Jul 06,2023 23:59

కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్న అధికారులు, హాజరైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు

- భోజనం, వసతి కల్పించకపోవడంతో ఇబ్బంది పడ్డ విద్యార్థులు, తల్లిదండ్రులు
ప్రజాశక్తి- రంపచోడవరం

రంపచోడవరం నియోజకవర్గం పరిధిలోని ఏకలవ్య పాఠశాలలు/ కళాశాలల్లో 6, 7 తరగతులు, ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి సంబంధించిన కౌన్సెలింగ్‌ గురువారం స్థానిక పిఎంఆర్‌సిలో నిర్వహించారు. 6వ తరగతిలో 50 సీట్లు ఉండగా, 250 మంది విద్యార్థులు, 7వ తరగతిలో 50 సీట్లుగాను 200 మంది, ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరానికి సంబంధించి 50 సీట్లుగాను 400 మంది విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. ఉదయం 8 గంటల నుండి రాత్రి వరకు ఈ కౌన్సెలింగ్‌ కొనసాగింది. ఎటపాక, చింతూరు, కూనవరం వంటి సుదూర ప్రాంతాల నుంచి కూడా విద్యార్థులు కౌన్సెలింగ్‌కు వచ్చారు. అయితే ఐటిడిఎ అధికారులు వారికి ఎటువంటి భోజన, వసతి సౌకర్యాలు కల్పించకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. మరో వైపు కౌన్సెలింగ్‌కు సంబంధించి సరైన సమాచారం ఇవ్వలేదని, తక్కువ సీట్లు ఉంటే అందరినీ పిలిచి ఇబ్బందులకు గురి చేశారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.