాళ్ళ తాతయ్యని నేను. పేరు రాఘవరావు' అని పరిచయం చేసుకున్నారాయన.
కృష్ణ ఆయనకు నమస్కరించి, లోపలికి ఆహ్వానించి కూర్చోమని చెపుతూ 'చెప్పండి సర్‌' అన్నాడు.
'ఒక చిన్న పని మీద నేనిప్పుడు మీ దగ్గరకు వచ్చాను' అంటూ తన మనవడి సంగతి చెప్పారు.
అతను అంతా విన్నాక 'నిజమే సర్‌. తాము ఇష్టపడినవారు దూరమైతే పిల్లలు తట్టుకోలేరు. వంశీకి నేనంటే చాలా ఇష్టం. ప్రాబ్లం నా వల్ల వచ్చింది కాబట్టి దాన్ని నేనే సరిచేస్తాను. ఈ ఆదివారం నేను మీ ఇంటికొస్తాను' అన్నాడు. సరేనంటూ లేచాడాయన.
అన్నట్లుగానే కృష్ణ ఆదివారం ఉదయమే రాఘవరావుగారింటికి వచ్చాడు. అతన్ని చూడటంతో ఇంటిముందు ఆడుకుంటున్న వంశీ ముఖం వికసించింది. అతను వంశీ భుజాలపై చేతులు వేసి 'ఎలా ఉన్నావు?' అని ఆత్మీయంగా అడుగుతూ లోపలికి నడిపించుకెళ్ళాడు.
రాఘవరావుగారు, ఓంకార్‌ హాల్లో ఉన్నారు. లోపలికి వస్తూనే 'నాన్నా. మా మాస్టారు..' అంటూ నవ్వుతూ చెప్పాడు. ఈ మధ్య కాలంలో వంశీ అంత ఉత్సాహంగా ఉండటం ఎవరూ చూసి వుండలేదు.
వసంత అందరికీ కాఫీ తెచ్చిచ్చింది. కృష్ణ తన పక్కనే ఉన్న వంశీ భుజాల చుట్టూ చేతులు వేసి, దగ్గరికి తీసుకుని కూర్చున్నాడు. వంశీ మొహం వెలిగిపోతోంది. వసంత కూడా వచ్చి అక్కడ కూర్చుంటూ 'మాస్టారూ! మీ శిష్యుడీమధ్య చదువులో చాలా డల్‌ అయిపోయాడు' అంది. ఆ మాటలతో వంశీ ముఖం మాడిపోయింది. అక్కడ్నుంచి లేచి వెళ్లిపోబోయాడు. అప్పుడు కృష్ణ ఆమెతో 'అలా ఏమీ వుండదండీ. మా వంశీ చాలా తెలివైనవాడు' అని వంశీతో 'నీ రూం నాకు చూపించవా?' అనడిగాడు. ఇద్దరూ కలిసి వంశీ రూంలోకి వెళ్ళారు.
రూమంతా నీటుగా సర్ది వుంది. అది చూసి 'నీ రూం చాలా బాగుంది వంశీ' అని మెచ్చుకున్నాడు. ఆ తర్వాత 'ఎలా చదువుతున్నావు?' అనడిగాడు. వంశీ సమాధానం చెప్పలేదు. అయితే అప్పుడే లోపలికి వచ్చిన రాఘవరావుగారు 'ఫర్వాలేదు బాగానే చదువుతున్నాడు. కాకపోతే ఇంగ్లీషు సబ్జెక్టుతోనే కాస్త ఇబ్బంది పడుతున్నాడు. ఇంతకుముందంటే మీరుండేవారు. ఇప్పుడు అదే వాడికి కష్టమై కూర్చుంది' అన్నారు.
'ఇబ్బందేముంది? మీరున్నారు గదా సర్‌. ఇంకేం కావాలి.. కదా వంశీ?' అన్నాడతడు.
దానికి కూడా వంశీ ఏమీ మాట్లాడలేదు. అయితే రాఘవరావుగారు కల్పించుకుని 'మీరన్నది బాగానే ఉంది. కానీ మావాడికి నేను చెప్పే పాఠాలు అర్థం కావడం లేదట!' అన్నారు.
కృష్ణ ఆశ్చర్యపోయినట్లుగా వంశీ వైపు చూసి 'ఏం వంశీ.. మీ గ్రాండ్‌ ఫాదర్‌ చెప్పేది నీకు అర్థం కావట్లేదా?' అనడిగాడు.
'ఎస్‌ సర్‌. మా గ్రాండ్‌ ఫాదర్‌ చెపితే మీరు చెప్పినట్లుండదు' అన్నాడు.
