* జిల్లా జడ్జి జునైద్ అహ్మద్ మౌలానా
ప్రజాశక్తి - శ్రీకాకుళం: సెప్టెంబరు తొమ్మిదో తేదీన నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు రాజీ చేసేందుకు కృషి చేయాలని జిల్లా జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షులు జునైద్ అహ్మద్ మౌలానా పోలీసు అధికారులకు సూచించారు. జిల్లా కోర్టులోని కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లాలోని పోలీసు అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్ అదాలత్‌లో కేసులు రాజీ చేయడం వల్ల గ్రామీణ ప్రజల్లో స్నేహపూర్వకమైన వాతావరణం ఉంటుందన్నారు. ప్రత్యేక దృష్టిసారించి కక్షిదారులకు కౌన్సెలింగ్ నిర్వహించి ఎక్కువ కేసులు రాజీ చేసేందుకు కృషి చేయాలన్నారు. సమావేశంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఆర్.సన్యాసినాయుడు డిఎస్‌పిలు, సిఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.










