నీ ఉదర పానుపుపై పరుండనిదే నిద్దుర దరిచేరలేదే నాకు..!
నీ హస్తవిస్తరాకులోని స్పర్శలవిందును భుజించనిదే మనసునిండలేదే నాకు...!
నీ ప్రేమ మధురిమల సరిగంగలో తానమాడనిదే పొద్దుపోలేదే నాకు..!
వెన్నెలగిన్నెల్లో నీ కథలామృతం గ్రోలనిదే రోజు గడవలేదే నాకు...!
ఆ...బాల్యపు గురుతుల
తీపి అనుభూతులు వెల్లువై
నా మదిని తడుపుతూనే ఉన్నాయి నేటికీ ఆర్ద్రంగా..!
ఎంత దురదృష్టమో కదానాది
తొమ్మిది ఏళ్లకే ఆ కాలమహమ్మారి ఆ...మధురమమకారాలను కాలరాసింది..!
అయినా!
నీ జ్ఞాపకాల నీడలు నా వెంటే నడుస్తున్నాయి!
అనుక్షణం మదిని స్పృశిస్తూ మమతానురాగాలు పంచుతున్నాయి!!
నీ వయసు వారిని చూసిన ప్రతిసారీ
నా కళ్లు చెమ్మగిల్లిన చెలిమెలవుతున్నాయి..!
నీ స్మృతులు జోరీగలై ఎదలో రొదపెడుతున్నాయి..!
హృదయం ఘనీభవించి కనుకాంతులు దూరమవుతున్నాయి..!
నువ్వు నేర్పిన విలువలు
నువ్వు చెప్పిన ఊసులు
నీతో పంచుకున్న అత్మీయతలు
మధుర సరిగమలై ఆదర్శరాగాలను మీటుతున్నాయి భవిత విపంచిలో....!
ఎన్నటికీ నువ్వు ఓ వాడిపోని సుమమే నా బతుకు బృందావనంలో...!
- అయిత అనిత