అతడు చిన్నగా నవ్వి 'అవునా? విచిత్రంగా వుందే. ఇంగ్లీష్‌ టీచరుగా మీ తాతగారికి మంచి పేరుందని విన్నానే. ఆయన చెప్పేది నీకు అర్థం కాకపోవటం నిజంగానే విచిత్రం. చూడు వంశీ! ఇప్పుడు నీకొక కథ చెప్తాను. కథ అంటే కాశీమజిలీ కథ కాదు. నిజంగా జరిగిందే. వింటావా?' అనడిగాడు.
కథ అనగానే వంశీ ఉత్సాహంగా 'చెప్పండి' అన్నాడు.
'ఒక ఊర్లో ఒక కుర్రాడుండేవాడు. వాడికి ఇంగ్లీష్‌ అంటే చాలు జ్వరం వచ్చేసేది. వాడు ఎంత చదివినా ఆ సబ్జెక్ట్‌ బుర్రకెక్కేది కాదు. అర్థమౌతోందా?' అని ఆగాడు. వంశీ తల దించుకున్నాడు. అతడు ఏం చెప్పదలచుకున్నాడో రాఘవరావుకి అర్థం కాలేదు. అయినా అతడు చెప్పేది వినసాగాడు.
అతడు మళ్ళీ అందుకుని 'ఆ పిల్లాడికి ప్రతి సబ్జెక్టులోనూ ఓ మోస్తరుగా మార్కులొచ్చినా, ఇంగ్లీష్‌లో మాత్రం ఎప్పుడు చూసినా సింగిల్‌ డిజిట్‌ దాటేవాడు కాదు. పదో తరగతి గట్టెక్కటానికి దండయాత్రలు చేయటంలో వాడు గజనీ, ఘోరీలను మించిపోయాడు. ఆ ఊర్లో వాడిని చూసి నవ్వనివాడు లేడనుకో. చివరికెలాగైతేనేం కాస్త పట్టుదలగా ప్రయత్నం చేసి, ఆ గండం నుంచి బయటపడి ఇంటర్‌లో చేరాడు.
అదే సమయంలో అదృష్టం వాడి తలుపు తట్టిందేమో అన్నట్లుగా వాళ్ళ ఇంటిపక్కన ఒక ఇంగ్లీష్‌ మాస్టరుగారు అద్దెకు దిగారు. ఆ మాస్టరుగారి దగ్గరికి చాలామంది పిల్లలు ట్యూషన్‌కి వచ్చేవాళ్ళు. వాళ్ళలో చాలామంది ఈ కుర్రాడికి స్కూల్లో జూనియర్లు. వాళ్ళు వీడిని చూసి 'ఇంటర్‌లో చేరావా? ఇదెన్నేళ్ళలో అవుతుందో?' అంటూ హేళన చేయటం మొదలుపెట్టారు. దాంతో వాడికి పట్టుదల పెరిగింది.
అప్పటినుంచి పొద్దున లేచింది మొదలు స్కూలు కెళ్ళేదాకా, స్కూల్నుంచి ఇంటికొచ్చిన దగ్గర్నుంచి పడుకునే వరకూ, వాడు తమ పక్కింట్లో ఆ మాస్టారు ఏ క్లాసు వాళ్ళకి పాఠం చెపుతున్నా, ఆ పక్కనే ఎక్కడో కూర్చుని, వినేవాడు. ఆయన ఏం చెబుతున్నాడో శ్రద్ధగా ఆలకించేవాడు. ఆయన ఇంగ్లీష్‌ ఉచ్ఛారణని వాళ్ళ పోర్షన్‌ కిటికీలోంచి చాలా జాగ్రత్తగా గమనించేవాడు. ఆయన చెప్పేది అర్థం కాకపోయినా అలా వింటూనే ఉండేవాడు. మెల్లిమెల్లిగా స్కూల్లో తోటిపిల్లలతో వచ్చీరాని ఇంగ్లీష్‌ మాట్లాడటం మొదలుపెట్టాడు. వాడి ఇంగ్లీష్‌ విని అందరూ 'నీ బట్లర్‌ ఇంగ్లీష్‌ భలేగుందిరా' అని హేళన చేసేవాళ్ళు. అయినా వాడు ఎవర్నీ పట్టించుకోకుండా తన ధోరణిలో మాట్లాడుతూనే ఉండేవాడు. ఇంట్లో వాళ్ళమ్మ ముందు వాడు ఇంగ్లీషు మాట్లాడుతుంటే ఆమె ఎంతో మురిసిపోయేది. వాడు ఇలా ఏకలవ్యుడిలా ఆ మాస్టారుకి తెలియకుండా, దూరంగా ఉంటూనే అన్నీ నేర్చుకోసాగాడు.
క్రమక్రమంగా వాడికి ఆ భాష మీద పట్టు పెరిగింది. దాంతో ఇంటర్లో వాడికి యాభై శాతంపైనే మార్కులు రావటంతో కాలేజీలో బీఏ ఇంగ్లీష్‌లో సీట్‌ దొరికింది. ఇక వాడు ఆ భాషలోని సాహిత్యాన్ని ఆకళింపు చేసుకున్నాడు. బీఏ డిస్టింక్షన్‌లో ఉత్తీర్ణుడై, యూనివర్సిటీలో ఎమ్మే ఇంగ్లీష్‌ లిటరేచర్‌లో చేరి, యూనివర్సిటీకే టాప్‌ ర్యాంక్‌ తెచ్చుకున్నాడు' అతడు చెప్పటం ఆపి, కాసిని మంచినీళ్లు తాగి మళ్ళీ మొదలుపెట్టాడు.
'ఇప్పుడు చెప్పు వంశీ.. ఏ ఇంగ్లీష్‌ కారణంగానైతే పదో తరగతిలో ఎన్నోసార్లు పల్టీలు కొట్టాడో, అదే ఇంగ్లీషులో అతడు యూనివర్సిటీకే ఫస్ట్‌గా నిలవటానికి కారణమేంటి?'
వంశీ నీళ్ళు నమిలాడు.
అతడు నవ్వి 'సర్లే అదీ నేనే చెపుతాను. పట్టుదల.. ఇంగ్లీష్‌ బాగా నేర్చుకోవాలన్న పట్టుదలే అతడిని ఆ స్టేజీకి తీసికెళ్లింది. కాదంటావా?' అని అడగటంతో వంశీ తలూపాడు అవునన్నట్లు.
'మరి ఇంతకీ ఆ అబ్బాయి ఎవరో తెలుసుకోవాలని ఉందా నీకు?' అని అడగటంతో వంశీ ఉత్సాహంగా తలూపాడు.
'అది ఎవరో కాదు.. నేనే' అనటంతో వంశీ ముఖం ఆనందంతో వెలిగిపోయింది.
తర్వాత కృష్ణ కుర్చీలోంచి లేచి వచ్చి, వంశీ భుజం పైన చెయ్యి వేసి 'మరి ఎవరివల్ల నేను ఇంతవాడినయ్యానో, ఆ నా అజ్ఞాత గురువెవరో తెలుసుకోవాలని లేదా?' అనడగంతో, వంశీ ఉత్సాహంగా అతనివైపు చూశాడు. అతడు వంశీని తీసుకుని వచ్చి, రాఘవరావు ఎదురుగా నిలుబడి 'ఆ మహానుభావులు మరెవరో కాదు మీ తాతగారే' అంటూ ఆయనకు పాదాభివందనం చేశాడు.
రాఘవరావు ఒక్కసారిగా ఆశ్చర్యచకితుడయ్యాడు. ఆయనకేమీ అర్థం కాలేదు. అతడు లేచి 'మాస్టారూ! ఇరవయ్యేళ్ళ క్రితం మీరు మా పక్కింట్లో అద్దెకు దిగారు. మొన్న మీరు మా ఇంటికొచ్చినప్పుడే నేను మిమ్మల్ని గుర్తుపట్టాను. నేను కుటుంబరావుగారి అబ్బాయిని' అన్నాడతడు.
తమ అద్దెకున్న ఇంటిపక్కన కుటుంబరావు అనే వాళ్ళెవరూ ఆయనకు గుర్తుకు రాలేదు. అయినా అద్దె ఇల్లు కాబట్టి తన పనేదో తాను చూసుకునేవాడు. అదీగాక పొద్దున్నే పిల్లల ట్యూషన్‌, మధ్యలో స్కూలూ, మళ్ళీ సాయంత్రం ట్యూషన్‌ పిల్లలతో తనకు రోజంతా గడిచిపోయేది. ఎవరైనా పని వుంటే వచ్చి తనని కలిసేవారేకానీ, తాను ఎవ్వరి ఇళ్ళకూ వెళ్ళేవాడు కాదు. ఎవ్వరితోనూ అంతగా పరిచయం కూడా పెంచుకోలేదు. అసలు తన ఇంటి ఓనర్‌తోనే ఎక్కువ మాట్లాడేవాడు కాదు. రెండేళ్ళ తర్వాత తనకి ట్రాన్స్‌ఫర్‌ అవటంతో తాను ఆ ఇల్లు ఖాళీ చేసేశాడు. అప్పట్లో బక్కపలచగా, చింపిరి జుట్టుతో, నిర్లక్ష్యంగా ఉండే కుర్రాడు ఒకడు తన పక్కింట్లో ఉన్న గుర్తు. అతడే ఈ కృష్ణ అన్నమాట. ఇప్పుడు చాలా మారిపోయాడు.
'నిన్ను గుర్తే పట్టలేదోరు. నీ పేరు కూడా గుర్తులేదు నాకు. నా దగ్గరికి పదో తరగతి పిల్లలు ట్యూషన్‌కి వచ్చేవాళ్ళు. నువ్వు ఇంటర్‌ కదా! అందుకే నేనూ నిన్ను పట్టించుకుని వుండను. నీ కృషీ, నీ పట్టుదలే నిన్నింతవాణ్ని చేశాయి. ఇందులో నేను చేసిందేమీ లేదు. అయినా నువ్వు నేడీ స్థితిలో ఉండటానికి కారణం నేనేనని చెప్పావు చూడు.. దానికి నాకెంత ఆనందంగా ఉందో తెలుసా?' అన్నాడు. నిజంగానే ఆయన గుండె సంతోషంతో ఉప్పొంగిపోయింది.
కృష్ణ ఆ తర్వాత వంశీ వైపు తిరిగి 'చాటుగా ఉండి, నేర్చుకుంటేనే ఇంతవాడిని అయ్యానంటే, ఆయనకు మనవడిగా పుట్టి, ఆయన దగ్గర డైరెక్టుగా చదువు నేర్చుకునే అవకాశం ఉన్న నువ్వు, ఎంత అదృష్టవంతుడివో ఆలోచించుకో. కృషీ, పట్టుదలా ఉంటే ఈ ప్రపంచంలో మనం సాధించలేనిది అంటూ ఏమీ ఉండదు. ఇంత గొప్ప గురువు వద్ద చదువు నేర్చుకునే అదృష్టం అందరికీ రాదు. కానీ నీకా అదృష్టం ఉంది. దాన్ని సద్వినియోగం చేసుకున్నావనుకో... నువ్వు చాలా గొప్పవాడివి అవుతావు. లేదంటే ఇక నేను చెప్పేదేమీ లేదు' అన్నాడు.
ఇంతకాలంగా తన తాతగారిని చిన్నచూపు చూసినందుకు వంశీ ముఖంలో పశ్చాత్తాప ఛాయలు కనిపించాయి. ఇక ఆరోజు నుంచి అతడికి తాతగారే గురువూ, దైవమూ అయిపోయాడు. ఆయన మీద నమ్మకం అపారంగా పెరిగిపోయింది. దాంతో అతడు చదువులో ఒక్కో మెట్టూ పైకెక్కుతూ, చివరికి సివిల్స్‌లో దేశంలోనే టాప్‌ ర్యాంక్‌ తెచ్చుకున్నాడు. ఆ సన్మానం రోజున వంశీ తనకు ఇష్టమైన టీచర్‌ అయిన కృష్ణని గుర్తుపెట్టుకుని మరీ ఆహ్వానం పంపాడు.

                                                                 ***

'కృష్ణా! వాడి చిన్నతనంలో ఆ రోజు నువ్వు మాట్లాడిన మాటలే వాడినెంతో ఉత్తేజితుడ్ని చేశాయి. నా మీద వాడికి ఎంతో నమ్మకాన్ని కలిగించాయి. వాడి భవిష్యత్తుని తీర్చిదిద్దాయి. ఆ కారణం వల్లనే వాడు ఇప్పుడింత ఎత్తుకి ఎదిగాడు. కాబట్టి ఇందులో నీ పాత్ర కూడా ఉంది' అన్నాడు రాఘవరావుగారు.
కృష్ణ చిరునవ్వు నవ్వాడు. అతనికి చాలా ఆనందంగా ఉంది.. ఆ ఆనందానికి మూలం 'ఆరోజు వంశీకి తాను కల్పించి చెప్పిన కట్టుకథ'. నిజానికి తన చిన్నతనంలో రాఘవయ్యగారిని చూసిందీ లేదు.. వాళ్ళ ఇంటిపక్కన ఉన్నదీ లేదు.. ఆయన చెప్పే పాఠాలు వినే అవకాశమేమీ తనకి కలగలేదు. కానీ వంశీలో ఆయన పట్ల నమ్మకం కలిగించటం కోసం తాను ఆయనకు ఏకలవ్య శిష్యుడినంటూ ఒక కల్పిత కథ చెప్పాడు. ఆ ఒక్క అబద్ధంతో, ఒకవైపు నలభై ఏళ్లుగా టీచర్‌గా పనిచేసినా పొందని తృప్తిని రాఘవరావుగారికి కలిగించాడు. మరోవైపు వంశీ వృద్ధిలోకి రావటానికి కూడా ఆ అబద్ధమే కారణమైంది'.

గండ్రకోట సూర్యనారాయణ శర్మ
96669 03960